ఇంటర్ ఫలితాలు..ఆత్మహత్యలు
పరీక్షల ఫలితాలు వెలువడిన తర్వాత ఒకరు, వెలువడక ముందు మరొకరు బలవన్మరణానికి పాల్పడి తల్లిదండ్రులకు కడుపు కోతను మిగిల్చారు.;
By : The Federal
Update: 2025-04-12 12:53 GMT
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ ఫలితాలు ఇద్దరిని బలిగొన్నాయి. ఇద్దరు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఫలితాలు వెలువడిన తర్వాత ఒకరు ఆత్మహత్యకు పాల్పడగా, రిజల్ట్స్ రాకముందే ఒక విద్యార్థి సూసైడ్ చేసుకున్నారు.
శనివారం ఉదయం 11 గంటలకు మంత్రి నారా లోకేష్ ఇంటర్ ఫలితాలను వెల్లడించారు. విశాఖపట్నం జిల్లా తగరపువలస గ్రామం కొండపేటకు చెందిన జీ చరణ్ అనే విద్యార్థి రిజల్ట్స్ చూసుకున్నాడు. పరీక్షల్లో చరణ్ ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అంతటితో ఆగని చరణ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో చరణ్ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు.
అయితే అంతకుముందు ఫలితాలు చూసుకున్న చరణ్, తాను పరీక్షలు తప్పాననే విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో తల్లదండ్రులు చరణ్‌ను దగ్గరకు తీసుకొని ఓదార్చారు. ఫెయిల్ అయినంత మాత్రాన భయపడాల్పిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. మళ్లీ పరీక్షలు రాసుకుని పాస్ కావచ్చనే భరోసా ఇచ్చారు. దీంతో తమ కుమారుడు చరణ్ తాను ఫెయిలయ్యాననే బాధ నుంచి బయట పడ్డాడని తల్లిదండ్రులు భావించారు. ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడడులే అని అనుకున్నారు. అయితే చరణ్ మనసులో మాత్రం తాను ఇంటర్ పరీక్షలు తప్పాననే బాధ వెంటూడుతూనే ఉంది. ఈ క్రమంలో పనిమీద తల్లిదండ్రులు బయటకు వెళ్లాల్సి వచ్చింది. అలా వారు బయటకు వెళ్లగానే అప్పటికే మనసులో కుమిలి పోతోన్న చరణ్ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తీవ్ర మనస్తాపంలో ఉన్న చరణ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
అయితే దీనిని గమనించిన స్థానికులు, ఇతర కుటుంబ సభ్యులు చరణ్‌ను కాపాడే ప్రయత్నం చేశారు. కొన ఊపరితో కొట్టు మిట్టాడుతున్న చరణ్‌ను హుటాహుటిన వారు ఆసుపత్రికి తరలించారు. పరీక్షలు చేపట్టిన వైద్యులు అప్పటికే చరణ్ మరణించినట్లు తెలిపారు. చరణ్ ఉరి వేసుకొని మరణించాడని విషయం తెలుసుకున్న అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. గుండెలు పగిలేలా రోదించారు. ఇంత కాలం కష్టపడి పెంచుకున్న కుమారుడు చరణ్ ఇక లేడనే దానిని జీర్ణించుకోలేక పోయారు. స్థానికులను సైతం ఈ ఘటన కన్నీరు పెట్టించింది.
ఇంటర్ పరీక్షల ఫలితాలు వెలువడక ముందే ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలం ఏ కోడూరు గ్రామానికి చెందిన వెంకట సుదీశ్వరరెడ్డి శుక్రవారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. వెంకట సుదీశ్వరరెడ్డి నంద్యాలలో ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. పరీక్షలు సరీగా రాయక పోవడంతో గత కొద్ది రోజులుగా దిగులుగా ఉన్నాడు. ఇంటర్ ఫలితాలు వెలువడే సమయం దగ్గర పడేకొద్ది ఆ దిగులు కాస్త తీవ్ర భయాందోళనలకు దారి తీసింది. శనివారం ఫలితాలు వస్తాయని తెలిసి ఆ యువకుడు ఒక్క సారిగా తీవ్ర ఆందోళనకు లోనయ్యాడు. ఫలితాలలో తాను ఫెయిల్ అయ్యానని తెలిస్తే తనను అందరూ అవమానకరంగా చూస్తారని మనసులో కుంగిపోయాడు. మనసులో అదే వెంటాడుతుండటంతో ఆ ఆందోళనల నుంచి బయట పడలేక పోయాడు. ఫస్ట్ ఇయర్ పరీక్షలు తప్పితే రెండో ఏడాదిలో రాసుకొని పాస్ కావచ్చేనే ఆలోచనలు చేయలేక, ధైర్యాన్ని కోల్పోయాడు. దీంతో ఫలితాలు వెలువడక ముందే శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు తీసుకున్నాడు. ప్రాణప్రదంగా పెంచుకున్న తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చాడు.