దేశ పురోగతిలో ఐఐటీలే కీలకం
తిరుపతి ఐఐటీలో రూ.2313 కోట్లతో ఫేజ్-బీ పనులు వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని మోదీ
Byline : SSV Bhaskar Rao
Update: 2025-09-27 13:47 GMT
దేశ పురోగతిలో తిరుపతి ఐఐటీ ప్రధాన భూమిక పోషిస్తుందని తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి ప్రశంసించారు. తిరుపతి ఐఐటీ శాశ్వత క్యాంపస్ అభివృద్ధి పనుల్లో భాగంగా రూ.2313 కోట్ల అంచనాలతో ఫేజ్-బీ పనులకు శనివారం ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో భూమి పూజ చేశారు.
"దేశాన్ని సాంకేతికంగా మరింత అగ్రగామిగా తీర్చిదిద్దడానికి నైపుణ్యం పెంచుకోవాలని" ప్రధాని నరేంద్రమోదీ విద్యార్థులకు కర్తవ్య బోధ చేశారు.
రేణిగుంట - శ్రీకాళహస్తి మధ్య ఏర్పేడు వద్ద ఉన్న తిరుపతి ఐఐటలో రెండు దశలో శాశ్వత భవన నిర్మాణాలకు ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా శనివారం ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒరిస్సా లోని జార్స్ గూడ నుంచి దేశంలోని ఎనిమిది ఐఐటీలలో సుమారు 11 వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అందులో భాగంగా ఏర్పేడు ఐఐటిలో సుమారు 1250 కోట్లతో ఫేస్ - బి పనులకు శంకుస్థాపన చేశారని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వేంకటేశ్వర్ తెలిపారు.
తిరుపతి ఐఐటీ
తిరుపతి నగరం చదవలవాడ నగర్ లోని కృష్ణతేజ విద్యా సంస్థల ప్రాంగణంలో 2015 ఆగష్టు ఐదో తేదీ ఐఐటీ విద్యా సంవత్సరాన్ని ప్రారంభించింది. 2015-16 విద్యా సంవత్సరానికి ఇక్కడ సివిల్, కంప్యూటర్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాలతో శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలంలో 532 ఎకరాల్లో తిరుపతి ఐఐటీని శాశ్వత భవనాల్లోకి మార్చారు. విద్యార్థులకు మౌలిక వసతులు, విద్యాభ్యాసానికి అవసరమైన తరగతి గదులు, పరిశోధనాశాలలు, క్రీడా ప్రాంగణాలు అందుబాటులోకి తెచ్చారు.
ఏర్పేడు వద్ద ఉన్న ఐఐటీలో శనివారం జరిగిన కార్యక్రమంలో తిరుపతి వైసీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి మాట్లాడారు.
"ఇది కేవలం భవనాల నిర్మాణం మాత్రమే కాదు. యువత ఉజ్వల భవిష్యత్ నిర్మాణం" అని అన్నారు. ఇందుకోసం సుస్థిరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తూ, విద్యార్థుల ఆవిష్కరణలకు, పరిశోధనలకు కొత్త దారులు తీసుకువస్తున్న ప్రాజెక్టుగా ఎంపీ గురుమూర్తి అభిప్రాయపడ్డారు. దేశంలోనే ప్రతిష్టాత్మకమైన డీఆర్‌డీఏ, టాటా, జేఎస్‌డబ్ల్యూ లాంటి సంస్థలతో తిరుపతి ఐఐటీ సమన్వయంతో ముందుకెళుతూ పరిశ్రమలకు బలం చేకూర్చి, స్థానిక ఆర్థిక వ్యవస్థపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపిందన్నారు.
మరో దశ పరిశోధనలు అవసరం
తిరుపతి ఐఐటీలో విద్యార్థులు ఉద్యానవన పంటలకు ఉపయోగ పడే పరిశోధనలకు ప్రాధాన్యత ఇవ్వాలని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి సూచించారు. ఆహార ప్రాసెసింగ్ రంగంపై కూడా ఐఐటీ తిరుపతి దృష్టి సారించిందన్నారు. వ్యవసాయ రంగానికి కూడా తన పరిశోధన ఫలాల్ని అందిస్తోందని ఆయన కొనియాడారు. దీని ద్వారా రైతులకు సాంకేతికత, ఆవిష్కరణలు, వృద్ధి అందుబాటులోకి వస్తాయన్నారు. రెండో దశలో సుమారు 2,500 మంది విద్యార్థులకు సేవలందించనున్న ఈ సంస్థ యువతకు, ప్రాంత అభివృద్ధికి గొప్ప తోడ్పాటు అందిస్తోందన్నారు.
" ఈ ప్రాజెక్టును ఆమోదించి, తిరుపతికి కేటాయించడం ద్వారా ప్రధాని నరేంద్రమోదీ దేశానికి నిజమైన దూరదృష్టి గల నాయకుడుగా నిలిచారు" అని ఎంపీ గురుమూర్తి ప్రశంసించారు.
ప్రధాని చొరవతో అభివృద్ధి పనులు చేపట్టడం వల్ల విద్యార్థులు తమ కలల్ని సాకారం చేసుకునే అవకాశం లభిస్తుందని ఎంపీ గురుమూర్తి, అన్నారు. తన సొంత మండలంలో ఉన్న ఐఐటీకి అదనపు సౌకర్యాలు కల్పించిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. గతంలో వైసీపీ హయాంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తిరుపతి ఐఐటీ మొదటి ఫెజ్ నిర్మాణానికి ఎంతో తోడ్పాటు అందించారన్నారు.
ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వి. వేంకటేశ్వర్ మాట్లాడుతూ,
ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీలో చేపట్టనున్న పనులు రాబోయే నాలుగు సంవత్సరాలలో పూర్తి చేస్తారని తెలిపారు.
"ఐఐటీలో మూడు అకడమిక్ బ్లాక్స్, ఒక మెగా ఇండోర్ ఆడిటోరియం, ఒక ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం, రెసిడెన్షియల్ ఫెసిలిటీస్, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ రాబోతున్నాయి" అని ఆయన తెలిపారు. ఆయన ఇంకా ఏమిచెప్పారంటే..
"ప్రస్తుతం ఉన్న ఐఐటి క్యాంపస్ లో 1800 మందికి వసతి సదుపాయం ఉంది. ఈ ఫేస్- బి పనులు 2029 కల్లా పూర్తి చేయ గలిగితే మరో 2650 మంది విద్యార్థులకు వసతి అందుబాటులోకి వస్తుంది. తిరుపతి ఐఐటీల ఎనిమిది బీటెక్ కోర్సులు, 15 ఎంటెక్ కోర్సులు , వివిధ పీహెచ్డీ కోర్సులు అందిస్తున్నారు, ఈ పనులు పూర్తయితే మరిన్ని కోర్సులు అందుబాటులోకి వస్తాయి" అని కలెక్టర్ వెంకటేశ్వర్ వివరించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్-కమ్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.ఎస్. రెడ్డి, CPWD, ప్రాజెక్ట్ ఇన్‌చార్జ్, IIT తిరుపతి బ్రిగేడియర్ (డాక్టర్) కృష్ణ కుమార్, రిజిస్ట్రార్, డీన్లు, ఫ్యాకల్టీలు, సిబ్బంది పాల్గొన్నారు.