సెప్టెంబర్ 25 నాటికి ఆంధ్రాకి ఎంత యూరియా కావాలంటే..

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి నుండి వ్యవసాయనికి ఇంకా ఎంత యూరియా కావాలి? ఏపీ అగ్రీ మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి చెబుతున్న లెక్క ఏమిటంటే..;

Update: 2025-09-08 06:27 GMT
(ఎంవీఎస్ నాగిరెడ్డి)
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలను యూరియా కొరత వెంటాడుతోంది. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ లో రైతులు వీధుల్లోకి వచ్చి యూరియా కోసం నినదిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్ష వైసీపీ సెప్టెంబర్ 9న రైతుల ఆందోళనకు పిలుపిచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఈ పరిస్థితి ఎందుకు తలెత్తిందీ, పరిష్కారం ఏమిటీ అనేది చర్చనీయాంశంగా మారింది.
ఏయే పంటలకు యూరియా కావాలి..
ప్రధాన పంటలైన వేరుశనగ, పప్పు ధాన్యాలకు యూరియా అవసరం లేదు.. ప్రత్తి కి ఎరువు వేసే సమయం మించిపోయింది. ఇప్పుడు వరి, మొక్క జొన్న, చెరకు పంటలకు యూరియా కావాలి. హార్టికల్చర్ పంటల్లోనైతే కూరగాయలకు, అరటి వంటి మరి కొన్ని పంటలకు తక్కువ మోతాదులో యూరియా కావాలి.
ప్రస్తుతం యూరియా కోసం రైతులు ఆందోళనలకు గురి అవుతున్నది వరి, మొక్క జొన్న సాగు చేసిన ప్రాంతాలలోనే.. ఈ ప్రాంతాలలో రైతు లు యూరియా కోసం చాలా ఇబ్బంది పడుతున్నది వాస్తవం. ఈ సమస్య పరిష్కారానికి అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టాలి.
ఖరీఫ్ లో వరికి ఎకరానికి 70 కిలోలు కాంప్లెక్స్ (40 కిలోలు DAP+30 కిలోలు NPK కాంబినేషన్ ఉన్న కాంప్లెక్స్) 70 నుండి 75 కిలోలు యూరియా 4 దఫాలుగా వాడతారు.
ఈ ఖరీఫ్ లో సెప్టెంబర్ 3 నాటికి 32 లక్షల ఎకరాలలో వరి సాగైంది. దీన్లో 2.5 లక్షల ఎకరాలు ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 3 వరకూ జరిగింది. ఇప్పుడు జరుగుతున్న వారం, రాబోయే వారం మరొక 2.5 లక్షల ఎకరాలలో సాగు పెరగవచ్చు. అంటే మొత్తం దాదాపు 5 లక్షల ఎకరాలకి చేరుతుంది. ఈ లెక్కన ఎకరానికి మొత్తం డోస్ 70 నుండి 75 కిలోల యూరియా అవసరం అవుతుంది..
5,00,000×75కేజీలు=37,500 టన్నులు.
13వ వారానికి ముందు (సెప్టెంబర్ 3కి ముందు) సాగు జరిగిన 29.5 లక్షల ఎకరాల పొలంలో లేట్ గా సాగు జరిగిన కొంత పొలానికి ఇంకా రెండు సార్లు, చిరు పొట్ట దశలో ఉన్న పొలానికి ఆఖరి డోస్ అవసరం ఉంది. అంటే సగటున ఎకరానికి సుమారుగా 40 కేజీల యూరియా అవసరం ఉంది. ఈ లెక్కన 29,50,000×40=1,18,000 టన్నుల యూరియా కావాలి.
మొక్క జొన్నకు వరి కంటే రెట్టింపు పైగా రసాయనిక ఎరువులు వాడతారు.
రాష్ట్రంలో సెప్టెంబర్ 3నాటికి 3.5 లక్షల ఎకరాలలో మొక్క జొన్న సాగైంది. ఇప్పటికి వాడిన ఎరువు పోను ఇంకా సుమారుగా ఎకరానికి 60 కిలోల యూరియా అవసరం ఉండవచ్చు..
3,50,000×60=21000 టన్నులు కావాల్సి ఉంటుంది.
మొత్తంగా అన్ని పంటలకు కలిపి చూస్తే 37,500+1,18,000+21000=1,76,500 టన్నుల యూరియా ఈ సెప్టెంబర్ ఆఖరి నాటికి (హార్టికల్చర్ పంటలకు కాకుండా) అవసరం.
చెరకు సాగు జరిగింది కేవలం 58 వేల ఎకరాలు మాత్రమే.
ఒక సామాన్య రైతు ప్రతినిధిగా ఆలోచిస్తే అర్థమయ్యే పరిస్థితి ఇది.
ఈ పరిస్థితిని అర్థం చేసుకుని.. మన దగ్గర స్టాక్ ఎంత ఉందో సరిచూసుకుని మిగిలిన యూరియాను సెప్టెంబర్ 25 లోపు తెప్పించుకోవాలి. లేకపోతే పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రభుత్వం ఈ విషయాన్ని సానుకూలంగా ఆలోచించి రైతులకు యూరియా అందుబాటులోకి తేకపోతే కౌలు రైతులు, చిన్న, సన్నకారు రైతులు నష్ట పోతారు.

(రచయిత- ఏపీ రైతు సంఘం నాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్, భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ICAR) మాజీ సభ్యుడు)
Tags:    

Similar News