జగన్.. కాచుకుంటా.. అని తిరుపతి ఎస్పీ అన్నారా?
సోషల్ మీడియా వర్కర్ల అరెస్టుపై వైసీపీ యుద్ధం ప్రకటించింది. జగన్ చేసిన తనపై వ్యాఖ్యలకు తిరుపతి ఎస్పీ ఏమని స్పందించారు?
By : SSV Bhaskar Rao
Update: 2024-11-11 12:53 GMT
సోషల్ మీడియా వేదికగా యుద్ధం జరుగుతోంది. వైసీపీ సోషల్ మీడియా వారియర్లను అరెస్టు చేయడమే పనిగా పెట్టుకున్నారని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్. జగన్ మండిపడ్డారు. ఈ వ్యవహారంలో తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బారాయుడును ఉద్దేశించి కూడా జగన్ ఘాటుగా హెచ్చరించారు.
"ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. ప్రభుత్వం చేస్తున్న అక్రమాలకు మద్దతు తెలిపే పోలీసులు సప్తసముద్రాల అవతల ఉన్న సరే. వెనక్కి పిలిపించి చర్యలు తీసుకుంటాం"అని జగన్ పోలీసులను హెచ్చరించారు. ఆ క్రమంలో తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు పేరును కూడా ఆయన ప్రస్తావించారు. దీనికి ఎస్పీ సుబ్బారాయుడు సున్నితంగానే, ప్రతిస్పందించినట్లు కనిపిస్తోంది.
" మా విధులు మేము నిర్వహిస్తున్నాం. మంచి ఆశయంతో పని చేస్తున్నాం" అని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు స్పందించారని మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాకుండా, "నాది కూడా రాయలసీమే. అనంతపురం జిల్లాకు చెందిన వ్యక్తిని" అని చెప్పడం ద్వారా తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు సుతిమెత్తగానే సీమ పౌరుషాన్ని వైఎస్. జగన్ కు గుర్తుకు చేసినట్లు కనిపిస్తోంది.
సోషల్ మీడియాలో వచ్చే అభ్యంతరకరమైన పోస్టులు వీడియోలో పైన టీడీపీ కూటమి ప్రభుత్వం మరింత సీరియస్ గా ఉంది. కడప జిల్లా పులివెందులకు చెందిన వర్రా రవీంద్రారెడ్డిని ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. చాలాచోట్ల వైసీపీ సోషల్ మీడియా వర్కర్లను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో..
"అసెంబ్లీ సమావేశాలకు కూడా వెళ్లేది లేదు" అని మాజీ సీఎం వైఎస్. జగన్ సారథ్యంలోని వైసీపీ ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నారు. "ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారని అక్రమ కేసులు పెడుతున్నారు" అని తమ పార్టీ సోషల్ మీడియా వర్కలను సమర్ధించుకుంటూ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టులతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారంటూ పోలీసులపై కూడా ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు.
వచ్చేది మేమే..
"జమిలి ఎన్నికలు అయినా సరే. సార్వత్రిక ఎన్నికలు జరిగిన సరే. మళ్లీ అధికారంలోకి వచ్చేది మేమే" అని వైఎస్. జగన్ ధీమా వ్యక్తం చేశారు. "ఆ తర్వాత మా పార్టీ సోషల్ మీడియా వారియర్లను వేధించి, కేసులు పెట్టిన పోలీసు అధికారులను వదిలిపెట్టం" అని పోలీసు శాఖకు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. అంతేకాకుండా.
"తెలంగాణ నుంచి డిప్యూటేషన్ పై వచ్చిన సుబ్బారాయుడు మళ్లీ అక్కడికే వెళ్లిపోతా" అనే ధైర్యంతో వ్యవహరిస్తున్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చే మా ప్రభుత్వంలో మీరు చేసిన చట్టవ్యతిరేక పనులు దగ్గరుండి బయటకు తీస్తాం" అని ఘాటు హెచ్చరిక చేశారు. ఆయన మాటలకు ధీటుగానే తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు కూడా స్పందించినట్లు కనిపిస్తోంది.
నాది "సీమే.. "
"నాపై నమ్మకంతోనే తిరుపతి జిల్లాకు ఎస్పీగా ప్రభుత్వం నియమించింది. మంచి ఆశయంతో, చట్టానికి లోబడి పనిచేస్తున్నా" అని ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు వ్యాఖ్యానించారు. రాజకీయ విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మాట చెబుతూనే.. "నాది కూడా రాయలసీమలోని అనంతపురం జిల్లా" అని కూడా గుర్తు చేశారు అంటే, ఉడత ఊపులకు భయపడం, బెదరం.. అని వ్యక్తిగతంగా తన మనసులోని మాటను బయటపెట్టినట్లే కనిపిస్తోంది. అంతేకాకుండా, పోలీస్ ఎప్పుడూ అదరడు, బెదరడు అనే విషయాన్ని గుర్తు చేసినట్లే కనిపిస్తోంది.
"మీది రాయలసీమలో కడప జిల్లా పులివెందుల. నాది కూడా ఇదే "సీమ గడ్డ"పై ఉన్న అనంతపురం జిల్లా అని చెప్పకనే చెప్పారు" అన్నట్లుగానే మాజీ సీఎం వైఎస్. జగన్ మాటలకు ఎస్ పీ ఎల్. సుబ్బారాయుడు స్పందించినట్లు కనిపిస్తోంది. ఈ వ్యవహారంపైనే సోషల్ మీడియా, వెబ్ సైట్లలో కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ విషయంపై స్పష్టత కోరేందుకు తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడుకు 'ఫెడరల్ ఆంధ్ర ప్రదేశ్' ప్రతినిధి ఫోన్లో సంప్రదించడానికి ప్రయత్నించారు. కానీ ఆయన ఫోన్ కాల్ లిఫ్ట్ చేయలేదు. వాట్సప్ లో మెసేజ్ పెట్టినా కూడా ఆయన నుంచి స్పందన లేదు