తెలంగాణ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడాలంటే...

అప్పుల ఊబిలో కూరుకుపోయిన తెలంగాణ సర్కారు ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పలు సూచనలు చేసింది. దుబారా ఖర్చు తగ్గించుకోవాలని కోరింది.

Update: 2024-06-14 14:32 GMT

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. పదేళ్లపాటు తెలంగాణను పరిపాలించిన బీఆర్ఎస్ 6.72 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిందని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం వెల్లడించింది.

- తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో 34 శాతం చేసిన అప్పులకు వడ్డీ చెల్లించడానికే సరిపోతుందంటే ఆర్థిక సంక్షోభం తీవ్రత ఏపాటిదో విదితమవుతోంది.
- ఆదాయ వనరులను పెంచుకుంటూ మరో వైపు ఆర్థిక దుబారా ఖర్చును తగ్గించుకొని, పొదుపుమంత్రం పాటిస్తేనే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడుతోంది.
- రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి అయిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తీసుకుంటున్న చర్యలను అభినందిస్తూనే హైదరాబాద్ నగరానికి చెందిన స్వచ్ఛంద సంస్థ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పలు సూచనలు చేసింది.

40శాతం రాష్ట్ర ఆదాయం పాలనా వ్యవహారాలకే...
తెలంగాణ రాష్ట్రంలో 40 శాతం ఆదాయం పాలనా వ్యవహారాలకే వెచ్చించాల్సి వస్తోంది. పాలనా యంత్రాంగంలో దుబారా ఖర్చును తగ్గించుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు యం పద్మనాభరెడ్డి సూచించారు. దుబారా ఖర్చు తగ్గించుకొని పొదుపు పాటిస్తే 10 శాతం వ్యయం తగ్గించుకోవచ్చని పద్మనాభరెడ్డి చెప్పారు.
కొత్త వాహనాలు కొనవద్దు...
రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోని అన్ని విభాగాల్లో ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా వాహనాలు కొనవద్దని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సూచించింది. ప్రభుత్వం తరపున విందులు, వినోదాలు, ఫంక్షన్లను నిలిపివేయాలని కోరింది. రైతుభరోసా ఆర్థిక సాయాన్ని 5 ఎకరాల లోపు రైతులకే ఇవ్వాలని, పంటలు సాగు చేసే భూములకే రైతు భరోసా అందించాలని, ఖాళీగా ఉన్న భూములకు రైతు భరోసాను నిలిపివేయాలని ఫోరం పర్ గుడ్ గవర్నెన్స్ సలహా ఇచ్చింది.

ప్రభుత్వ భవనాలు నిర్మించొద్దు
రాష్ట్రంలో ఖర్చు తగ్గించుకునేందుకు ప్రభుత్వ భవనాల నిర్మాణం చేపట్టవద్దని సూచించారు. కులసంఘాల భవనాల నిర్మాణం నిలిపివేయాలని పద్మనాభరెడ్డి ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్కను కోరారు.ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధుల విదేశీ పర్యటనలపై ఆంక్షలు విధించాలని ఫోరం సూచించింది.

దళితబంధు పథకంలో లోపాలు సరిదిద్దండి
దళితబంధు పథకం ఉద్ధేశం బాగున్నా, ఈ పథకం అమలులో పలు లోపాలున్నాయి. దళితబంధు లబ్దిదారుల ఎంపిక కలెక్టరు ద్వారా చేయాలని, లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ ఒత్తిళ్లు ఉండరాదని ఫోరం సూచించింది.ఎంపిక చేసిన దళిత బంధు లబ్ధిదారులకు ఉచితంగా శిక్షణ ఇచ్చి వచ్చే ఏడాది నుంచి నిధులు కేటాయించాలని కోరారు. కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేయాలని కోరింది.

భారీ ప్రాజెక్టులకు నిధులు నిలిపివేయాలి
తెలంగాణ భారీ ప్రాజెక్టుల నిర్మాణాలకు నిధుల మంజూరును నిలిపివేయాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కోరింది. ఒకటి, రెండేళ్లలో ఫలితం వచ్చే చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులను పూర్తి చేయడానికి నిధులు కేటాయించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్కకు ఫోరం సూచించింది. ఉచిత కరెంటు పథకం కింద సన్న, నిన్న, మధ్య తరగతి రైతులకే అదీ రెండు బోర్ల వరకే ఉచిత విద్యుత్ అందించాలని ఫోరం కోరింది. రెండు బోర్ల కంటే ఎక్కువ బోర్లు ఉన్న రైతుల నుంచి విద్యత్ చార్జీలు వసూలు చేయాలని సూచించింది.

ఇందిరమ్మ ఇళ్ల పథకంలో 50 శాతం బ్యాంకు రుణం
తెలంాణ రాష్ట్రంలో ఇళ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు 50 శాతం బ్యాంకు రుణం మంజూరు చేయించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ సోమ శ్రీనివాసరెడ్డి సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అయ్యే 50 శాతం గ్రాంటును రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయాలని ఆయన కోరారు.
ప్రజాప్రతినిధుల జీతభత్యాల్లో 10 శాతం కోత
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో ఉన్నందున ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు,శాసనసభ్యుల జీతభత్యాల్లో 10 శాతం కోత విధించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆర్థిక శాఖమంత్రి భట్టి విక్రమార్కకు సూచించింది. కొత్త కార్పోరేషన్లు, వాటి ఛైర్మన్లు, సిబ్బంది, వాహనాలను వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి తీసుకోవాలని కోరింది.





Tags:    

Similar News