న్యూ ఇయర్ లో నేవీ డే వేడుక!
ఏటా డిసెంబర్ 4 న విశాఖ బీచ్‌లో నిర్వహణ. కానీ ఈ ఏడాది అదే రోజు పూరీకి మార్పు. తాజాగా జనవరి 4 న విశాఖ సాగర తీరంలో మరోసారి.
విశాఖ వాసులకు ఈ ఏడాది సంక్రాంతికి ముందే నేవీ కొత్త వేడుక తెస్తోంది. 2025 కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టగానే నేవీ సంబరంతో స్వాగతం పలుకుతోంది. ఏటా నిర్వహించే నేవీ డే ఉత్సవం ఈ ఏడాది లేకుండా పోయిందే! అని నైరాశ్యంలో ఉన్న వైజాగ్ జనానికి నావికాదళం మనసు మార్చుకుని ఇప్పుడు ఆ లోటు తీరుస్తోంది. జనవరి 4న నేవీ డే వేడుకలను మరోసారి విశాఖ సాగరతీరంలో నిర్వహించనుంది. 1971లో పాకిస్తాన్పై భారత్ విజయానికి చిహ్నంగా ఏటా డిసెంబర్ 4న నేవీ డే ఉత్సవాన్ని విశాఖ ఆర్కే బీచ్లో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కానీ ఈ సంప్రదాయానికి భిన్నంగా ఈ ఏడాది తొలిసారి విశాఖలో కాకుండా ఒడిశాలోని పూరీలో నిర్వహించింది. ఇలా నేవీ చరిత్రలో విశాఖలో కాకుండా మరో రాష్ట్రంలోను, మళ్లీ రెండోసారి వైజాగ్లోను నేవీ డేని నిర్వహించడం ఇదే ప్రథమం కావడం విశేషం!
నేవీ డే నేపథ్యం ఇదీ..
ఇండియన్ నేవీని 1612లో ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించింది. అప్పట్లో దీనిని రాయల్ ఇండియన్ నేవీగా పిలిచే వారు. ఇండియా, పాకిస్తాన్ల మధ్య 1971లో జరిగిన యుద్ధ సమయంలో డిసెంబర్ 3న పాకిస్తాన్ భారత వైమానిక స్థావరాలపై దాడికి పాల్పడింది. దీనిని తీవ్రంగా పరిగణించిన భారత్ నావికాదళం.. డిసెంబర్ 4,5 తేదీల్లో పాక్పై ప్రతి దాడులకు ప్రణాళికలను రూపొందించింది. ఇందులో భాగంగా గుజరాత్లోని డిసెంబర్ 4న పాకిస్తాన్లోని కరాచీ నావికాదళ ప్రధాన స్థావరంపై మెరుపు దాడి చేసి పీఎన్ఎస్ ఖైబర్, పీఎన్ఎస్ ముహఫిజ్ సహా మూడు యుద్ధ నౌకలను ముంచేసింది. ఈ దాడిలో పాకిస్తాన్ కు చెందిన 500 మందికి పైగా నేవీ సిబ్బంది చనిపోయారు. రాత్రి వేళ జరిపిన ఆ దాడికి 'ఆపరేషన్ ట్రెడెంట్' అని పేరు పెట్టారు. ఈ ఆపరేషన్కు కమాండర్ పటాన్ శెట్టి గోపాలరావు నాయకత్వం వహించారు. అదే సమయంలో పాకిస్తాన్కు చెందిన జలాంతర్గామి పీఎన్ఎస్ ఘాజీని విశాఖ తీరానికి సమీపంలోనే సముద్రంలో మన నేవీ పేల్చివేసి తుత్తునియలు చేసింది. ఈ దాడి అనంతరం పాకిస్తాన్పై భారత్ విజయం సాధించింది. పాక్పై విజయానికి చిహ్నంగా భారత్ అప్పట్నుంచి ఏటా డిసెంబర్ 4న నావికాదళ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. తూర్పు నావికాదళ ప్రధాన కేంద్రం (ఈస్టర్న్ నేవల్ కమాండ్-ఈఎన్సీ) విశాఖపట్నంలో ఉంది.
నేవీ డే నాడు ఏం చేస్తారు?
నేవీ డే సందర్భంగా నావికాదళానికి సేవలందిస్తూ దేశం కోసం అశువులు బాసిన వారికి నివాళులర్పిస్తారు. మన నౌకాదళ శక్తి సామర్థ్యాలు ఏపాటివో ప్రజలకు తెలియజేసేందుకు, వారిలో అవగాహన పెంపొందించేందుకు విశాఖ ఆర్కే బీచ్ లో తూర్పు నావికాదళం యుద్ధ సాహస విన్యాసాలు నిర్వహిస్తుంది. సిసలైన యుద్ధాన్ని తలపించేలా ఈ విన్యాసాలుంటాయి. నేవీ హెలికాప్టర్లు, ఫైటర్ జెట్లు, పెట్రోలింగ్ విమానాలు, యుద్ధ నౌకలు, యుద్ధ ట్యాంకులు, జలాంతర్గాముల విన్యాసాలు, రెస్క్యూ ఆపరేషన్లు, శత్రు స్థావరాలే లక్ష్యంగా బాంబు పేలుళ్లు, సముద్రంలో చమురు రిగ్ల పేల్చివేతలు, మెరైన్ కమెండోల సాహసకృత్యాలు, స్కై డైవింగ్, నావల్ బ్యాండ్ వంటివి ఉంటాయి. ఒళ్లు గగుర్బొడిచే ఈ విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి.
నేవీ డేకి వారం రోజులు ముందు నుంచీ ఆపరేషన్ డెమో పేరిట రిహార్సల్స్ నిర్వహిస్తారు. నేవీ డే రోజున జరిగే విన్యాసాలే ఈ రిహార్సల్స్లోనూ ఉంటాయి. ఈ రిహార్సల్స్ శనివారం నుంచి ప్రారంభమవుతున్నాయి. శని, ఆదివారాలతో పాటు ఫైనల్ రిహార్సల్స్ జనవరి 2న కూడా ఉంటాయి. ఆర్కే బీచ్ వేదికగా జరిగే రిహార్సల్స్ను వీక్షించేందుకు ప్రజలను అనుమతిస్తారు. ఇక నేవీ డేకి (జనవరి 4న) వేల సంఖ్యలో ప్రజలు హాజరవుతారు. దీనిని దృష్టిలో ఉంచుకుని నగర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మరోవైపు నేవీ డే సందర్భంగా ఆకాశంలో యుద్ధ విమానాల విన్యాసాలు జరుగుతున్నందున సాగర తీరానికి పది కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లు, గాలిపటాలు వంటి వాటిని ఎగురవేయడాన్ని నిషేధించారు. ఆ ప్రాంతంలో తినుబండారాలు, ఇతర ఆహార పదార్థాలు విడిచి పెట్టవద్దని ప్రజలకు నేవీ అధికారులు విజ్ఞప్తి చేశారు. వీటి కోసం పక్షులు వస్తే యుద్ధ విమానాలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉండడమే ఇందుకు కారణం!
డిసెంబర్ 4న పూరీలో నేవీ డే..
భారత రక్షణశాఖ నిర్ణయంతో ఈ ఏడాది నేవీ చరిత్రలో తొలిసారిగా విశాఖలో కాకుండా పూరీలో నేవీ డేను డిసెంబర్ 4న నిర్వహించారు. పూరీ కూడా తూర్పు నావికాదళ పరిధిలోనే ఉంది. అక్కడ ఆ రోజు అక్కడ యుద్ధ విన్యాసాలు చేపట్టారు. దీంతో విశాఖ వాసులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే సరిగ్గా నెల రోజుల అనంతరం ఆనవాయితీ తప్పకుండా జనవరి 4న విశాఖ సాగరతీరంలో నేవీ డేని నిర్వహించాలని రక్షణ శాఖ నిర్ణయించడంతో వీరిలో మళ్లీ అనందం పెల్లుబుకుతోంది. నేవీ డేని ఘనంగా నిర్వహించడానికి తూర్పు నావికాదళంతో పాటు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది విశాఖలో జరిగే నేవీ డే వేడుకలకు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరవుతున్నారు. ఇంకా తూర్పు నావికాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్ సహా రక్షణశాఖ, నౌకాదళ ఉన్నతాధికారులు కూడా పాల్గొంటారు.