హైదరాబాద్ బిర్యాని బ్రాండ్ కు భారీ డ్యామేజి
నాన్ వెజ్ లో చాలా బిర్యానీలు ఉన్నప్పటికీ ఆహారప్రియుల మనసును దోచుకున్నది మాత్రం చికెన్ బిర్యానీ(Chicken Biryani) అనే చెప్పాలి.
హైదరాబాద్ అంటేనే ఆహార ప్రియులందరికీ ముందుగా గుర్తుకొచ్చేది హైదరాబాద్ బిర్యానీయే(Hyderabad Biryani). రకరకాల పనుల మీద హైదరాబాద్ కు వచ్చే జనాల్లో మెజారిటి హైదరాబాద్ బిర్యానీని టేస్ట్ చేయకుండా తిరిగి వెళ్ళరంటే అతిశయోక్తికాదు. హైదరాబాద్ బిర్యానీ అంటే చికెన్ బిర్యాని అని మాత్రమే గుర్తుంచుకోవాలి. నాన్ వెజ్ లో చాలా బిర్యానీలు ఉన్నప్పటికీ ఆహారప్రియుల మనసును దోచుకున్నది మాత్రం చికెన్ బిర్యానీ(Chicken Biryani) అనే చెప్పాలి. నగరానికి వచ్చే రాహుల్ గాంధీ(Rahul Gandhi) లాంటి అనేకమంది రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు, దీపికా పడుకోనే(Deepika padukone), ఐశ్వర్యా రాయ్(Iswarya Roy), అమీర్ ఖాన్(Ameer Khan) లాంటి సెలబ్రిటీలు...వీళ్ళు వాళ్ళని కాదు అందరిలోను కామన్ టేస్ట్ ఏమిటంటే హైదరాబాద్ బిర్యానిని రుచి చూడటమే.
దశాబ్దాలుగా ఇంతటి ఘనత వహించిన హైదరాబాద్ బిర్యాని బ్రాండుకు భారీ డ్యామేజి జరిగింది. ఈమధ్య ప్రముఖ హోటళ్ళలోని కిచెన్లలో నాణ్యతా ప్రమాణాలు పాటించటంలేదన్న విషయం బయటపడుతోంది. ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తునే ఉన్నారు కల్తీ ఆహారాలు, కుళ్ళిపోయిన నాన్ వెజ్, పురుగులు పడిన వస్తువులు, కాపురాలు చేస్తున్న బొద్దింకల వ్యవహారాలు బయటపడుతునే ఉన్నాయి. ఇంతేకాకుండా ఆహారంలో కూడా ఏవేవో బయటపడుతున్నాయి. ఈ హోటల్ ఆ హోటల్ అని కాదు తనిఖీలు చేసిన చాలా హోటళ్ళల్లో ఇదే పరిస్ధితులు. పెద్ద పెద్ద హోటళ్ళుగా చెప్పుకుంటున్న వాటి కిచెన్లలో కూడా అపరిశుభ్రవాతావరణాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారులు భరించలేకపోయారని వార్తలు వచ్చాయి. అందుకనే చాలా హోటళ్ళకు జరిమానా విధించటం, మరికొన్ని హోటళ్ళకు తాళాలు వేయించటం మామూలు అయిపోయింది.
ఎన్నిసార్లు అధికారులు తనిఖీలు చేస్తున్నా యాజమాన్యాల ధోరణిలో మార్పయితే రావటంలేదు. దాంతో హోటళ్ళు, రెస్టారెంట్లలో భోజనాలు ముఖ్యంగా నాన్ వెజ్ తినేవాళ్ళు జాగ్రత్తలు తీసుకోండి ఒకటికి పదిసార్లు ఆలోంచించండని అధికారులు జనాలకు అప్పీల్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే దేశంలోని 19 ప్రముఖ నగరాల్లోని హోటళ్ళు, రెస్టారెంట్ల వంటశాలల పరిశుభ్రతపై నేషనల్ క్రై రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ)(NCRB) ఒక సర్వే చేసింది. క్వాలిటి ఫుడ్ అందించే నగరాల జాబితాలో హైదరాబాద్ 19వ స్ధానంలో నిలిచింది. 19 నగరాల్లో సర్వే చేస్తే హైదరాబాదు 19వ స్ధానంలో నిలిచిందంటే ఫుడ్ క్వాలిటి, కిచెన్లలో పరిశుభ్రత ఎంత అధ్వాన్నంగా ఉందో అర్ధమైపోతోంది. ఈ సర్వే ఫలితాలతోనే హైదరాబాదు బిర్యాని బ్రాండ్ ఇమేజి బాగా డ్యామేజి అయ్యిందని అర్ధమైపోతోంది.
ఎప్పుడైతే ఎన్సీఆర్బీ సర్వే ఫలితాలు వెలుగు చూశాయో వెంటనే ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇకనుండి హోటళ్ళు, రెస్టారెంట్ల కిచెన్లలోని పరిస్దితులను రెగ్యులర్ గా తనిఖీలు చేస్తుండాలని డిసైడ్ అయ్యింది. ముందుగా కిచెన్లలోని వాతావరణం శుభ్రంగా ఉంటేనే అక్కడ తయారయ్యే ఫుడ్ కూడా రుచిగా, శుచిగా ఉంటుందని అందరికీ తెలిసిందే. అందుకనే హోటళ్ళ అసోసియేషన్ తో మున్సిపల్ అధికారులు సమావేశం పెట్టుకున్నారు. హైదరాబాద్ లో ఎన్ని హోటళ్ళు, రెస్టారెంట్లు ఉన్నాయనే విషయాన్ని లెక్కేస్తోంది. ఈ లెక్క తేలిన తర్వాత ఎంతమంది ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలకు అవసరమో అంచనాకు రాబోతోంది. నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎన్ఆర్ఏఐ) (NRAI)లెక్కప్రకారం మొన్నటి జూన్ నాటికి ఒక్క హైదరాబాదులోనే 74,807 రెస్టారెంట్లు ఉన్నాయి. అసోసియేషన్ లెక్కలోకి రాని రెస్టారెంట్లు ఇంకా కొన్ని వేలుంటాయని సమాచారం.
సమస్య ఎక్కడుంది ?
సమస్యంతా ప్రభుత్వం వైపునే ఉంది. ఎలాగంటే వేలకు వేల హోటళ్ళు, రెస్టారెంట్లు ఉన్న హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ తరపున ఉన్న ఫుడ్ సేఫ్టీ అధికారులు 23 మంది మాత్రమే. 74 వేల రెస్టారెంట్లను 23 మంది ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేయటం సాధ్యమేనా ? ఒక అధికారి 3,552 రెస్టారెంట్లను తనిఖీ చేయాలంటే పిచ్చెక్కిపోతుంది. తాజా సర్వేలో హైదరాబాద్ బిర్యాని బ్రాండ్ కే డ్యామేజి అని ఎలా చెప్పగలము ? ఎలాగంటే ఆహారప్రియులు హైదరాబాద్ లో ఫుడ్ అంటే టాప్ ప్రయారిటి ఇచ్చేది చికెన్ బిర్యానీకే కాబట్టి. ఈ విషయం ఇప్పటికే ఎన్నోసర్వేల్లో వెలుగుచూసింది. ఏ ఫుడ్ డెలివరీ యాప్ ను తీసుకున్నా తమకు వస్తున్న ఆర్డర్లలో అత్యధికం చికెన్ బిర్యానీకే అని ఎన్నోసార్లు చెప్పాయి. కాబట్టే హైదరాబాద్ బిర్యాని బ్రాండ్ కు డ్యామేజి జరిగిందని చెప్పటం. ఒకసారి బ్రాండ్ ఇమేజి దెబ్బతింటే మళ్ళీ లేపాలంటే ఎంత కష్టమో తెలిసిందే కదా.