మళ్లీ చదువుకోవాలని ఉంది : సీఎం చంద్రబాబు

హార్డ్‌ వర్క్‌ కాదని.. స్మార్ట్‌ వర్క్‌ చేయాలని విద్యార్థులకు సీఎం చంద్రబాబు సూచించారు.;

Update: 2025-07-10 09:34 GMT

మెగా పేరెంట్‌ కమిటీ సమావేశానికి వచ్చిన తల్లిదండ్రులు, పిల్లలు, ఉపాధ్యాయులను చూస్తుంటే తనకు చాలా సంతోషంగా ఉందని, తనకు మళ్లీ చదువుకోవాలని అనిపిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజక వర్గం కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో గురువారం నిర్వహించిన మెగా పేరెంట్స్‌ కమిటీ 2.0 సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన చిన్న నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తన చిన్నతనంలో తన తల్లి పొట్లాం కట్టిస్తే దానిని తీసుకొని ఆరు కిలోమీటర్లు నడిచి పాఠశాలకు వెళ్లానని చంద్రబాబు చెప్పొకొచ్చారు. ప్రస్తుతం అలాంటి సమస్యలు లేకుండా మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని, చక్కగా చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు.

పాఠశాల అనేది విద్యను అందించే దేవాలయమని, ఈ ఆధునిక దేవాలయాలను రక్షించుకునే బాధ్యత మన అందరిదీ అని పిలుపునిచ్చారు. ఇంత పెద్ద స్థాయిలో తల్లితండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్న విద్యా శాఖ మంత్రి లోకేష్‌ను అభినందించారు. తల్లితండ్రుల తర్వాత ఉపాధ్యాయుడినే ఆరాధించటం మన సంప్రదాయమని పేర్కొన్నారు. గురుపౌర్ణమి రోజున రాష్ట్రవ్యాప్తంగా 61 వేల పాఠశాలల్లో 2.28 కోట్ల మందితో ఈ మెగా పేరెంట్స్‌ సమావేశం నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు.
లోకేష్‌ పాఠశాలలో ఉన్నప్పుడు పేరెంట్స్‌ మీటింగ్‌ తాను ఎప్పుడూ వెళ్లలేకపోయానని.. తన సతీమణి భువనేశ్వరి ఏ సమావేశాన్నీ విడిచిపెట్టకుండా వెళ్లి లోకేష్‌ ను కేంబ్రిడ్జి వరకూ చదివించటంలో శ్రద్ధ పెట్టారని వెల్లడించారు. కుటుంబంలో ఉన్న ప్రతీ పిల్లవాడినీ చదివించాలనే లక్ష్యంతో తల్లికి వందనం పథకాన్ని అందరికీ వర్తింప చేశామన్నారు. ఎంతమంది ఉన్నా వారందరికీ ఈ పథకాన్ని అందించి ఆ కుటుంబాల్లో వెలుగులు తీసుకువచ్చామన్నారు. రాష్ట్రంలోని పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యాశాఖ బాధ్యతను లోకేష్‌ ఏరికోరి తీసుకున్నారని, స్టాన్‌ పర్డ్‌ లాంటి విద్యా సంస్థలో చదువుకున్న లోకేష్‌ రాష్ట్రంలోని విద్యార్ధులందరి భవిష్యత్తు తీర్చిదిద్దుతారని ఈ బాధ్యత అప్పగించామన్నారు. 
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధులను ప్రైవేటు స్కూల్లకు ధీటుగా తీర్చిదిద్దే బాధ్యత కూటమి ప్రభుత్వానిదని సీఎం వెల్లడించారు. నెల్లూరులోని ఓ ప్రభుత్వ పాఠశాలలో సీట్లు ఖాళీలేవని నోవేకెన్సీ బోర్డు పెట్టారంటే నాణ్యత ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చన్నారు. గిన్నీస్‌ రికార్డు సాధించేలా ఈ మెగా కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. తల్లిపేరిట ప్రతీ విద్యార్థి ఒక మొక్క నాటేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. వారికి గ్రీన్‌ పాస్‌ పోర్టు కూడా ఇచ్చామన్నారు. తల్లితండ్రులు లీప్‌ యాప్‌ ను డౌన్‌ లోడ్‌ చేసుకోవాలన్నారు. దీని ద్వారా పిల్లల హాజరు, వారికి వచ్చిన మార్కులు , ప్రవర్తన అన్నీ యాప్‌ ద్వారా సమాచారం ఇస్తున్నామన్నారు.
విద్యాశాఖను మెరుగు పర్చడానికి తల్లితండ్రులు, పాధ్యాయుల అందరి సూచనలూ తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వ హయాంలో విశాఖ ఏజెన్సీలో గంజాయి పెద్ద ఎత్తున పండించారని, డ్రగ్స్‌ , గంజాయి విక్రయించినా పండించినా అదే వారికి చివరి రోజు అవుతందని చంద్రబాబు హెచ్చరించారు. డ్రగ్స్‌ వద్దు బ్రో అనే కార్యక్రమం ద్వారా దీన్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. డ్రగ్స్‌ , గంజాయి విక్రయించే వారి ఆస్తిని కూడా స్వాధీనం చేసుకుంటామన్నారు. డ్రగ్స్‌ , గంజాయి విక్రయించేవారి కుటుంబాలకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు కూడా నిలుపుదల చేస్తామన్నారు.
విద్యార్ధుల్లో నైతిక విలువలు పెంచేలా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. అబ్దుల్‌ కలాం లాంటి వ్యక్తులు మనకు స్పూర్తి కావాలన్నారు. గతంలో 12 సార్లు డీఎస్సీలు నిర్వహించి 1.66 లక్షల మందిని ఉపాధ్యాయులను నియమించామన్నారు. గత ప్రభుత్వం ఒక్క డీఎస్సీ కూడా చేపట్టలేదు. అద్యాఫకులు లేకుండా సంస్కరణలు ఏంటని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో టోఫెల్‌ అన్నారు, ఐబీ సిలబస్‌ అన్నారు.. ఒక్కటి కూడా అమలు కాలేదని చంద్రబాబు అన్నారు. 
కూటమి అధికారంలోకి వచ్చాక మెగాడీఎస్సీ నిర్వహించి 16,347 మంది ఉపాధ్యాయులను నియమిస్తున్నామని, ఆగస్టు నాటికల్లా వారంతా పాఠశాలలకు వస్తారని చంద్రబాబు చెప్పారు. కూటమి ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయుల బదిలీలను పారదర్శకంగా నిర్వహించామన్నారు. 40 లక్షల మంది పైచిలుకు తల్లులకు తల్లికి వందనం పథకం అందించామన్నారు. విద్యార్ధుల్లో ప్రతిభను ప్రోత్సహించేలా షైనింగ్‌ స్టార్స్‌ అని అవార్డులు ఇస్తున్నామన్నారు. పుట్టపర్తిలో స్టేడియం నిర్మాణానికి రూ.2 కోట్లు మంజూరు చేస్తామన్నారు. ఇక అంతా హార్డ్‌ వర్క్‌ కాదు.. స్మార్ట్‌ వర్క్‌ చేయాలి అని విద్యార్థులకు సీఎం సూచించారు. భవిష్యత్‌ అంతా నాలెడ్జ్‌ ఎకానమీదేనని, దానికి అనుగుణంగా మన విద్యార్ధులను తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Tags:    

Similar News