బీఆర్ఎస్ సెల్ఫ్ గోల్స్ వేసుకుంటోందా ?

బీఆర్ఎస్ కీలక నేతలు తమంతటగా తమ జుట్టును రేవంత్ చేతికి ఇచ్చుకుని దెబ్బలు కొట్టించుకుంటున్నారా ? గ్రౌండ్ లెవల్లో జరుగుతున్నది చూస్తుంటేఇదే అనుమానం పెరిగిపోతోంది.

Update: 2024-08-21 07:00 GMT

బీఆర్ఎస్ కీలక నేతలు తమంతటగా తమ జుట్టును రేవంత్ చేతికి ఇచ్చుకుని దెబ్బలు కొట్టించుకుంటున్నారా ? గ్రౌండ్ లెవల్లో జరుగుతున్నది చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. తాజాగా రాజీవ్ విగ్రహం ఏర్పాటు వివాదమే బీఆర్ఎస్ వేసుకుంటున్న సెల్ఫ్ గోల్ కు ఉదాహరణగా నిలుస్తోంది. సచివాలయం ముందు రాజీవ్ గాంధి విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని రేవంత్ డిసైడ్ అయ్యారు. ముఖ్యమంత్రిగా ఇపుడు రేవంత్ ఏ నిర్ణయం తీసుకుని అమలుచేసినా అడ్డుకునేంత సీన్ బీఆర్ఎస్ లేదు. ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఏమిచెప్పినా రేవంత్ వినిపించుకోరని అందరికీ తెలిసిందే. ఎందుకంటే పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కేసీఆర్ కూడా ప్రతిపక్షాల్లో దేన్నీ లెక్కచేయలేదు. ఎవరేమి చెప్పినా వినలేదు కాబట్టే.

ఇపుడు విషయం ఏమిటంటే రాజీవ్ విగ్రహాన్ని సచివాలయం ముందు పెట్టాలని రేవంత్ డిసైడ్ చేయగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభ్యంతరం లేవనెత్తారు. తెలంగాణాతో ఏ సంబంధంలేని రాజీవ్ విగ్రహాన్ని సచివాలయం ముందు ఎలా పెడతారంటు విచిత్రమైన వాదన లేవదీశారు. ప్రధానమంత్రిగా పనిచేసిన రాజీవ్ కు తెలంగాణాతో సంబంధంలేదనటమే కేటీఆర్ వాదనలో పసలేదని అర్ధమైపోతోంది. తెలంగాణా ఇచ్చిన సోనియాగాంధీ భర్త, మాజీ ప్రధానమంత్రి హోదాలో రాజీవ్ విగ్రహాన్ని ఏర్పాటుచేస్తామని కొద్దిరోజులుగా రేవంత్, కాంగ్రెస్ నేతలు పదేపదే చెబుతున్నారు. సచివాలయం ముందు తెలంగాణా తల్లి విగ్రహం కాకుండా రాజీవ్ విగ్రహాన్ని పెడితే పీకి అవతలపాడేస్తామని కేటీఆర్ చేసిన హెచ్చరికలే సెల్ప్ గోల్ గా మారిపోయింది.

ఎలాగంటే రాజీవ్ విగ్రహం ఏర్పాటుగురించి కేటీఆర్ మాట్లాడకుండా ఉంటే సరిపోయేది. అలాంటిది రేవంత్ ను రెచ్చగొట్టడంతో ఏమైందంటే తెలంగాణా తల్లి విగ్రహాన్ని సచివాలయంలోనే ఏర్పాటుచేయాలని రేవంత్ డిసైడ్ అయ్యారు. కేటీఆర్ మాట్లాడకుండా ఉండుంటే రాజీవ్ విగ్రహాన్ని ఏర్పాటుచేసి తెలంగాణా తల్లి విగ్రహం గురించి రేవంత్ వదిలేసుండే వారే. అప్పుడు కేటీఆర్ మాట్లాడుంటే అప్పటికప్పుడు తెలంగాణా తల్లి విగ్రహం ఏర్పాటుపై రేవంత్ ఏదో ఒకటి చెప్పుండేవారు. కేటీఆర్ చేసిన గోలతో రేవంత్ ముందే మేల్కోని సచివాలయం బయట రాజీవ్ విగ్రహం, లోపల తెలంగాణా తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యారు. సచివాలయంలోపల తెలంగాణా తల్లి విగ్రహాన్ని ఎక్కడ పెట్టాలనే విషయమై కొన్ని ప్రాంతాలను రేవంత్ పరిశీలించారు కూడా. డిసెంబర్ 9వ తేదీన తెలంగాణా తల్లి విగ్రహాన్ని సచివాలయంలో ఏర్పాటు చేయబోతున్నట్లు రేవంత్ చేసిన ప్రకటనతో కేటీఆర్ నోటమాటలేకుండా పోయింది.

నిజానికి తెలంగాణా తల్లి విగ్రహానికి చోటులేకుండా చేసిందే కేసీఆరే. సచివాలయం విస్తరణపనులకు అడ్డుగా ఉందని చెప్పి తెలుగుతల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్ ముందునుండి తీయించేశారు. పనులన్నీ అయిపోయిన తర్వాత కేసీఆర్ తెలంగాణా తల్లి విగ్రహాన్ని పెడతారని అందరు అనుకున్నారు. అయితే తెలుగుతల్లి విగ్రహాన్నీ పెట్టలేదు తెలంగాణా తల్లి విగ్రహాన్నీ పెట్టలేదు. అంతకుముందు విగ్రహం ఉన్న స్ధలమంతా కేసీఆర్ ఖాళీగా ఉంచేశారు. అధికారంలో నుండి దిగిపోయి రేవంత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖాళీగా ఉన్న స్ధలంలో రాజీవ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అనుకున్నారు. రేవంత్ కు రాజీవ్ విగ్రహం ఏర్పాటుచేసే అవకాశం ఇచ్చిందే కేసీఆర్. తన హయాంలోనే కేసీఆర్ తెలంగాణా తల్లి విగ్రహం ఏర్పాటుచేసేసుంటే ఇపుడు రాజీవ్ విగ్రహం పెట్టే అవకాశం రేవంత్ కు ఉండేదికాదు.

గతంలో కూడా రైతురుణమాఫీపై కేటీఆర్, హరీష్ నానా యాగీ చేశారు. అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామని చెప్పి ఎందుకు చేయలేదంటు ఇద్దరు కీలకనేతలు నానా గోలచేశారు. రుణమాఫీ చేయాలంటు ఇద్దరూ రేవంత్ వెంటపడ్డారు. దాంతో అలర్టయిన రేవంత్ రైతు రుణమాఫీ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఆగస్టు 15వ తేదీకల్లా రుణమాఫీ చేసేస్తామని ప్రకటించారు. అప్పుడు ప్రకటించినట్లుగానే ఆగష్టు 15వ తేదీకి మూడు విడతల్లో రుణమాఫీ చేసేశారు. రుణమాఫీలో కవర్ కాని రైతులు సుమారు 8 లక్షలమందికి, టెక్నికల్ సమస్యలను ఎదుర్కొంటున్న రైతులకు కూడా వీలైనంత తొందరగానే రుణమాఫీ చేస్తామని రేవంత్ హామీఇచ్చారు.

అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోనే ఆరుహామీలను నెరవేరుస్తామని హామీ ఇచ్చిన రేవంత్ ఫెయిలయ్యారంటు బాగా రెచ్చగొట్టారు. దాంతో మేల్కొన్న రేవంత్ మొదటి నెలలో రెండు హామీలను మరుసటి నెలలో మరో రెండు హామీలను తర్వాత ఐదో హామీని అమల్లోకి తెచ్చారు. ముందు ఆరోగ్యశ్రీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేశారు. తర్వాత ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు, ఆ తర్వాత 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ను అమల్లోకి తెచ్చి వెంటనే రైతు రుణమాఫీ కూడా అమలుచేశారు. ఇక మిగిలింది మహిళలకు నెలకు రు. 2500 పెన్షన్ పెండింగులో ఉంది. ఈ పథకం అమలుకు కూడా అధికారులు కసరత్తు చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు వెంటపడకపోతే రేవంత్ పై హామీలను మెల్లిగా ఎప్పుడో అమల్లోకి తెచ్చుండేవారు. కేటీఆర్, హరీష్ వెంటపడి గోలచేస్తుండటంతో రేవంత్ అర్జంటుగా హామీలను నెరవేర్చటం మొదలుపెట్టారు. దీంతోనే బీఆర్ఎస్ సెల్ఫ్ గోల్స్ వేసుకుంటోందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

Tags:    

Similar News