కోటరీ నుంచి బయటపడితేనే జగన్‌కు భవిష్యత్తు

వైఎస్‌ఆర్‌సీపీలో కోటరీ బలంగా పని చేస్తోందని, దీని వల్లే జగన్‌కు తాను దూరమయ్యానని విజయసారెడ్డి చెప్పారు.;

By :  Admin
Update: 2025-03-12 10:53 GMT

మాజీ రాజ్యసభ సభ్యులు, మాజీ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కీలక నాయకుడు విజయసాయిరెడ్డి సంచలన వాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి చుట్టూ ఓ కోటరీ ఉందని, ఆ కోటరీ నుంచి బయట పడితేనే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు. ద్వితీయ శ్రేణి నాయకులు జగన్‌ చుట్టూ కోటరీగా ఏర్పడ్డారని, ఎవరు కలవాలన్నా వారి అనుమతులు లేనిదే కలవలేరని, అలాంటి వాతావరణమే తనకు ఎదురైందని వెల్లడించారు. కాకినాడ సీపోర్టు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయసాయిరెడ్డి బుధవారం సీఐడీ విచారణకు హాజరయ్యారు.

కేవీరావు ఫిర్యాదు మేరకు వైవీ సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, శరత్‌ చంద్రారెడ్డి, శ్రీధర్, అరబిందో రియాల్టీ ఇన్‌ఫ్రా మీద పోలీసులు కేసులు నమోదు చేయశారు. దీని మీద విచారణకు హాజరు కావాలని రెండు రోజుల క్రితం విజయసాయిరెడ్డికి పోలీసులు నోటీసులు పంపారు. ఈ నేపథ్యంలో బుధవారం విజయసారెడ్డి సీఐడీ విచారణకు హాజరయ్యారు. కాకినాడ సీపోర్టు ప్రెయివేటు లిమిటెడ్‌ అధిపతి కేవీరావు నుంచి అక్రమంగా వాటాలను బదిలీ చేసుకున్నారన్న ఆరోపణల మీద మంగళగిరి సీఐడీ పోలీసులు విజయసాయిరెడ్డిని ప్రశ్నించారు. వాటాలు ఏ విధంగా తీసుకున్నారు? బలవంతంగా లాక్కున్నారా? ఎవరెవరి పాత్ర ఎంత ఉంది? అనే అంశాలకు సంబంధించి వివరాలను రాబట్టేందుకు సీఐడీ పోలీసులు విజయసారెడ్డిని విచారణ చేపట్టారు. ఉదయం 11 గంటల నుంచి 3:30 గంటల వరకు విజయసాయిరెడ్డి విచారణ కొనసాగింది.

విచారణ అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. కేవీరావు తన ఫిర్యాదులో పేర్కొన్న అంశాల మీద సీఐడీ అధికారులు తనను ప్రశ్నించారని, తనకు పీవీరావుకు ఎలాంటి పరిచయం లేదని, విధమైన సామాజిక, ఆర్థిక, రాజకీయ సంబంధాలు లేవని పోలీసులకు చెప్పినట్లు తెలిపారు. రూ. 500 కోట్లు బదిలీ అయిన అంశం మీద ప్రశ్నించారని, ఆ సంగతి కూడా తనకు తెలియదని చెప్పినట్లు పేర్కొన్నారు. అరబిందో వ్యాపార లావాదేవీల్లో తానెప్పుడూ జోక్యం చేసుకోలేదని, తన కుమార్తెను అరబిందో వాళ్లకు ఇవ్వడం తప్ప, వారితో కానీ, ఆ సంస్థతో కానీ తనకు ఎలాంటి ఆర్థిక సంబంధాలు లేవని చెప్పినట్లు చెప్పారు.
ఇదే సమయంలో వైవీ సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్‌రెడ్డి గురించి అడిగారని, సుబ్బారెడ్డి కుమారుడిగా విక్రాంత్‌రెడ్డి తనకు తెలుసని చెప్పానన్నారు. తక్కిన విషయాలు తనకు తెలియదని చెప్పినట్లు చెప్పారు. ఈ డీల్‌ గురించి జగన్‌కు తెలియదని, నాకూ ఎలాంటి సంబంధం లేదని సీఐడీ అధికారులకు చెప్పినట్లు వెల్లడించారు. ఎలాంటి సంబంధం లేని తనను ఉద్దేశపూర్వకంగానే ఈ కేసులో ఇరికించారని, గతంలో జగన్‌ కేసులో ఏ2గా ఉన్నాను కాబట్టి ఈ కేసులో కూడా తనను ఏ2గా చేర్చారని వెల్లడించారు. కేవీరావు ఒక బ్రోకర్‌ అని, అతనంటే తనకు అసహ్యమని చెప్పారు.
తనకు జగన్‌మోహన్‌రెడ్డికి మధ్య బేదాభిప్రాయాలు సృష్టించి ఆయన పక్కనే ఉండే కోటరీ గ్యాప్‌ వచ్చేలా చేసిందని ఆరోపించారు. అయితే నాయకుడనే వాడు చెప్పుడు మాటలు నమ్మకూడదన్నారు. చెప్పుడు మాటలు నమ్మితే నాయకు, ప్రజలు, ఇతర నాయకులు, శ్రేణులు నష్ట పోతారని, ఇక్కడ జరిగింది కూడా అదేనన్నారు. వైఎస్‌ఆర్‌సీపీలో కోటరీ బలంగా పని చేస్తోందని, దీని వల్లే జగన్‌కు తాను దూరమయ్యానని విజయసారెడ్డి చెప్పారు.
సార్‌ మీ మనసులో నాకు స్థానం లేదు. నా మనసు విరిగి పోయింది. మీ మనసులో నాకు స్థానం లేనప్పుడు ఈ పార్టీలో కొనసాగాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ పార్టీని వదిలి వెళ్లిపోతున్నాను. మీ చుట్టూ ఉండే కోటరీ చెప్పుడు మాటలు విని మీరు తప్పు దోవ పట్టొదు. మీకు ఎవరు నిజాలు చెబుతున్నారో.. ఎవరు అబద్దాలు చెబుతున్నారో అనేది పూర్తిగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్న తర్వాత నిర్ణయాలు తీసుకోండి. అప్పుడు మీరు ప్రజలకు ఉపయోగపడుతారు. మీరు పార్టీ అధ్యక్షులు. సీఎంగా ఐదేళ్లు పని చేసిన అనుభవం ఉంది. భవిష్యత్తులో కూడా ఇంకా సేవ చేయాలి. కాబట్టి చుట్టూ ఉండే వాళ్ల మాటలు వినొద్దని జగన్‌తో ఫోన్‌లో మాట్లాడినప్పుడు చెప్పానని విజయసాయిరెడ్డి చెప్పారు. ఇలాంటి పరిస్థితులు ఉన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో తిరిగి చేరే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు.
Tags:    

Similar News