ధవళేశ్వరం వద్ద ఇన్,ఔట్‌ ఫ్లో 10.92 లక్షల క్యూసెక్కులు

ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంçస్థ తెలిపింది.;

Update: 2025-08-31 04:25 GMT

గోదావరి వరద ప్రవాహం ఉధృతంగా కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు భారీగా వచ్చి చేరుతుండటంతో నీటి ప్రవాహం అధికంగానే ఉంది. దీంతో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఇన్, ఔట్‌ ఫ్లో 10.92 లక్షల క్యూసెక్కులుగా ఉంది. భద్రాచలం వద్ద 47.9 అడుగులగా నీటిమట్టం ఉంది. ఈ నేపథ్యంలో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్‌ జైన్‌ తెలిపారు. గోదావరి వరద ప్రవాహం ఉథృతంగా ఉన్న నేపథ్యంలో లంక గ్రామ ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని ప్రఖర్‌ జైన్‌ సూచించారు.

మరో వైపు ఎగువ రాష్ట్రల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదికి వరద ప్రవాహం పెరగడంతో శనివారం రాత్రి 9 గంటల నాటికి భద్రాచలం వద్ద నీటిమట్టం 47.7 అడుగులుగా నమోదైంది. దవళేశ్వరం బ్యారేజీ వద్ద శనివారం రాత్రి 9 గంటలకు ఇన్, ఔట్‌ ఫ్లో 10.01 లక్షల క్యూసెక్కులు ఉంది. దీంతో ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉంటే ఉధృతంగా గోదావరి వరద నీటి ప్రవాహం ఉన్న నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లాతో పాటుగా తూర్పుగోదావరి, అంబేద్కర్‌ కోనసీమ, కాకినాడ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని మండల అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్‌ జైన్‌ తెలిపారు. వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ అధికారులకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు ఇస్తున్నామన్నారు. ప్రకాశం బ్యారేజి వద్ద 2.99 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉందని వెల్లడించారు.
గోదావరి, కృష్ణా, తుంగభద్ర నదుల వరద ప్రవాహంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నందున ఆయా నదీపరీవాహక ప్రాంత, లోతట్టు గ్రామ ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రత్యేకించి వినాయక నిమజ్జనాల్లో జాగ్రత్తలు పాటించాలన్నారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లాతో పాటు విజయనగరం, మన్యం, అల్లూరి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్‌ జైన్‌ తెలిపారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
Tags:    

Similar News