బాలుర ప్రాణం తీసిన మత్తు..! ఇది ప్రభుత్వ పాపమే: ఓ తల్లి వేదన
డ్రగ్స్ ఇద్దరు బాలుర ప్రాణాలు తీసింది. దీంతో పీలేరు ఉలిక్కి పడింది. తక్షణం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఇది ఇది ప్రభుత్వాల పాపమే అని తల్లిదండ్రులు నిందించారు.
By : SSV Bhaskar Rao
Update: 2024-10-23 13:09 GMT
"డ్రగ్స్, ప్రధానంగా గంజాయి విక్రయాలు, రవాణా ఉక్కు పాదంతో అణిచివేస్తాం" అని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అక్రమ రమణా విషయం పక్కకు ఉంచితే, ఈ మత్తుకు బానిస అయిన ఇద్దరు బాలురు రైలు వస్తోందనే విషయాన్ని కూడా గమనించని స్థితిలో, ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనతో పీలేరు ప్రాంతం ఉలిక్కిపడింది.
"ప్రభుత్వాల నిర్లక్ష్యానికి మా బిడ్డలు బలయ్యారు"అని వారి తల్లిదండ్రులు శోకిస్తున్నారు. బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రులను పరామర్శించడానికి వెళ్లిన టీడీపీ నాయకుల వద్ద ఓ బాలుడి తల్లి తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే..
ఆగని విక్రయాలు
ప్రభుత్వం ఎన్ని మాటలు చెబుతున్నా, రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ఉన్నత స్థాయిలో అధికారులతో సుదీర్ఘంగా సమీక్షిస్తున్నా, క్షేత్ర స్థాయిలో విక్రయాలు ఆగడం లేదు. తరచూ నిర్వహించే తనిఖీల్లో భారీ స్థాయిలోనే అక్రమ రవాణా చేస్తున్న గంజా స్వాధీనం చేసుకుంటున్నారు. మినహా ప్రొఫెషనల్ కాలేజీల వద్ద గంజా విక్రయిస్తున్నారనే ఆరోపణలు పరిగణలోకి తీసుకున్నట్లు కనిపించడం లేదు. దీంతో, ఇది కాస్తా ఇంటర్ కాలేజీల వద్ద కూడా విచ్చలవిడిగా విక్రయించే స్థాయికి వెళ్లిందని తెలుస్తోంది. దీనిని కట్టడి చేయడంలో, ముఖ్యంగా రహస్యంగా సమాచారాన్ని రాబట్టడంలో పోలీసుల కంటే ఆ విభాగంలోని గూడచారి వర్గాలు విఫలం చెందుతున్నట్లు కనిపిస్తోంది.
సందేహాస్పదంగా ఉన్న ప్రాంతాలే కాకుండా విద్యాసంస్థల వద్ద గంజా అక్రమంగా విక్రయిస్తున్నారని విషయంలో దృష్టి సారించకపోవడం వల్ల పసిపిల్లల ప్రాణాలు గాలిలో కలవడమే కాదు. కొందరి జీవితాలను నేర ప్రవృత్తి వైపు మళ్లించేలా చేస్తున్నాయి. దీంతో, టీనేజ్ దాటని పిల్లలు కూడా మత్తుకు బానిస అవుతున్నారు. నిండు ప్రాణాలను బలి చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి తాజాగా జరిగిన సంఘటన పూర్వాపరాల్లోకి వెళితే..
ఉమ్మడి చిత్తూరు జిల్లా పీలేరు (ప్రస్తుతం అన్నమయ్య జిల్లా) ఇద్దరు బాలురు రైలు పట్టాలపై కూర్చొని మద్యం తాగుతూ ఉన్నారని అంటున్నారు. కానీ ఆ ఇద్దరిలో పీలేరు పట్టణానికి చెందిన శ్రీనివాసులు కొడుకు కిరణ్ కుమార్ (19), ఇది పట్టణానికి చెందిన స్నేహితుడు యాసిన్ (17) తో కలిసి పులిచెర్ల రోడ్డులో రైలు పట్టాలపై కూర్చొని మద్యం తాగుతున్నారు. అదే సమయంలో వస్తున్న నాగర్ కోయిల్ ఎక్స్ప్రెస్ రైలు ఢీకొంది. దీంతో వారు మరణించారని సమాచారం అందినట్లు కదిరి రైల్వే ఎస్సై రహీం వెల్లడించారు. రైలు పట్టాలపై మరణించిన కిరణ్ కుమార్, యాసిన్ మృతదేహాలను పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు.
టీడీపీ నేతలకు నిరసన సెగ?
ఇద్దరు బాలురు మరణించిన సమాచారం తెలుసుకున్న పీలేరు టీడీపీ నాయకులు బాధితులను పరామర్శించడానికి వారి ఇంటి వద్దకు వెళ్లినట్లు తెలిసింది. ఈ సమయంలో మృతి చెందిన కిరణ్ కుమార్ తల్లి తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేసినట్లు సమాచారం అందింది. "ఈ ప్రభుత్వాలు పాపానికే మా బిడ్డలను పోగొట్టుకున్నాం. గంజాయి ఇతర మత్తు పదార్థాలు అమ్ముతున్న విషయం తెలిసిన పోలీసులు పట్టించుకోలేదు. మేము కూడా గతంలో చెప్పి చూశాం" అని కిరణ్ కుమార్ తల్లి శోకాలు పెడుతూ నిందించినట్లు తెలిసింది. దీంతో ఏమి చేయాలో పాలుకునే టిడిపి నాయకులు.." గంజాయి ఇలా పెరగడానికి గత ప్రభుత్వం చేసిన పాపమే" అని సర్ది చెప్పడానికి విఫలయత్వం చేసినట్లు తెలిసింది. బాధితుల కుటుంబం నుంచి నిరసన ఎక్కువగా ఉండడంతో వారు అక్కడి నుంచి తిరిగి వచ్చేసినట్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా,
రైలు పట్టాలపై ఆ గొట్టం ఏమిటి?
మత్తులో రైలు కింద పడి చనిపోయిన కిరణ్ కుమార్, యాసిన్ మృతదేహాలకు సమీపంలోని ఓ చెక్క గొట్టం అమర్చిన ప్లాస్టిక్ బాటిల్ లభ్యమైంది. దీని ద్వారా వారు గంజా పీలుస్తున్నట్లు సందేహిస్తున్నారు. పీలేరు పట్టణంలోనే కాకుండా, కొన్ని కాలేజీల వద్ద కూడా గంజా విక్రయిస్తున్నట్లు తాజాగా ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
గతంలో..
మత్తులో రైలు కిందపడి మరణించిన ఆ బాలురిద్దరికే చిన్నతనంలోనే మత్తు పదార్థాలు అలవాటైనట్లు తెలుస్తోంది. దీంతో కిరణ్ కుమార్ ను ఏడాదికి కిందట హైదరాబాదులోని రిహాబిలిటేషన్ కు కూడా తరలించినట్లు అతని తండ్రి శ్రీనివాసులు మీడియా వద్ద చెప్పినట్లు తెలిసింది. "నాకు మోకాళ్ళ నొప్పులు ఉండడంతో, రాత్రిళ్ళు నిద్ర పట్టడానికి కొన్ని మాత్రలు వాడే వాడిని" అని శ్రీనివాసులు చెప్పడంతో పాటు " మత్తు కు అలవాటు పడిన నా కొడుకు నేను వాడే మాత్రలు కూడా పదుల సంఖ్యలో మింగేసేవాడు" అని చెప్పినట్టు సమాచారం. దీంతోనే కొన్ని రోజులపాటు హైదరాబాదులోని పునరావాస కేంద్రంలో చికిత్స కూడా చేయించినట్లు ఆయన స్పష్టం చేశారు. కాలేజీలో వద్ద ఓ కన్ను వేసి ఉంటే పిల్లలు మత్తుకు బానిస అయ్యే వారు కాదని విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ రోదించారు.
నిఘా వైఫల్యం..
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రధానంగా పీలేరు, మదనపల్లి, పుంగనూరు, తంబళ్లపల్లె నియోజకవర్గాలు కర్ణాటక కు సరిహద్దులో ఉంటాయి. క్రైమ్ రేటు కూడా ఎక్కువగానే ఇక్కడ నమోదు అవుతుంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలతో పాటు చిత్తూరు జిల్లా పరిమటి ప్రాంతంలో కూడా గంజా విక్రయాలు చాప కింద నీరులా సాగుతున్నాయి అనే విషయం స్పష్టమైనది. ఈ వ్యవహారాలను కూకటివేళ్లతో సహా పగిలిస్తామని రాష్ట్ర అధికారులతో పాటు పోలీసు అధికారులు కూడా పదేపదే చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పోలీస్ శాఖ శాంతి. భద్రతల పరిరక్షణతో పాటు, అక్రమ వ్యవహారాలను కట్టడి చేయడంలో కాస్త వైఫల్యం చెందింది అనే విషయం స్పష్టం అవుతుంది.
పెరుగుతున్న జనాభాకు తగినట్లుగా పోలీసు సిబ్బంది లేకపోవడం కూడా ఒక సమస్య. వారిపై పని భారం కూడా ఎక్కువగానే ఉంటుంది. రెండు రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న మదనపల్లి డివిజన్లోని పడమటి ప్రాంతాల్లో రెండు జాతీయ రహదారులు కూడా కలుస్తుంటాయి. దీంతో ప్రమాదాలు ఇతరత్రా లాండ్ ఆర్డర్ సమస్యలు ఎక్కువగానే ఉంటాయి. అయితే, పోలీస్ విభాగంలోనే ఉన్న గూడచారి వర్గాలు, అసాంఘిక కార్యకలాపాల సమాచారం సేకరించడంలో నిర్లప్తత కారణంగా, గంజా విక్రయాలు పెరగడానికి కూడా ఆస్కా కల్పిస్తున్నట్టు తాజా సంఘటన స్పష్టం చేస్తుంది. విద్యాసంస్థల వద్ద నిఘా కన్ను వేసి ఉంటే గంజా విక్రయితులను కట్టడి చేయడానికి సాధ్యమయ్యేది.
గతంలో.. మదనపల్లెలో పనిచేసే స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్, తీసుకున్న చొరవ వల్ల ప్రభుత్వానికి ఆదాయం లభించింది. బెంగళూరు నుంచి పన్ను చెల్లించకుండా తీసుకు వస్తున్న ఎలక్ట్రానిక్ వస్తువులను పట్టుకోవడంతోపాటు అప్పగించారు. ఇసుక ప్రధానంగా, ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడంలో కూడా ఆ ఎస్బిఐ హెడ్ కానిస్టేబుల్ చొరవ చూపారు. గడచిన మూడేళ్ల క్రితం నుంచి పరిశీలిస్తే అనేక సందర్భాల్లో ఆ ఎస్బి హెడ్ కానిస్టేబుల్ ఎర్రచందనం అక్రమ రవాణా అవుతున్న వాహనాలను నిలువరించి పోలీసు శాఖ ప్రతిష్టను ఇనుముడింప చేశారు. అదే రీతిలో, మదనపల్లి డివిజన్లోని నియోజకవర్గ కేంద్రాలతో పాటు విద్యాసంస్థల వద్ద కూడా గంజా విక్రయించకుండా నిఘా ఉంచాల్సిన అవసరం ఉందనే విషయం తాజాగా పీలేరు పట్టణంలో ఇద్దరు బాలురు మత్తులో ప్రాణాలు కోల్పోయిన సంఘటన గుర్తు చేస్తోంది.
స్పందించిన ఎమ్మెల్యే
గతంలో ఎన్నడూ లేని విధంగా పీలేరు పట్టణంలో మత్తుకు బానిస అయిన ఇద్దరు బాలురు రైలు కింద దుర్మరణం చెందిన సంఘటనపై ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి స్పందించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయడంతో పాటు, గంజాయి విక్రయాలపై కఠినంగా వ్యవహరించాలని కోరినట్లు తెలిసింది."గంజాయి విక్రయిస్తున్న వారిలో అధికార పార్టీ వారు ఉన్నా సరే. వైసీపీ మద్దతు దారులైనా సరే. ఎవరిని ఉపేక్షించకండి. కఠినంగా వ్యవహరించి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టండి" అని పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నమయ్య జిల్లా ఎస్పీ ని కోరారు.