వైజాగ్ జీవీఎంసీకి ఐఎఫ్‌సీ భారీ అప్పు!
దేశంలోనే ఐఎఫ్‌సీ నుంచి రుణం తీసుకున్న తొలి మున్సిపల్ కార్పొరేషన్‌గా జీవీఎంసీ నిలిచింది.;
Byline : బొల్లం కోటేశ్వరరావు
Update: 2025-09-08 15:54 GMT
విశాఖపట్నం మహా నగరపాలక సంస్థ (జీవీఎంసీ)లో ఇదో పెద్ద ముందడుగు. విశాఖలో ఆధునిక మురుగునీటి వ్యవస్థ ప్రాజెక్టుకు అవసరమైన భారీ నిధులను అప్పుగా ఇవ్వడానికి అంతర్జాతీయ ఆర్థిక సంస్థ (ఐఎఫ్‌సీ) ముందుకొచ్చింది. సీక్వెన్షియల్ బ్యాచ్ రియాక్టర్ (ఎస్‌బీఆర్) అనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించే ఈ తరహా ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌లోనే మొదటిది.
ఐఎఫ్‌సీ నిధులతో నిర్మించనున్న అత్యాధునిక మురుగునీటి వ్యవస్థ ప్రాజెక్టు (ఫైల్)
సీఎం సమక్షంలో ఒప్పందం..
విశాఖపట్నం మధురవాడ జోన్–2 పరిధిలో ఈ ఆధునిక మురుగునీటి వ్యవస్థ ప్రాజెక్టు ప్రతిపాదన కొన్నాళ్ల నుంచి ఉంది. దీనికి ఐఎఫ్‌సీ ద్వారా నిధుల సమకూర్చుకోవడానికి జీవీఎంసీ యంత్రాంగం ప్రయత్నాలు చేస్తోంది. జీవీఎంసీకి ఉన్న పరపతి, పలుకుబడి, ఆదాయ వనరులను ఐఎఫ్‌సీకి నివేదించింది. దీనిపై ఐఎఫ్‌సీ అధికారులు విశాఖ వచ్చి జీవీఎంసీ పనితీరును క్షుణ్ణంగా పరిశీలించి సంతృప్తి చెందారు. దీనిపై ఐఎఫ్‌సీకి నివేదించారు. అనంతరం జీవీఎంసీకి రుణం సమకూర్చడానికి ఐఎఫ్‌సీ సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ మేరకు సోమవారం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో ఐఎఫ్‌సీ ఉన్నతాధికారులు, జీవీఎంసీ అధికారులు సమావేశమయ్యారు.
ఈ ప్రాజెక్టు వివరాలను జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్డ్ సీఎంకు తెలియజేశారు. అనంతరం సీఎం చంద్రబాబు సమక్షంలో ఐఎఫ్‌సీ, జీవీఎంసీల మధ్య అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నారు. మధురవాడలో చేపట్టనున్న ఆధునిక మురుగునీటి వ్యవస్థ ప్రాజెక్టుకు రూ.553 కోట్లు వ్యయం అవుతుంది. ఇందులో జీవీఎంసీకి ఐఎఫ్‌సీ రూ.498 కోట్లను రుణం ఇస్తుంది. మిగిలిన మొత్తంలో అమృత్ 2.0 నుంచి రూ.45.64 కోట్లు, జీవీఎంసీ సొంత నిధులు రూ.9.36 కోట్లను వెచ్చిస్తుంది. జీవీఎంసీ తన సొంత ఆదాయ వనరుల ద్వారా ఈ రుణాన్ని ఐఎఫ్‌సీకి తిరిగి చెల్లించనుంది. 15 సంవత్సరాల కాలపరిమితి కలిగిన ఈ రుణానికి 8.15 శాతం (ఫ్లోటింగ్) వడ్డీ రేటుతో చెల్లించేలా నిర్ణయించారు.
ఏమిటీ ప్రాజెక్టు? ఏమా కథ?
విశాఖపట్నం జీవీఎంసీ మధురవాడ జోన్–2 పరిధిలో ఈ ఆధునికి మురుగునీటి వ్యవస్థ ప్రాజెక్టును అమలు చేయనున్నారు. ఈ నిధులతో వంద శాతం అండర్ గ్రౌండ్ మురుగునీటి నెట్‌వర్క్, ఆధునిక పంపింగ్, లిఫ్టింగ్ స్టేషన్లు, అత్యాధునిక శుద్ధి కేంద్రం, నీటి పునర్వినియోగం, రీసైక్లింగ్ చేయనున్నారు. రానున్న 30 ఏళ్ల జనాభా వృద్ధి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. 40 చదరపు కిలోమీటర్ల పరిధిలో 440 కిలోమీటర్ల మేర యూజీడీ పైప్‌లైన్ వేస్తారు. కాపులుప్పాడ వద్ద సూయేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ నిర్మిస్తారు. నీటి శుద్ధి వల్ల వ్యాధులు తగ్గడంతో పాటు భూగర్భ జలాలు కూడా కలుషితం కావు. పైగా పర్యావరణానికి మేలు చేస్తుంది. వరద నీటి నిర్వహణ సాధ్యమవుతుంది. ఈ ప్రాజెక్టు పరిధిలో నివసిస్తున్న రెండున్నర లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుంది. ఈ ఒప్పందం ద్వారా దేశంలోని నగరాల ఆర్థిక స్వయం ప్రతిపత్తికి కొత్త దారి చూపినట్టవుతుంది.
అత్యాధునిక సాంకేతికతతో..
ఈ ఆధునిక మురుగునీటి వ్యవస్థ ప్రాజెక్టును అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపడతారు. సీక్వెన్షియల్ బ్యాచ్ రియాక్టర్ అనే ఈ సరికొత్త పరిజ్ఞానాన్ని ఈ ప్రాజెక్టుకు వినియోగిస్తారు. ఈ తరహా సాంకేతిక ఆంధ్రప్రదేశ్‌లోనే మొదటిది కావడం విశేషం. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) కొత్త నిబంధనలు, ప్రమాణాలకనుగుణంగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటుంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు టెండర్లు పిలుస్తారు. ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తారు.