నాడు ఐటీని ప్రమోట్ చేశా..నేడు క్వాంటమ్ టెక్నాలజీని చేస్తున్నా
ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలు భారత దేశాన్ని ఏమీ చేయలేవని, వారికి తగిన బుద్ది చెబుతామని సీఎం చంద్రబాబు అన్నారు.;
By : The Federal
Update: 2025-04-28 11:43 GMT
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ)ని ప్రమోట్ చేశానని, ఇప్పుడు క్వాంటం టెక్నాలజీని ప్రమోట్ చేస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతిలోని విట్ యూనివర్శిటీలో సోమవారం నిర్వహించిన వి–లాంచ్ పాడ్–2025 స్టార్ట్‌అప్ ఎక్స్‌పో కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్టార్టప్ కంపెనీల కోసం వి–లాంచ్ పాడ్–2025ని చంద్రబాబు ఆవిష్కరించడంతో పాటు విట్ యూనివర్శిటీలో పలు డెవలప్‌మెంట్ పనులను ప్రారంభించారు. మహాత్మా గాంధీ బ్లాక్, వివి గిరి బ్లాక్, దుర్గాబాయి దేశ్‌ముఖ్ బ్లాక్‌ల నూతన భవనాలను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విట్ అమరావతిలో 95 శాతం ప్లేస్‌మెంట్లు వస్తున్నాయని చెప్పారు. సిలికాన్ వ్యాలీలోని కంపీనెల సీఈవోలంతా తెలుగోళ్లు, భారతీయులేనని అన్నారు. ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల్లో అటెండర్ పోస్టులకు కూడా డిమాండ్ ఉండేదని, కానీ ఐటీ వచ్చిన తర్వాత కలెక్టర్ పోస్టుల కంటే ఐటీ జాబ్‌లకే డిమాండ్ పెరిగిందన్నారు. ఉద్యోగాలతోనే సంతృప్తి చెందొద్దని, స్టార్టప్‌ల కింద సంస్థలను స్థాపించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులు ప్రపంచ స్థాయిలో రాణించేందుకు అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. టెక్నాలజీని ఉపయోగించి ప్రజలకు సేవలు అందిస్తున్నామని, అందులో భాగంగా వాట్సాప్ సేవలు అందుబాటులోకి తెచ్చామన్నారు.
టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో భాగంగా ఇప్పుడు డ్రోన్ సేవలను అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రభుత్వ పాలనలో టెక్నాలజీకి పెద్ద పీట వేస్తూ రియల్ టైం డేటాతో సమస్యలను పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. నూతనంగా ఆలోచనలకు శ్రీకారం చుట్టడం ద్వారా యువత ముందుకెళ్లి అనేక విజయాలు సాధించాలన్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌ను ఇన్నోవేషన్ వ్యాలీగా తయారు చేయాలని విద్యార్థులకు సూచించారు. భవిష్యత్ అంతా ఏఐదే అని అన్నారు. ఇటీవల పహల్గాం ఉగ్ర దాడులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ఉగ్ర వాదులు, ఉగ్ర వాద సంస్థలు భారత దేశాన్ని ఏమీ చేయలేవని, వారికి తగిన గుణపాఠం చెబుతామన్నారు. దీని కోసం దేశం అంతా సంఘటితం కావాలన్నారు. మే2న ప్రధాని మోదీ అమరావతికి రానున్నారని, మోదీ చేతుల మీదుగా అమరావతి పునఃప్రారంభం కాబోతుందన్నారు.
అంతకుముందు అమరావతి సచివాలయంలో కూటమి నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. రాజధాని అమరావతి పునఃనిర్మాణంతో అభివృద్ధికి మళ్లీ ఊపిరి వచ్చిందన్నారు. భారీ ఎత్తున ప్రజలు వచ్చే విధంగా చూడాలని, తరలి వచ్చే ప్రజలకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నేతలకు సూచించారు. రాజధానిలో రైతులను భాగస్వాములను చేస్తున్నామన్నారు. త్వరలో 42 నియోజక వర్గాల్లో ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటు చేస్తామన్నారు. రాయలసీమ స్టీల్ ప్లాంట్‌కు కూడా నిర్మాణం చేస్తామన్నారు. విశాఖను ఆర్థిక రాజధానిగా, తిరుపతిని ఆధ్యాత్మిక రాజధానిగా తీర్చిదిద్దుతామన్నారు.