వంశీ నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీపై విచారణ

విచారణ కోసం వంశీని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కంకిపాడు పీఎస్‌కు తరలించారు.;

Update: 2025-05-23 08:34 GMT

విజయవాడ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. బాపులపాడు నకిలీ పట్టాల పంపిణీ కేసులో వంశీని విచారణ కోసం కస్టడీలోకి తీసుకున్నారు. విజయవాడ జైలు నుంచి కంకిపాడు పోలసు స్టేషన్‌కు వంశీని తీసుకెళ్లారు.

ఎమ్మెల్యేగా ఉండగా గత ప్రభుత్వంలో ఏలూరు జిల్లా పరిధిలోని బాపులపాడు మండలంలో నకిలీ ఇళ్లపట్టాలు పంపిణీ చేశారని ఆరోపిస్తూ వల్లభనేని వంశీ, అతని అనుచరుడు మోహన్‌ రంగారావులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపైన విచారణ చేపట్టిన నూజివీడు కోర్డు 14 రోజుల పాటు జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. దీంతో వంశీని మళ్లీ విజయవాడ జైలుకు తరలించారు. ఈ కేసులో వంశీని విచారించాల్సి ఉందని అందువల్ల పోలీసు కస్టడీకి అప్పగించాలని కోర్టును పోలీసులు కోరారు. దీనిపై స్పందించిన కోర్టు రెండు రోజుల పాటు పోలీసుల కస్టడీకి అప్పగిస్తూ కోర్టు అనుమతులు జారీ చేసింది.
ఈ క్రమంలో తొలి రోజు విచారణకు వంశీని కంకిపాడు పోలీసు స్టేషన్‌కు తరలించారు. రేపు కూడా విచారణ చేపట్టనున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి విచారణలో వంశీ ఇచ్చే వాంగ్మూలంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరో వైపు వివిధ కేసుల్లో వంశీ రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. వీటిల్లో సత్యవర్థన్‌ కిడ్నాప్‌ కేసులో వంశీకి బెయిల్‌ మంజూరు చేసింది. వెంటనే మరో రెండు కేసులను వంశీ మీద నమోదు చేశారు. గన్నవరంలో అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారనే కేసుతో పాటు నకిలీ ఇళ్ల పట్టాల కేసులు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో వంశీ విడుదల అనేది ప్రశ్నార్థకంగా మారింది.
Tags:    

Similar News