హైడ్రా టార్గెట్ పేదలా ? పెద్దలా ?

హైడ్రా స్వరూపం మారిపోతోందా ? ఏ లక్ష్యంతో అయితే హైడ్రా ఏర్పాటైందో దాని లక్ష్యం నుండి పక్కకుపోతోందా ? పేదలు, మధ్య తరగతి జనాలు ఎందుకు శాపనార్ధాలు పెడుతున్నారు ?

Update: 2024-09-27 06:22 GMT

హైడ్రా స్వరూపం మారిపోతోందా ? ఏ లక్ష్యంతో అయితే హైడ్రా ఏర్పాటైందో దాని లక్ష్యం నుండి పక్కకుపోతోందా ? పేదలు, మధ్య తరగతి జనాలు హైడ్రాకు ఎందుకు శాపనార్ధాలు పెడుతున్నారు ? గడచిన వారంరోజులుగా ఈ ప్రశ్నలు జనాల్లో బాగా చర్చనీయాంశమవుతున్నాయి. జనాలు హైడ్రా చర్యలపై ఎందుకింతగా చర్చించుకుంటున్నారు ? ఎందుకంటే దాని స్వరూపం మారిపోతోంది కాబట్టి. హైడ్రా తన లక్ష్యం నుండి పక్కకుపోయిందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి కాబట్టే. చెరువులు, కుంటలు, కాల్వలను ఆక్రమించిన నిర్మాణాలను కూల్చివేసి, సదరు జలవనరులను రక్షించటం, ప్రభుత్వ భూములను ఆక్రమించి చేసిన నిర్మాణాలను తొలగించి భూములను స్వాదీనం చేసుకోవటమే లక్ష్యంగా హైడ్రా ఏర్పాటైంది.



 మొదట్లో హైడ్రా యాక్షన్ బాగానే ఉండేది. అందుకనే జనాలు కూడా పెద్దఎత్తున మద్దతుగా నిలిచారు. బాధితులు పెద్దలైనా పేదలైనా ఆస్తులు పోతోందంటే బాధపడటం చాలా సహజం. అయితే ఆస్తులు పోవటంలో కూడా పేదలు, పెద్దల మధ్య తేడా చాలా ఉంటుంది. పేదలు, మధ్య తరగతి, ఎగువమధ్యతరగతి జనాలు ఆస్తిని ఏర్పాటు చేసుకున్నారంటే దానివెనకాల జీవితకాలపు కష్టార్జితం, పొదుపు, శ్రమ ఉంటుంది. అదే పెద్దల్లో చాలామంది ఆస్తులు ఏర్పాటుచేసుకునే వ్యవహారం వేరేగా ఉంటుంది. చాలామంది ఆస్తుల వ్యవహారంలో కబ్జాలు, అక్రమనిర్మాణాల్లాంటి అనేక రకాలుంటాయి. వీటిని కూల్చేసినా, స్వాధీనంచేసుకుంటే మామూలు జనాలు సంతోషిస్తారు. ప్రభుత్వం మంచి పనిచేసిందంటారు. మొదట్లో ఎన్ కన్వెన్షన్ లాంటి బడాబాబుల అక్రమనిర్మాణాల కూల్చివేతల్లో హైడ్రా అలాగే వ్యవహరించింది కాబట్టే మామూలు జనాలు మద్దతుగా నిలిచారు.



 ఎప్పుడైతే బడాబాబుల అక్రమనిర్మాణాలకు నోటీసులిచ్చి, పేదలు, మధ్య, ఎగువ తరగతి జనాల ఇళ్ళను కూల్చటం మొదలుపెట్టిందో మామూలు జనాల్లో వ్యతిరేకత పెరిగిపోయింది. బ్యాంకులు, ఆర్ధికసంస్ధల్లో చేసిన అప్పులకు తమ పొదుపును జతచేసి ఒక సమకూర్చుకున్న ఇంటిని ఆక్రమణ పేరుతోనే లేకపోతే ఫుల్ ట్యాంక్ లెవల్, బఫర్ జోన్ పరిధిలో ఉందన్న కారణంతో ఇళ్ళని కూల్చేస్తే జనాల పరిస్ధితి ఏమిటి ? దుర్గంచెరువు పరిధిలోని మూడు లేఅవుట్లలో అమర్ సొసైటి కూడా ఒకటి. అందులో రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డికి ఒక విల్లా ఉంది. మూడు సొసైటీలు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలోనే ఉన్నాయని చెప్పి ఇళ్ళ కూల్చివేతలకు హైడ్రా నోటీసులు జారీచేసింది. ఇళ్ళు ఖాళీచేయటానికి యజమానులకు నెలరోజులు సమయం ఇచ్చింది. దాంతో యజమానుల్లో కొందరు ఏమిచేశారంటే కోర్టుకెళ్ళి స్టే తెచ్చుకున్నారు. దాంతో పై మూడు సొసైటీల ఇళ్ళను కూల్చేందుకు లేకుండా స్టే అడ్డుపడింది.



 మరి ఇదే సమయంలో కూకట్ పల్లిలోని నల్లచెరువు, కిష్టారెడ్డిపేట, పటేల్ గూడ లాంటి అనేక ప్రాంతాల్లోని చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో నిర్మించిన 50 ఇళ్ళు, విల్లాలు, అపార్టుమెంట్లను హైడ్రా కూల్చేసింది. వీటిల్లో మధ్య, ఎగువమధ్య తరగతి జనాలే ఉన్నారు. పై 50 నిర్మాణాలను ఖాళీచేసేందుకు హైడ్రా యజమానులకు వారంరోజులు మాత్రమే సమయమిచ్చింది. గడవు అయిపోగానే తెల్లవారుజామునే హైడ్రా బుల్డోజర్లు, పొక్లైనర్లను తీసుకొచ్చి హెచ్చరికలు జారీచేసి వెంటనే కూల్చివేసింది. హైడ్రా వల్ల ఇళ్ళు పోగొట్టుకున్న మధ్య తరగతి, పేదలు వందల్లో ఉన్నారు. హైడ్రా కూల్చేసిన ఇళ్ళని పేదలు, మధ్య తరగతి జనాల జీవితకాలపు కష్టార్జితమనే చెప్పాలి. ఇక్కడే హైడ్రా వ్యవహారశైలిపై జనాల్లో అనుమానాలు, వ్యతిరేకత పెరిగిపోతోంది. హైడ్రా ఉన్నది పేదల ఇళ్ళు కూల్చటానికేనా, పెద్దలజోలికి వెళ్ళదా అనే ప్రశ్నలు పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు హైడ్రా కూల్చేసిన 260 నిర్మాణాల్లో ప్రముఖల నిర్మాణం ఒక్కటి కూడా లేదు.



 గ్రేటర్ పరిధిలో చాలామంది రాజకీయ ప్రముఖులకు ఫాంహౌసులు, వివిధ రంగాల్లోని ప్రముఖులకు వందలాది ఫాంహౌసులున్నాయి. ఈ విషయాలు అందరికీ తెలిసినవే. ఎందుకంటే కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ ప్రముఖుల ఫాంహౌసులని కాంగ్రెస్ నేతలు, మంత్రులు, కాంగ్రెస్ ప్రముఖుల ఫాంహౌసులు పలానా ప్రాంతాల్లో ఉన్నాయని కారుపార్టీ నేతలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటున్నారు. దాంతో రెండుపార్టీల్లోని ప్రముఖుల ఫాంహౌసుల బాగోతాలన్నీ జనాలకు కళ్ళకు కట్టినట్లు కనబడుతున్నాయి. ఈ ఫాంహౌసులన్నీ ఏ చెరువు, కాల్వ, కుంటల ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్నాయో కూడా రెండుపార్టీల నేతలు ఆధారాలతో సహా బయటపెట్టుకుంటున్నారు. మరిందులో ఏ ఒక్కరి ఫాంహౌసును కూడా హైడ్రా కూల్చలేదు. అలాగే అత్యంత ప్రముఖులు నివసిస్తున్న అనేక కాలనీల్లో నిబంధనలను కాలరాసి నిర్మాణాలు చేసినట్లు అనేక ఆరోపణలున్నాయి. అయినా వాటిజోలికి హైడ్రా వెళ్ళటంలేదు.



 ఇక్కడే హైడ్రా చర్యలపైన జనాల్లో అనుమానాలు పెరిగిపోవటమే కాకుండా వ్యతిరేకత పెరిగిపోతోంది. ముందు బడాబాబులు, అత్యంత ప్రముఖుల అక్రమనిర్మాణాలు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఉండే నిర్మాణాలను కూల్చేసి ఆ భూములను హైడ్రా స్వాధీనం చేసుకునుంటే జనాల్లో ఇంత వ్యతిరేకత ఉండేదికాదు. బడా బాబులు, ప్రముఖుల అక్రమనిర్మాణాలను ముందు కూల్చేసి తర్వాత పేదల ఇళ్ళపై హైడ్రా దృష్టిపెట్టుంటే బాగుండేది. ఒకవైపు జనాలు నివాసముంటున్న ఇళ్ళను కూల్చటంలేదని హైడ్రా కమీషనర్ ఏవీ రంగనాధ్ చెబుతున్నా మరోవైపు అధికారులు జనాలుంటున్న ఇళ్ళను కూల్చేస్తున్నారు. హైడ్రా వల్ల విల్లా లేదా ఫాంహౌసును కోల్పోయిన ప్రముఖులు ఒక్కళ్ళు కూడా లేకపోవటమే విచిత్రం.



 తాజాగా మూసీనదికి రెండువైపులా ఆక్రమణలను తొలగించేందుకు అధికారులు ఇళ్ళకు మార్క్ చేస్తున్నారు. వీటన్నింటినీ తొందరలోనే కూల్చేయటం ఖాయమని అర్ధమైపోయింది. అందుకనే పై ప్రాంతాల్లోని జనాలందరు గగ్గోలు పెట్టేస్తున్నారు. దాంతో మూసీ వ్యవహారం రాజకీయరంగు పులుముకుంటోంది. మూసీనదికి రెండువైపులా ఉంటున్న ఇళ్ళ యజమానులకు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళు అండగా నిలిచారు. విచిత్రం ఏమిటంటే మధ్య తరగతి, ఎగుదమధ్య తరగతి, మూసీనదికి రెండువైపులా జనాలుంటున్న ఇళ్ళ నిర్మాణాలకు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, స్ధానిక మున్సిపాలిటీలు లేదా పంచాయితీలు అన్నీ అనుమతులూ ఇచ్చాయి. అన్నీ అనుమతులున్నాయి కాబట్టే బ్యాంకులు, ఆర్ధికసంస్ధలు లోన్లు కూడా ఇచ్చాయి. అన్నీ అనుమతులున్నా కూడా హైడ్రా ఇళ్ళు, విల్లాలు, అపార్టమెంట్లను కూల్చేస్తే మరి తీసుకున్న లోన్లను యజమానులు ఎలా తీరుస్తారు ? ఎందుకు తీర్చాలి ? బ్యాంకులు, ఆర్ధిక సంస్ధలు లోన్లను ఎలా రికవరీ చేసుకుంటాయి ?

Tags:    

Similar News