మొన్న ఐఏఎస్, నిన్న ఐఎఫ్‌ఎస్, త్వరలో ఐపీఎస్‌

సెప్టెంబరు 18లోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలనే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులేస్తోంది.;

Update: 2025-09-11 05:48 GMT

ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు భారీ ఎత్తున అధికారుల బదిలీలకు తెర తీసింది. కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలం తర్వాత పరిపాలనలో కీలకమైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ అధికారుల బదిలీలు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా తొలుత ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేసింది. కీలకమైన టీటీడీ ఈవోతో పాటు పలు శాఖల్లో పని చేస్తున్న సీనియర్‌ అధికారులను బదిలీ చేసింది. ప్రత్యేక ప్రధాన కార్యదర్శులతో పాటు ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. జే శ్యామలారావును టీటీడీ ఈవో నుంచి తప్పించి జీఏడీకి బదిలీ చేశారు. పోస్టింగ్‌ కోసం ఎదురు చూస్తున్న అనిల్‌ సింఘాల్‌ను టీటీడీ ఈవోగా నియమించారు. అనంతరామును, కృష్ణబాబును, కాంతిలాల్‌ దండేలకు శాఖలు మార్చారు. దాదాపు 11 మంది సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేశారు.

11 మంది ఐఏఎస్‌లను బదిలీలు చేసిన కూటమి ప్రభుత్వం 11 మంది ఐఎఫ్‌ఎస్‌ అధికారులను బదిలీ చేసింది. ఆ మేరకు బుధవారం రాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. పర్యావరణ అభివృద్ధి కార్పొరేషన్‌ ఎండీగా రాజేంద్రప్రసాద్‌ను నియమించారు. అటవీ అభివృద్ధి కార్పొరేషన్‌ ఎండీగా ఎస్‌ఎస్‌ శ్రీధర్, ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిగా ఎస్‌ శ్రీ శర్వాణన్, అటవీ అభివృద్ధి కార్పొరేషన్‌ రీజినల్‌ మేనేజర్‌గా ఎస్‌ శ్రీకాంతనథరెడ్డి, శ్రీశైలం ప్రాజెక్టు టైగర్‌ సర్కిల్‌ ఫీల్డ్‌ డైరెక్టర్‌గా బీ విజయ్‌కుమార్, కర్నూలు సర్కిల్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ అఫ్‌ ఫారెస్ట్‌గా బీవీఏ కృష్ణమూర్తి, రాష్ట్ర సిల్వికల్చరిస్ట్‌ బయోటెక్నాలజీ రీసెర్చ్‌ సెంటర్‌ అధికారిణి ఎం బబిత, డిప్యూటీ కన్జర్వేటర్‌గా ఆఫ్‌ ఫారెస్ట్‌గా జీజీ నరేంద్రన్, తిరుపతి డీఎఫ్‌వోగా వి సాయిబాబా, ఆత్మకూరు అటవీశాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా జీ విఘ్నేష్‌ అప్పారావు, నెల్లూరు అటవీ అభివృద్ధి కార్పొరేషన్‌ రీజినల్‌ మేనేజర్‌గా పి వివేక్‌లను నియమించారు.
ఇప్పటి వరకు ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్‌ అధికారుల బదిలీలను చేపట్టిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఐపీఎస్‌ అధికారుల బదిలీలు కూడా చేపట్టాలనే ఆలోచనల్లో ఉంది. ఆ మేరకు కసరత్తును ముమ్మరం చేసింది. వీలైనంత త్వరగా ఐపీఎస్‌ల బదిలీలు కూడా చేపట్టనున్నారు. సుమారు 10 నుంచి 15 మంది ఐపీఎస్‌లను బదిలీ చేయాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఐపీఎస్‌ల బదిలీల జాబితా కూడా ఓ కొలిక్కి వచ్చినట్లు అధికార వర్గాల్లో చర్చ ఉంది.
మరో వైపు ఈ నెల 15, 16 తేదీల్లో కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లను సీఎం చంద్రబాబు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఆ లోగా ఐపీఎస్‌ అధికారుల బదిలీల ప్రక్రియను పూర్తి చేసి, కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ను అధికారుల్లో ఉత్సాభరిత వాతావరణంలో నిర్వహించాలనే ఆలోచనల్లో సీఎం చంద్రబాబు ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ నెల 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. సుమారు వారం నుంచి పది రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ల నాటికి ఐపీఎస్‌ల బదిలీలు పూర్తి కాకపోతే అసెంబ్లీ సమావేశాల ప్రారంభం నాటికి పూర్తి చేయాలనే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
Tags:    

Similar News