Earth quake|భూకంపాల నుండి హైదరాబాద్ సేఫేనా ?

ఇంట్లోని బీరువాలు, కప్ బోర్డులు కదిలిపోవటం, సీలింగ్ ఫాన్లు ఊగిపోవటం, గోడలు బీటలు పడటం, అలమర్లలో సామాన్లన్నీ కిందపడిపోవటంతో జనాలకు ఏమి జరుగుతోందో అర్ధంకాలేదు.

Update: 2024-12-04 07:29 GMT

బుధవారం తెల్లవారి తెలుగురాష్ట్రాల్లో భూకంపం సంభవించింది. ఉదయం 7.30 గంటల ప్రాంతంలో కొన్నిసెకన్లపాటు భూమి కంపించటంతో జనాలందరు వణికిపోయారు. ఉదయం కాబట్టి ఆపీసులకు వెళ్ళే వాళ్ళు, స్కూళ్ళు, కాలేజీలకు వెళ్ళే పెద్దా, పిల్లా అందరు చాలా హడావుడిగా ఉన్నారు. సరిగ్గా ఆసమయంలో ఇంట్లోని బీరువాలు, కప్ బోర్డులు కదిలిపోవటం, సీలింగ్ ఫాన్లు ఊగిపోవటం, గోడలు బీటలు పడటం, అలమర్లలో ఉన్న సామాన్లన్నీ కిందపడిపోవటంతో జనాలందరికీ ఏమి జరుగుతోందో అర్ధంకాలేదు. ఏదో జరిగిపోతోందన్న భయంతో జనాలందరు ఇళ్ళల్లో నుండి బయటకు పరుగులుపెట్టారు. తెలుగురాష్ట్రాల్లోని ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి, కరీంనగర్, హైదరాబాద్ తో పాటు ఏపీలోని విజయవాడ, ఒంగోలు, కృష్ణాజిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో భూమి 5 సెకన్లపాటు కంపించింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3 గా నమోదైంది.



 మిగిలిన ప్రాంతాలను పక్కనపెట్టేసినా హైదరాబాద్(Hyderabad) లోని వనస్ధలిపురం, అబ్దుల్లాపూర్ మెట్, హయత్ నగర్, బంజారాహిల్స్(Banjara Hills), జూబ్లీహిల్స్(Jubilee Hills) లాంటి చాలా ప్రాంతాలు కంపించటంతో జనాల్లో టెన్షన్ పెరిగిపోయింది. వాస్తవానికి భూకంప కేంద్రం వరంగల్ జిల్లా మేడారం(Medaram) ప్రాంతంలోని ములుగులో కేంద్రీకృతమైంది. ములుగుకు హైదరాబాద్ దాదాపు 250 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయినా ములుగులో కేంద్రీకృతమైన భూకంపం తీవ్రత హైదరాబాదులోని అనేక ప్రాంతాల్లో ఎలాగ ప్రభావం చూపించింది ? అన్నదే జనాలకు అర్ధంకవటంలేదు.


ఇదే విషయమై శాస్త్రజ్ఞులు తమదైన కారణాలను చెప్పారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటి(HCU)లోని ఎర్త్ సైన్సెస్ ప్రొఫెసర్ డాక్టర్ చక్రవర్తి ఏమంటారంటే ‘హైదరాబాద్ లోని అనేక ప్రాంతాల్లో భూకకంపానికి(Earth quake) కారణం భూమిలోపలి పొరలు కదిలిపోవటమే’నట. దీనికి ముఖ్య కారణం ఏమిటంటే ‘మంచినీటి సౌకర్యం కోసం వేలాది అడుగుల్లోతుల్లోకి బోర్లు వేయటం’ అని చక్రవర్తి చెప్పారు. ‘మంచినీటి కోసం జనాలు వందల అడుగులు మించిపోయి వేలాది అడుగుల లోతుల్లోకి భూమిని తవ్వేస్తుండటంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో భూమిపొరలు కదిలిపోతున్న’ట్లు చెప్పారు.



‘ఎప్పుడైతే భూమిపొరలు కదిలిపోతాయో అప్పుడే భూమిపొరలు వదులైపోతాయ’న్నారు. ‘భూమిపొరలు వదులైపోతే పటుత్వం తగ్గిపోతుంద’ని ఆందోళన వ్యక్తంచేశారు. ‘భూమిపొరల్లో గ్యాపులు వచ్చేయటంతో భూపొరలు వదులైపోయి ఎక్కడో సంభవించిన భూకంప ప్రభావానికి హైదరాబాదులోని ప్రాంతాలు కూడా లోనయ్యా’యని చెప్పారు. ‘ముఖ్యంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లాంటి అనేక ప్రాంతాల్లో వేలాది బోర్లు వేయటం కూడా కారణమ’న్నారు. బోర్లు వేసిన వాళ్ళు నీళ్ళు పడనపుడు తిరిగి వాటిని ఫిలప్ చేయటంలేదని చెప్పారు. ‘ఒకపుడు హైదరాబాదులో భూప్రకంపనలు సంభవించినా జనాలకు తెలిసేది కాద’న్నారు. కాని ‘ఇపుడు భూప్రకంపనలు తెలుస్తున్నాయంటే తీవ్రత పెరుగుతున్న’ట్లుగా ఆందోళన వ్యక్తంచేశారు.



 ఇదే విషయమై ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్త శేఖర్ మాట్లాడుతు ‘హైదరాబాదులో భూప్రకంపనల తీవ్రత మెల్లిగా పెరుగుతున్న’ట్లు చెప్పారు. ‘గోదావరి పరివాహక ప్రాంతాల్లో సంభవించిన భూకంపాల తీవ్రత ప్రభావం హైదరాబాదులో కూడా పడుతోంద’న్నారు. భద్రాచలంలో 1969లో భూకంప తీవ్రత 5.7 నమోదైతే తాజా ప్రకంపనలు 5.3 గా నమోదైందన్నారు. ‘నిజానికి భూప్రకంపనల తీవ్రత 6 నమోదయ్యేంతవరకు జనాలు భయపడాల్సిన అవసరంలేద’ని భరోసా ఇచ్చారు. గోదావరి పరివాహక ప్రాంతం జోన్ 3లో ఉందన్నారు. జోన్ 3 అంటే భూప్రకంపనల ప్రభావం తక్కువుండే ప్రాంతాలుగా చెప్పారు. హైదరాబాద్ అయితే సీస్మిక్ జోన్ 2లో ఉంది కాబట్టి ఇప్పటికైతే సేఫే అన్నారు.



అయితే ‘నగరంలోని అనేక ప్రాంతాల్లో వేస్తున్న వేలాది బోర్లను ప్రభుత్వం వెంటనే నియంత్రిం’చాలని హెచ్చరించారు. ‘బోర్ల ద్వారా వేలాది అడుగుల్లోతుల్లోకి జనాలు బోర్లు వేయకుండా మంచినీటి సౌకర్యంకోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ప్రభుత్వమే చేయాల’ని సూచించారు. ఇపుడు సంభవించిన తీవ్రత ప్రభావం వారం నుండి నెలరోజుల వరకు ఉండే అవకాశం ఉందని శేఖర్ చెప్పారు. ‘గోదావరి పరివాహక ప్రాంతాల్లో భూప్రకంపనలు ఎక్కువగా ఉండటానికి ముఖ్యకారణాల్లో సింగరేణి బొగ్గుగనులు కూడా ఒక కారణమ’ని అబిప్రాయపడ్డారు. ‘బొగ్గు తవ్వకాల కోసం సింగరేణి(Singareni Coal Mines) యాజమాన్యం వేలాది అడుగుల్లోకి యంత్రాలను పెట్టి తవ్వకాలు జరుపుతు’న్న విషయాన్ని గుర్తుచేశారు. ‘వందలాది అడుగుల విస్తీర్ణంతో వేలాది అడుగులు భూమిని తవ్వేస్తే ఆ ప్రాంతంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా భూమిపొరలు డిస్ట్రబ్ అయిపో’వటం ఖాయమన్నారు. ఎక్కడైతే భూమిపొరలు వదులు అయిపోతాయో అక్కడంతా భూకంపాల ప్రభావం తీవ్రంగా ఉంటుందని శేఖర్ చెప్పారు. సో, ఇద్దరు సైంటిస్టులు చెప్పిన ప్రకారం చూస్తే ఇప్పటికైతే హైదరాబాద్ సేఫ్ అనే చెప్పాలి. శాస్త్రజ్ఞులు చెప్పిన జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం భూకంపాల ప్రభావం తీవ్రంగా పడటం ఖాయమని అర్ధమవుతోంది.

Tags:    

Similar News