ఆంధ్రాలో ఇలాంటి టార్చర్ మీకూ ఎదురయిందా?

అధికారుల తప్పులకు కూడా మీరే బిల్లులు కటాలి;

Update: 2025-07-28 05:09 GMT

-సడ్లపల్లి చిదంబరరెడ్డి


ఇల్లు కట్టుకోవడానికి అప్ప్రూవల్ కోసం మునిసిపాలిటీ వారికి అడిగినవన్నీ సమర్పించాను. ఇక తెరచాటుగా ఇచ్చినదాని గురించి చెప్పడం కాదు.

అయితే, ఆస్థిపన్ను కట్టమని తాఖీదు వచ్చింది"చిదంబరబరరెడ్డన్న" అనే పేరిట!! ఈ పేరు నాదికాదు అని తిరష్కరిస్తే "సార్ పేరు ఏదైతే ఏం? ఇంటినంబరు సరిగా ఉంది పన్ను కట్టండి " అన్నారు. నేనొప్పుకో లేదు.

మరుసటి రోజు బిల్లు కలెక్టరుగారు వచ్చి "సార్! మీరు కమీషనరు గారికి ఒక అర్జీ రాయండి "నా పేరు ఫలానా! అయితే తమ సిబ్బందిగారు అదేదో పేరిట నాకు పన్నుకట్టమని నోటీసు ఇచ్చారు. దయచేసి నాపేరును మార్చవలసింది...."అని చెప్పాడు.

నాకు అరికాలి మంట నెత్తికెక్కింది. అప్ప్రూవల్ కోసం నా పేరిట ఉన్న డాక్యుమెంట్లు, ఆధార్ కార్డు,శాలరీ సర్టీ ఫికేట్టు వంటి నూరారు ఇచ్చివుంటాను అందులో ఏ పేరువుంటే ఆ పేరు ఇంటినంబరుతో ఆస్థిపన్ను నోటీసు పంపడం మీ సిబ్బంది బాధ్యత!! దాన్ని మరిచి నోటికొచ్చిన తప్పుపేరు రాయడమేకాక నేను తప్పు చేసినట్లు మరలా అర్జీరాసి మొరపెట్టుకోవడమంటే ఇది ప్రజాస్వామ్యంలా కాక నియంతృత్వంలాగుంది... అని తీవ్రంగా అక్షేపించాను. మరలా వారం రోజులకు సరిచేసుకొచ్చారు.

పోయిన మే నెలలో మామూలుకన్నా ఒక వంద రూపాయలు కరెంటు చార్జీ ఎక్కువ వస్తే కట్టాను. మరో పదిరోజులకు "మీకు అమర్చిన మీటరు స్లాబుకన్నా ఎక్కువ కాల్చారనీ 1,500/-అదనుగా కట్టాలని చంద్రశేఖ్రరెడ్డి అనే పేరిట నోటీసు వచ్చింది. పేరును చూసి అది నాది కాదని తిరష్కరించాను మరలా మామూలే నంబరుసరిగా ఉందికదా పేరు ఏదైతే ఏం?? అనే నిర్లక్ష్యపు జవాబు!!

నాకు మనుమరాలు పుట్టింది. సంబంధిత కార్యాలయం వారు "సి.వినూత్నD/O సి.కళానిధి అని సర్టిఫికేటు ఇచ్చారు. మొన్న పాప పేరిట ఆధార్ కార్డు కోసం మీ సేవకు వెళితే వందరూపాయలు తీసుకొని మరో పది రోజులకు కార్డు ఇండికి పంపారు అయితే "సి.వినూత్నC/O విద్యావతి" అనే పేరిట.

సదరు సేవాసదనానికి వెళితే షరా మామూలే "ఇలా పేరు మార్చడం కుదరదు. తప్పు జరిగినట్లు ఒక అభ్యర్థన పత్రం రాసి మరో వందరూపాయలు కట్టండి" అనే జవాబు!!

మా ఇంట్లో బాడుగకు ఉన్న ఒక ఆమె ఈ మధ్య ప్రతివారమూ టౌనుకు వెళ్లివస్తూ ఉంది. ఉండబట్ట లేక కారణ మడిగితే వాళ్ల అబ్బాయి పుట్టిన తేదీ బర్త్ సర్టిఫికేట్ లో 2.10.2012 ఉంటే ఆధా కార్డులో 2.12.1012 నమోదు చేసారట! ప్రతి సారీ ఏదో ఒక అంకె తప్పు నమోదు చేసి వందరూపాయలు అదనంగా లాగడమే కాక ఇంటి పనులు వదిలేసి క్యూ లైన్ లో కాళ్లు నొప్పులొచ్చేలా నిలబడడం చాలా బాధ వేస్తుంది అంకుల్ అని చెబుతూ..అక్కడ సగం మంది ఇలా తప్పులు సవరించుకోవడానికే వస్తున్నారు. దీన్ని బట్టి వారు వందరూపాయల సంపాదనకే కావాలని తప్పులు చేస్తున్నట్లు తెలుస్తుంది!! అని వాపోయింది.

ఇదండీ సంగతి!! ఈ సేవాకేంద్రాలు అన్నీ ఇలాగేనా? మీకూ ఏవైనా అనుభవాలున్నాయా?? మా హిందూపురం మాత్రమేనా!! ఇంతటితో కాక ఈ సమస్యను ఏ అధికారిదృష్టికి తీసుకు వెళ్లలో చెప్పి పుణ్యం కట్టుకోండి.


(సడ్లపల్లి చిదంబర రెడ్డి, రచయిత, కవి, విమర్శకుడు. హిందూపురం, ఆంధ్రప్రదేశ్)



Tags:    

Similar News