తిరుమలలో ఆ హోటల్ స్వాధీనం

తిరుమలలో ప్రక్షాళనకు వేగంగా అడుగులు పడుతున్నాయి. యాత్రికుల ఆరోగ్య భద్రతకు ఏమి చేయబోతున్నారు?

Update: 2024-07-19 02:44 GMT

తిరుమలలోని ఆహార పదార్ధాల తయారీలో డొల్లతనం బట్టబయలైంది.హోటల్ లైసెన్స్ ఫీజు రూ.75 లక్షలు వసూలు చేయని అధికారుల నిర్లక్ష్యం కూడా వెలుగులోకి వచ్చింది. రాజకీయ నేతల అండదండలతో చెలరేగుతున్న కొందరు యజమానుల ఆగడాలకు కళ్లెం వేసే దిశగా టీటీడీ వేగంగా అడుగులు  వేస్తోంది. ఓ హోటల్ ను టీటీడీ స్వాధీనం చేసుకోవడం మొదటిసారి. ఈ వ్యవహారం వ్యాపారుల సిండికేట్ ను, అధికారులను కూడా ఉలిక్కిపడేలా చేసింది.

దేశంలోని విభిన్న ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికుల ఆహార అలవాట్లు ఉంటాయి. వారికి తగినట్లు అనుమతి తీసుకున్న ప్రైవేటు హోటళ్లు నిర్వహిస్తున్నారు. ఇందులో యాత్రికుల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై ఫోకస్ పెట్టారు. యాత్రికుల ఆరోగ్య భద్రతకు టీటీడీ ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ, ఇక్కడ నాణ్యత ప్రమాణాలు లోపించాయనే ఫిర్యాదుల నేపథ్యంలో టీటీడీ ఈఓ జే. శ్యామలరావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. లోపాలను కూడా గుర్తించారు. ఇప్పటి వరకు నామమాత్రపు విధులతో కార్యాలయానికి పరిమితమైన ఫుడ్ సేఫ్టీ అధికారులకు (ఎఫ్ఎస్డీ) చేతినిండా పని కల్పించారు. నిత్యం తనిఖీల కోసం సంచార వాహనం కూడా అందుబాటులో ఉంచారు. రాజకీయ నేతల సహకారంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న యజమానుల ఆగడాలకు చెక్ పెడతారా? అనేది వేచి చూడాలి.

తిరుమల శ్రీవారి దర్శనానికి దేశవిదేశాల నుంచి భక్తులు వస్తుంటారు. రోజుకు కనీసం అంటే 75 నుంచి 80 వేల మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. స్వామివారి ప్రసాదంగా భావించే చాలా మంది తరిగొండ వెంగమాంట అన్నదాన సత్రానికి వెళుతుంటారు. తిరుమలకు పెరుగుతున్న యాత్రికుల సంఖ్యను పరిగణలోకి తీసుకున్న టీటీడీ అన్నప్రసాద కేంద్రాలను మరింతగా విస్తరించింది. తిరుమలలో తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంతో పాటు పీఏసీ-1, 2లో కూడా అన్నదాన విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ ప్రదేశాల్లో రోజుకు 60 వేల మందికి పైగానే యాత్రికులకు అన్నప్రసాదాల వితరణ జరుగుతోంది.
ఉత్తరాది వంటకాలు కూడా
ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చే వారి ఆహార అలవాట్లకు తగినట్లు తిరుమల కొండపై పెద్ద హోటళ్లలోనే కాకుండా, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో కూడా గోబీ మంచూరియా, ఫ్రైడ్ రైస్, నూడుల్స్ విక్రయించే చిన్నపాటి టిఫిన్ సెంటర్లు కూడా ఉన్నాయి. అక్కడ అవసరమైన కూరగాయలు, ఉప్పు, పప్పు, బియ్యం వంటి ఆహార ధాన్యాలు తిరుపతి నుంచి సాధన సంఘం పేరుతో నిర్వహించే లారీ ద్వారా నిత్యం 10 నుంచి 20 టన్నుల సరుకులు రవాణా చేస్తుంటారు.
తిరుమలకు వచ్చే యాత్రికుల ఆరోగ్య భద్రతకు టీటీడీ ప్రాధాన్యం ఇస్తామని ఈఓ జే. శ్యామలరావు చెప్పారు. తిరుమలలోని కౌస్తుభం విశ్రాంతి భవనం సమీపంలో ఉన్న బాలాజీ భవన్ హోటల్‌ను ఫుడ్ సేఫ్టీ విభాగం (ఎఫ్‌ఎస్‌డి) అధికారుల బృందంతో  తనిఖీ అనంతరం ఈవో మీడియాతో మాట్లాడారు. తిరుమలలోని హోటళ్లు పరిశుభ్రం, రుచికరమైన ఆహార ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో, భవిష్యత్తులో ఇలాంటి దాడులు మరిన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ’’హోటల్‌లోని తినుబండారాల తయారీలో నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని స్సష్టం చేశారు.
అనంతరం ఎఫ్‌ఎస్‌డీ డైరెక్టర్ మాట్లాడుతూ, తనిఖీలలో ఈ హోటల్‌లో పూర్తిగా ’’ఆహార భద్రతా నిబంధనలను పాటించలేదు’’ హోటల్‌లో కుళ్లిన కూరగాయలు, ముందు రోజు తయారు చేసిన ఆహారం, పలుమార్లు ఉపయోగించిన నూనె,  నిబంధనలకు విరుద్ధమైన రంగు, రుచి పెంచే ముడి పదార్థాలను ఉపయోగిస్తున్నట్లు మా తనిఖీలో గుర్తించామని ఆయన చెప్పారు.
హోటళ్ల వద్దే నాణ్యత పరిశీలన
అనంతరం ఎఫ్‌ఎస్‌డీ డైరెక్టర్‌తో కలిసి ఈవో మొబైల్ ల్యాబ్, "ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్"ను ప్రారంభించారు. ప్రత్యేకమైన ఈ వాహనం ఆహారం, నీటి నాణ్యతను తనిఖీ చేయడానికి అవసరమైన పరికరాలతో కూడిన ల్యాబ్‌ఉంది. ఈ మొబైల్ ల్యాబ్‌లో 80 రకాల పదార్థాల నాణ్యతలను తనిఖీ చేస్తారు. దీనిని ప్రత్యేకంగా తిరుమలలో ఆహారం, నీరు నాణ్యత ప్రమాణాలను పరిశీలించేందుకు వినియోగిస్తారు.
కొసమెరుపు
హోటల్ లైసెన్స్ రద్దు
టీటీడీ ఈఓ జే. శ్యామలరావు పనితీరు వల్ల అధికారులు కూడా నిర్లక్ష్యం మత్తు వీడినట్లు కనిపించింది. హోటళ్లలో ఆకస్మిక తనిఖీల నేపథ్యంలో నాణ్యతా ప్రమాణాలకు తిలోదకాలు ఇచ్చిన తిరుమలలోని తొమ్మిది పెద్ద హోటళ్లలో ఒకటైన కౌస్తుభం విశ్రాంతి భవనం సమీపంలోని బాలాజీ భవన్ హోటల్ యాజమాన్యం లైసెన్స్ ఫీజు రూ. 76,04,196 చెల్లించలేదని గుర్తించారు. దీంతో ఆ హోటల్ లైసెన్స్ రద్దు చేశారని టీటీడీ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. జూన్ నెలలో ఆ హోటల్‌కు తుది నోటీసులు జారీ చేశారు. స్పందన లేకపోవడంతో లైసెన్స్‌ రద్దు చేసి, టీటీడీ రెవెన్యూ, హెల్త్, విజిలెన్స్ అధికారులతో కూడిన టాస్క్‌ఫోర్స్ బృందం స్వాధీనం చేసుకుంది. ఆ సొమ్ము వసూలు చేయడంలో తాత్సారం ఎందుకు చేశారనేది సమాధానం దొరకని ప్రశ్న. దీనిపై అధికారులపై చర్యలు ఉండవా? అనేది తేలాల్సి ఉంది.
Tags:    

Similar News