ఈ ఐఏఎస్ అధికారి తేనెత్తుట్టెను కదిల్చారా ?

తెలంగాణా ప్రభుత్వంలో సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ స్పందించిన తీరు బాగా వివాదాస్పదమైంది.

Update: 2024-07-22 07:11 GMT

సివిల్ సర్వీసుల్లో దివ్యాంగుల కోటాపై దేశవ్యాప్తంగా బాగా వివాదం రేగుతున్న విషయం తెలిసిందే. పూజా ఖేద్కర్, ప్రఫుల్ దేశాయ్ తదితరుల ఎంపిక బాగా వివాదాస్పదమైంది. దివ్యాంగుల కోటాలో ఐఏఎస్ అధికారులైన వీళ్ళపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. తప్పుడు సర్టిఫికేట్లు పెట్టి యూపీఎస్సీ పరీక్షల్లో పాసవటమే కాకుండా ఐఏఎస్ అధికారులయ్యారంటు నెటిజన్లు రకరకాలుగా ధ్వజమెత్తుతున్నారు. హోలు మొత్తంమీద యూపీఎస్సీ పనితీరుపైనే చాలామంది అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. పూజ, దేశాయ్ మాత్రమే కాకుండా ట్విట్టర్ వేదికగా అనేకమందిపైన రకరకాల ఆరోపణలు ముసుకుంటున్నాయి.

ఈ నేపధ్యంలో తెలంగాణా ప్రభుత్వంలో సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ స్పందించిన తీరు బాగా వివాదాస్పదమైంది. ఆమె స్పందనపై యూపీఎస్సీ పరీక్షలకు కోచింగ్ ఇచ్చే బాలలత విరుచుకుపడ్డారు. స్మితను పట్టుకుని దుమ్ము దులిపేశారు. ఇంతకీ స్మిత ఏమన్నారంటే సివిల్ సర్వీసుల్లో దివ్యాంగుల కోటా ఎందుకని ప్రశ్నించారు. దివ్యాంగులకు గౌరవం ఇవ్వాలని అంటూనే సివిల్ సర్వీసుల్లో దివ్యాంగులకు కోటా అనవసరం అన్నారు. క్షేత్రస్ధాయిలో పనిచేయాల్సిన ఉద్యోగాలకు రిజర్వేషన్లు అవసరంలేదని స్మిత తన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. సివిల్ సర్వీసు ఉద్యోగులకు ఫీల్డ్ వర్క్ చాలా ఉంటుందని, ప్రజల మనో వేదనలను నేరుగా వినటం, తిరగటానికి శారీరక ధృడత్వం చాలా అవసరమని స్మిత చెప్పారు.

వైకల్యం ఉన్న వారిని ఎయిర్ లైన్స్ సంస్ధలు పైలెట్లుగా నియమించుకుంటుందా ? వైకల్యం ఉన్న సర్జన్ని ఎవరైనా నమ్ముతారా అంటు ట్విట్టర్లో ప్రశ్నించారు. స్మిత ట్వీట్లపై శివసేన ఎంపీ ప్రియాంక చౌతుర్వేధి తీవ్రంగా స్పందించారు. బ్యూరోక్రాట్లు తమ పరిమితమైన ఆలోచనలతో ప్రత్యేక అధికారాలను ఎలా ఉపయోగిస్తారనేందుకు స్మిత ట్వీట్లే నిదర్శనమని మండిపోయారు. సుప్రింకోర్టు సీనియర్ అడ్వకేట్ ఎన్. కరుణ మాట్లాడుతు, వైకల్యంపై ఈ ఐఏఎస్ అధికారికి అవగాహన లేదని మండిపడ్డారు. చాలా వైకల్యాలు వ్యక్తుల శక్తి, సామర్ధ్యాలపైన తెలివితేటలపైన ప్రభావం చూపవని ఐఏఎస్ అధికారికి తెలియవని ఎద్దేవాచేశారు.

ఇదే విషయమై బాలలత చాలా ఘాటుగా స్పందించారు. ఐఏఎస్ అధికారిగా అందం ఉంటే సరిపోదని మండిపడ్డారు. దివ్యాంగులు గౌరవంగా బతకకూడదా ? ఉన్నతస్ధాయికి చేరుకోకూడదా అంటు నిలదీశారు. సివిల్ పరీక్షల్లో స్మిత తనతో పోటీపడగలదా ? అని ఛాలెంజ్ చేశారు. దమ్ముంటే తనతో పోటీపడి ఎక్కువ మార్కులు తెచ్చుకుని చూపించాలన్నారు. దివ్యాంగులంటే ఈ ఐఏఎస్ అధికారికి ఎంతటి చిన్నచూపుందో అర్ధమవుతోందని అన్నారు. స్మిత చేసిన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెప్పాలన్నట్లుగా డిమాండ్ చేశారు. స్మిత వ్యాఖ్యలు ఆమె సొంతమా లేకపోతే ప్రభుత్వం అభిప్రాయం కూడా ఇదేనా అన్న విషయంలో బాలలత వివరణ కోరారు. 24 గంటల్లో స్మితపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఆందోళనకు దిగుతామని కూడా బాలలత హెచ్చరించారు. తనపైన పెరిగిపోతున్న వ్యతిరేకతను స్మిత ఎలాగ తట్టుకుంటారో చూడాల్సిందే.

Tags:    

Similar News