ఏపీకి భారీ వర్ష సూచన.. పిడుగులు కూడా

ఎన్నికలు పూర్తయిన మరుసటి రోజే ఆంధ్ర ప్రజలకు కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడొచ్చంటూ..

Update: 2024-05-14 08:15 GMT

ఎన్నికలు ముగిసిన అనంతరమే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి మోస్తరు స్థాయి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో తీర, ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉత్తరాంధ్ర, కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపుతలతో కూడిన భారీ వర్షాలు పడొచ్చని సమాచారం. వడగళ్లు పడినా ఆశ్చర్యం అక్కడర్లేదని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇదే పరిస్థితి మరో 48 గంటలు కొనసాగే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయని, కావున ప్రజలను మే 17 వరకు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

అన్ని జిల్లాల్లో వర్షాలు

కొన్ని జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భీకర వర్షం పడినప్పటికీ రాష్ట్రంలోని ప్రతి జిల్లాల్లో వర్షపాతం నమోదు అవుతుందని కేంద్ర వాతావరణ శాఖ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేశాయి. కొన్ని జిల్లాల్లో కుంభవృష్టి వర్షం కురిస్తే, మరి జిల్లాల్లో చినుకులు పడి ఆగిపోయే అవకాశాలు ఉన్నాయని వివరించారు అధికారులు. ఇదిలా ఉంటే అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, అనకాపల్లి జిల్లాల్లో ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు పడొచ్చని తెలిపారు.

ఈరోజు వర్షాలు ఇలా

ఇప్పటివరకు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు బాగానే పడ్డాయని, వాటిలో అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో అత్యధికంగా 57.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందని వాతావరణ శాఖ వెల్లడించింది. అందే విధంగా శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లిలో 46.5మీమీ, ప్రకాశం జిల్లా కనిగిరిలో 52.5మీమీ, బాపట్ల అద్దంకి 38.5మీమీ, ప్రకాశం చంద్రశేఖరపురంలో 38మీమీ వర్షపాతం నమోదయింది. అంతేకాకుండా సుమారు 27 ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షం పడిందని వాతావరణ శాఖ వివరించింది.

Tags:    

Similar News