తోట త్రిమూర్తులు కొంపముంచిన శిరోముండనం కేసు.. టికెట్ పోయినట్టేనా

శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు సహా తొమ్మిది మందికి కోర్టు జైలు శిక్ష విధించింది. 28 ఏళ్ల తర్వాత ఈ కేసులో తుది తీర్పు వెల్లడైంది.

Update: 2024-04-16 11:58 GMT
రాష్ట్రవ్యాప్తంగా శిరోముండనం కేసు సంచలనంగా మారింది. తాజాగా ఈ కేసులో విశాఖపట్నంలోని ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద నమోదైన కేసుల్ని విచారించే అడిషినల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టు ఈవేళ కీలక తీర్పు ఇచ్చింది. వైసీసీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సహా 9 మందికి 18 నెలల జైలు శిక్షను న్యాయస్థానం ఖరారు చేసింది. ఎస్‌సీ, ఎస్‌టీ అట్రాసిటీ కేసులో నిందితులకు ఒక్కొక్కరికి 18 నెలల జైలు శిక్షతో పాటు, రూ.50 వేల జరిమానా కూడా విధించింది. దీంతో నిందితులు బెయిల్‌ కోసం పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఆ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరుపుతుంది. ఒకవేళ బెయిల్‌ను ధర్మాసనం నిరాకరిస్తే వారిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఎస్టీ, ఎస్సీ కోర్టు దగ్గర వాహనాలతో సిద్ధంగా ఉన్నారు.
అసలేంటీ శిరోముండనం కేసు
29 డిసెంబర్ 1996 లో రామచంద్రపురం మండలం వెంకటాయపాలెం లో ఎన్నికల కారణంగా దళిత యువకులను కొందరు వ్యక్తులు చిత్ర హింసలు పెట్టారు. ఆ యువకులకు శిరోముండనం(గుండు కొట్టించడం) చేయించారు. కనుబొమ్మలు కూడా గీయించారు. ఈ ఘటన అప్పట్లో రాష్ట్రమంతటా సంచలనం రేపింది. దీనిని అనేక మంది తీవ్రంగా ఖండించారు. ఎన్నికల సాకుతో ఇష్టం వచ్చినట్లు చేస్తే కుదరదంటూ నిరసనలు, ఆందోళనలు కూడా తీవ్ర స్థాయిలో వ్యక్తం అయ్యాయి. ఈ అంశంపై యువకులకు న్యాయం చేయాలంటూ దళిత సంఘాలు కోర్టు మెట్లెక్కాయి. వారి పిటిషన్‌ను స్వీకరించిన విచారణ చేపట్టింది. 28 ఏళ్లపాటు సాగిన ఈ కేసుకు ఈరోజున కోర్టు ఫుల్‌స్టాప్ పెట్టింది. ఈ కేసులో ఐదుగురు బాధితులు ఉండగా వారిలో వెంకటరమణ మరణించగా మిగిలిన నలుగురు తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు.
సాక్షుల్లో 11 మంది మృతి
అయితే ఈ కేసులో మొత్తం 24 మంది సాక్షులు ఉన్నారు. కాగా ఇప్పటివరకు వారిలో 11 మంది మరణించారు. ఈ కేసు కోసం 1997 నుంచి ఆరుగురు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా పనిచేశారు. ఈ కేసుకు సంబంధించి 1997 జనవరి 1న ద్రాక్షారామం పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ కేసును 2008 ఫిబ్రవరిలో రీఓపెన్ చేశారు. అప్పటి నుంచి కొనసాగుతున్న పోరాటంలో ఇప్పుడు న్యాయస్థానం తీర్పు వచ్చింది.
బాధితులు ఏం చెప్తున్నారంటే
తోట త్రిమూర్తులు 1994 సార్వత్రిక ఎన్నికల్లో గంట గుర్తుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఈ కేసులో బాధితులైన వారిలో ముగ్గురు ఆ ఎన్నికల్లో బీఎస్‌పీ పార్టీ తరపున పోలింగ్ ఏజెంట్‌లుగా ఉన్నారు. అప్పుడు త్రిమూర్తులు వర్గం వాళ్లు రిగ్గింగ్ చేయడానికి ప్రయత్నించగా బీఎస్‌పీ పోలింగ్ ఏజెంట్‌లు అడ్డుకున్నారు. అందుకే తమపై కక్ష పెంచుకుని తమకు గుండు కొట్టించి అవమానించారు బాధితులు తెలిపారు. ‘‘వారిని అడ్డుకున్నామన్న కక్షతో మాపై పలు తప్పుడు కేసులు బనాయించారు. మా పొలాల చుట్టూ ఉన్న ఫెన్సింగ్‌ను ధ్వంసం చేశారు. ఈవ్ టీజింగ్ కేసులు పెట్టారు. గ్రామస్తులు అందరి మధ్య గుండు కొట్టించి అవమానించారు’’అని బాధితులు అప్పుడు తమపై జరిగిన ఘోరాన్ని వివరించారు.
నాకేం సంబంధం లేదు
అయితే ఈ ఘటనకు తనకు ఎటువంటి సంబంధం లేదని తోట త్రిమూర్తులు చెప్తున్నారు. ‘‘ఈ ఘటన గ్రామ పెద్దల మధ్య జరిగింది. ఆ పంచాయితీకి నాకు ఎటువంటి సంబంధం లేదు’’అని చెప్తున్నారు.
బాధితులు దళితులు కాదా
ఈ కేసుల అప్పట్లో హైకోర్టుకు కూడా వెళ్లింది. కొన్నేళ్లపాటు రాష్ట్ర మంతటా హాట్‌టాపిక్‌గా సాగిన ఈ కేసు ఎన్నో కీలక మలుపులు తిరిగింది. అందులో భాగంగా అసలు ఈ కేసులో బాధితులు దళితులు కాదని, మతమార్పిడి చేసుకున్న క్రిస్టియన్స్ అని జోరుగా ప్రచారం జరిగింది. ఆ నేపథ్యంలోనే వారి క్యాస్ట్ సర్టిఫికెట్‌పై ప్రత్యేక దర్యాప్తు జరపాలని అప్పటి కలెక్టర్‌కు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల ఈ కేసు విచారణను మరో ఆరు నెలల్లో పూర్తి చేయాలని హైకోర్టు.. జిల్లా కోర్టుకు ఆదేశించింది. ఏప్రిల్ 3న ఈ కేసు విచారణలో ఇరు పక్షాల వాదనలు విన్న విశాఖ ఎస్సీ, ఎస్టీ కోర్టు తీర్పు రిజర్వ్ చేసి ఈవేళ తీర్పు ఇచ్చింది.
తోట త్రిమూర్తులు ఎవరు?
ఆయన యుక్త వయసులోనే గ్రామ రాజకీయాల్లోకి అరంగేట్రం చేవారు. అక్కడి నుంచి 1982లో ఎన్‌టీఆర్ నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ పార్టీ తరపున రామచంద్రపురం నియోజకవర్గంలో బలమైన నేతగా ఎదిగారు. 1994 సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి విజయం సాధించారు. ఆ తర్వాత 1995లో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీలో చేరారు. 1999లో మరోసారి రామచంద్రపురం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2004 ఎన్నికల్లో మరోసారి టీడీపీ టికెట్ అందుకున్న త్రిమూర్తులు.. పిల్లి సుభాష్ చంద్రబోస్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత తోట త్రిమూర్తులు.. టీడీపీకి రాజీనామా చేశారు. 2008లో ఆయన చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ పార్టీ తరపున 2009 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరి 2014 ఎన్నికల్లో రామచంద్రపురం ఎమ్మెల్యేగా మూడోసారి విజయం సాధించారు.
2014 రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్‌కు వీడ్కోలు చెప్పి టీడీపీ తరపున 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. అప్పటి నుంచి మరోసారి నియోజకవర్గంలో తన బలాన్ని పెంచుకోవడం దృష్టి పెట్టారు. కాపు సామాజిక వర్గంలో బలమైన నాయకుడిగా ఎదిగారు. 2019 ఎన్నికల్లో ఆయనను మరోసారి ఓటమి పలకరించింది. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ చేతిలో ఓడిపోయారు తోట త్రిమూర్తులు. దాంతో మరోసారి టీడీపీకి గుడ్‌బై చెప్పారు. 2019 సెప్టెంబర్ 15న వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. 2021లో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టారు. 2024 ఎన్నికల్లో ఆయనకు వైసీపీ మండపేట టికెట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన మండపేటలో ఆయన ప్రచారం కూడా జోరుగా సాగిస్తున్నారు. ఇంతలో ఆయనకు జైలుశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇవ్వడంతో మండపేట వైసీపీ అభ్యర్థి అంశం కీలకంగా మారింది. ఆయన్ను మార్చవచ్చుననే వదంతులు వస్తున్నాయి.
Tags:    

Similar News