'గబ్బర్ సింగ్' స్టైలే ఈ ఐపీఎస్ పిఎస్సార్ ఆంజనేయలుది!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో అరెస్ట్ అయిన తొలి ఐపీఎస్ PSR Anjaneyulu. ప్రస్తుతం విజయవాడ జైల్లో ఉన్న ఆంజనేయులు గతమంతా వివాదాస్పదమే.;

Update: 2025-04-23 06:02 GMT
PSR Anjaneyulu
పెండ్యాల సీతారామాంజనేయులు.. ఇండియన్ పోలీస్ సర్వీస్- ఐపీఎస్- అధికారి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో అరెస్ట్ అయిన తొలి ఐపీఎస్ కూడా. ప్రస్తుతం విజయవాడ జైల్లో ఉన్న ఆంజనేయులు గతమంతా వివాదాస్పదమే. ప్రముఖ నటుడు, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సినిమా 'గబ్బర్ సింగ్' టైపు. ప్రజా దర్బార్లు నిర్వహిస్తాడు. మాట వినని రౌడీషీటర్లకు అరదండాలేస్తాడు, సాయం కోసం వచ్చిన ఆడవాళ్లతో ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తారు. కోర్టులు మందలించినా, శిక్షించినా, ప్రజాసంఘాలు అరిచిగీపెట్టినా ఖాతరు చేయడమనేది ఆయన డిక్షనరీలోనే లేదు.
"నా పేరు రామ్. నా భార్య నాపై ఉంచిన నమ్మకమే నాకు అతిపెద్ద బలం. నా మనస్సాక్షి చెప్పినట్టు నడుచుకుంటా. ఇతరుల గురించి పట్టించుకోను" అన్నది సీతారామాంజనేయులు మతం.
ఆది నుంచి ఇప్పటి దాకా ఆయన స్టైలే వేరు. ఆయన పని చేసిన ప్రతి జిల్లాలో ఏదో ఒక వివాదంలో చిక్కుకున్న వాడే. విజయవాడ పోలీసు కమిషనర్ గా ఉన్నప్పుడు ఓ మహిళా డాక్టర్ తో అసభ్యంగా మాట్లాడారంట కదా అంటే 'అది కౌంటర్ ట్రాప్ అండీ' అంటారు. అసభ్యకరమైన SMSలు పంపడమే కాకుండా, లైంగిక ప్రయోజనాల కోసం తన అధికారిక ఫోన్ నుంచి సుమారు 50కి పైగా కాల్స్ చేసిన ఘనత కూడా ఆయనదే.
1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. పోలీసు వర్గాలలో ఆయన ముద్దుపేరు PSR. ఆయనంటే టెర్రరే. గుంటూరు నుంచి హైదరాబాద్ వచ్చి సెటిల్ అయిన సీతారామాంజనేయులు కుటుంబానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) తో అనుబంధం ఉంది. ఈయన కూడా బాల్యంలో ఆర్ఎస్ఎస్ తో సంబంధాలు నెరిపేవారని ఆయన సన్నిహితులు చెబుతారు.
పీఎస్ఆర్ ఢిల్లీలోని ఇంటెలిజెన్స్ బ్యూరోలో డిప్యుటేషన్ పై చేరారు కానీ ఆశ్చర్యకరంగా తన పూర్తి పదవీకాలం పూర్తి కాకముందే తిరిగి వచ్చారు. ఆయన ప్రవర్తన కారణంగా ఆయనను ఐబీ నుండి బదిలీ చేశారని పుకార్లు వచ్చాయి. రౌడీలను, చిన్న రాజకీయ నాయకులను "కౌన్సెలింగ్" పేరుతో తన ఛాంబర్లకు పిలిపించే ఆయన శైలి సంచలనం సృష్టించింది. ఆయన తన మనుషులతో కలిసి వారిని నిర్దాక్షిణ్యంగా కొట్టేవారు. గుంటూరు ఎస్పీగా ఉన్నప్పుడు రౌడీలను, చోటామోటా రాజకీయ నాయకులకు ఆయన తనదైన శైలిలో కౌన్సిలింగ్ ఇచ్చి వివాదంలో చిక్కుకున్నారు.
టెర్రర్ ఆయన శైలి...
సివిల్ వివాదాల పరిష్కారంలో జోక్యం చేసుకోవద్దని పోలీసులకు హైకోర్టు తాకీదులు ఇచ్చాదాక ఆయన శైలి వెళ్లింది. గబ్బర్ సింగ్ సినిమా స్టైల్లో దేశం మొత్తానికి ఓ చట్టం ఉన్నా ఆయన చట్టం వేరు. దానిపేరే భయం.. టెర్రర్ సృష్టించడం ఆయన స్టైల్.
2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పీఎస్సార్ ఆంజనేయులును ఖమ్మం జిల్లాకు బదిలీ చేశారు. అక్కడ కూడా ఆయన స్టైల్ ఆయనదే. కర్నూలు, గుంటూరులకు ఎస్పీగా పనిచేశారు. అప్పుడు కూడా వివాదాల్లో చిక్కుకున్నారు. చట్టంతో ఆటాడుకోవడం ఆయనకు మహా సరదా. విజయవాడలో 'దర్బార్'ను కొనసాగించాడు. అకతాయిల ఆట కట్టించే పేరిట సీతారామాంజనేయులు బాగా రెచ్చిపోయేవారనే నానుడి ఉంది. అవసరమైతే పోలీసు భాషలో 'లేపేయడం' కూడా చేస్తుండే వారనే ఆరోపణలు ఉన్నారు.
పిఎస్ఆర్ గుంటూరు ఎస్పీగా ఉన్నప్పుడు ఈవ్-టీజింగ్ కేసులో ఓ కుర్రాణ్ణి కొడితే తలపగిలి అధిక రత్తస్రావంతో చనిపోయాడు. మరో ఇద్దరు యువకులు 'కౌన్సెలింగ్'కు హాజరు కాకముందే ఆత్మహత్య చేసుకున్నారు. కర్నూలులోని రోటరీ ఇంటర్నేషనల్ మహిళా ఆఫీస్ బేరర్ ఒకరు PSR ను గుంటూరుకు బదిలీ చేసిన తర్వాత ఆయనపై లైంగిక వేధింపుల కేసు పెట్టారు.
"చట్టాన్ని, మహిళలను గౌరవించని అధికారికి ఆ పదవిలో కొనసాగే హక్కు లేదు. అతని విధానాలు హింస, అనైతికతతో నిండి ఉన్నాయి" అని ప్రోగ్రెసివ్ ఆర్గనైజేషన్ ఫర్ ఉమెన్‌కు చెందిన వి సంధ్య ఫిర్యాదు చేశారు. కర్నూలులో ఒకరిద్దరు రాజకీయ నాయకుల్ని సైతం ఆయన అల్లాడించిన చరిత్ర ఉంది.
పోలీసు స్టేషన్ కి వచ్చిన మహిళల్ని శారీరకంగా లొంగదీసుకునే వారని ఆరోపణలు ఉన్నాయని IDWA నాయకురాలు పి. రమాదేవి అన్నారు.
మహిళలకు న్యాయం చేసే పేరిట PSR వారితో అసభ్యంగా ప్రవర్తించే వారనే ఆరోపణలు ఉన్నాయి. క్లాసికల్ డ్రింకర్ గా పేరుంది.
"దేశం స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న ఆగస్టు 15న ఈ అధికారి మద్యంతో పార్టీని నిర్వహించిన సంగతి నాకు తెలుసు. దానికి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి" అని మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆరోపించిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం.
పీఎస్సార్ వ్యవహారశైలిపై పోలీసు బాసులు ఫిర్యాదు చేసినా ఆయన ఏమాత్రం పట్టించుకోడు. మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ స్వరంజిత్ సేన్ పీఎస్సార్ ఆంజనేయులు పని తీరుపై తీవ్ర ఆక్షేపణలు వ్యక్తం చేస్తూ సర్వీసు రిజిస్టర్ లోనే రాశారు. "పిఎస్సార్ తీరు మార్చుకోవాలని నేను అనేక సార్లు చెప్పిన ఆయన మార్చుకోలేదు" అని ఆయన అన్నారు.
పిఎస్ఆర్ మోటు ప్రవర్తన, వ్యవహార శైలిపై హైకోర్టు అనేకసార్లు ఆక్షేపించింది. మందలించింది. ఓ కేసులో దురుసు ప్రవర్తనకు ఆయనకు హైకోర్టు ఓ రోజు రోజంతా కోర్టులో నిల్చోమని ఆదేశించింది. అయినా ఆయనా భే ఖాతర్. పోలీసు ఉన్నతాధికారులలో ఆయనకో లాబీ ఉంటుంది. అందువల్ల ఆయన ఏమి చేసినా చెల్లుబాటు అయ్యేది.
రౌడీషీటర్లను కొట్టినా, దొంగల పేరిట ఒకరిద్దర్ని ఎన్ కౌంటర్ చేసినా ఆయనకు ఏమీ కాలేదు. ఆయన విచ్చలవిడి ప్రవర్తన ఏమీ ఆగలేదు. తరచూ తన ఫోన్ నంబర్‌ను ప్రత్యేకించి మహిళా ఫిర్యాదుదారులకు ఇచ్చి వాళ్లను అందుబాటులో ఉండమని చెప్పేవారని మహిళా సంఘాలు ఆరోపించాయి.
ఖమ్మం ఎస్పీగా ఉన్నప్పుడు భక్త రామదాసు ట్రస్ట్ వంటి సాంస్కృతిక సంఘాలతో, లయన్స్/రోటరీ ఇంటర్నేషనల్ వంటి ప్రైవేట్ ఎన్జీఓలతో, మహిళా ఆఫీసు బేరర్లతో మాట్లాడటానికి ఎక్కువ సమయం కేటాయించేవారనే ఆరోపణలను కూడా ఎదుర్కొన్నారు.
ఇప్పుడు ముంబైకి చెందిన నటి కాదంబరి జెత్వానీ కేసులో అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో సహ నిందితులందరూ ముందస్తు బెయిల్ తీసుకున్నా పిఎస్సార్ ఆంజనేయులు మాత్రం బెయిల్ తీసుకోలేదు. తనను అరెస్ట్ చేయరన్న ధీమానో లేక చట్టాన్ని ఖాతరు చేయకపోవడమనే తన సహజశైలో తెలియడం లేదని ఓ సీరియర్ జర్నలిస్టు వ్యాఖ్యానించారు. నటి జెత్వానీని తప్పుడు కేసులో అరెస్టు చేసి వేధించాడనే ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు సీనియర్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులును అరెస్టు చేశారు.
నాటకీయ పరిణామాల మధ్య ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏప్రిల్ 22 మంగళవారం హైదరాబాద్‌లోని ఆయన ఫామ్ హౌస్ నివాసం నుంచి సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులును అదుపులోకి తీసుకుని, విచారణ కోసం విజయవాడలోని సిఐడి కార్యాలయానికి తరలించారు.
డైరెక్టర్ జనరల్ హోదాలో ఉండి, గత వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేసిన ఆంజనేయులు, మరో ఐదుగురు అధికారులు ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో గత ఏడాది నుంచి సస్పెన్షన్ లో ఉన్నారు.
ఆయన పని చేసిన ప్రతి చోటా వివాదాలలో చిక్కుకున్నారు. ఇటీవలి కాలంలో అరెస్ట్ అయిన తొలి ఐపీఎస్ అధికారి పిఎస్సార్ ఆంజనేయులే.
Tags:    

Similar News