కేసీఆర్ ను పబ్లిక్ చూసి ఎంత కాలమైందో

తాము జనాలను కలుస్తుండటం, జనాలు తనను కలుస్తుంటేనే ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉంటారు నేతలు.

Update: 2024-10-25 06:30 GMT

తెలంగాణా రాజకీయ నేతల్లో కేసీఆర్ ది చాలా విచిత్రమైన వ్యక్తిత్వం. మామూలుగా ఏ రాజకీయ నేతయినా నిత్యం జనాల్లోనే ఉండాలని అనుకుంటారు. తాము జనాలను కలుస్తుండటం, జనాలు తనను కలుస్తుంటేనే ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉంటారు నేతలు. అధికారపార్టీ, ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తిచూపుతు, జనాల్లో తిరుగుతుండాలనే ఏ నేతయినా అనుకుంటారు. కానీ మిగిలిన నేతలకు కేసీఆర్(KCR) వైఖరి పూర్తి భిన్నంగా ఉంటుంది. ముఖ్యమంత్రిగా ఉన్నా జనాలను కలిసింది లేదు, ప్రతిపక్షంలో కూర్చున్నా జనాలగురించి పట్టించుకున్నది లేదు. పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో కూడా జనాల్లోకి వచ్చింది చాలా తక్కువనే చెప్పాలి. పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా సచివాలయం(Secretariat)కు వచ్చింది తక్కువే. సచివాలయంలో ఉన్నది తక్కువ ఫామ్ హౌసు(Farm House)లో ఉన్నదే చాలా ఎక్కువని అందరికీ తెలిసిందే.

మంత్రులు, ఉన్నతాధికారులు, పార్టీ నేతలు కలవాలన్నా అవకాశం ఇచ్చేవారు కాదు. ఎవరినైనా తాను కలవాలని అనుకున్నపుడు మాత్రమే పిలిపించుకునే వారంతే. అధికారంలో ఉన్న పదేళ్ళు కేసీఆర్ ఇలాగే గడిపేశారు. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాతయినా అధికారం కోసం రెగ్యులర్ గా జనాల్లోనే ఉంటారని పార్టీ నేతలు అనుకున్నారు. అయితే నేతలు అనుకున్నదంతా తప్పని తేలిపోయింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జనాలకే కాదు పార్టీ నేతలకు కనబడింది కూడా తక్కువే. ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఒక్కసీటులో కూడా బీఆర్ఎస్ గెలవలేక బొక్కబోర్లా పడింది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో జనాలను కలిసిందే ఆఖరు. ఆ తర్వాత ఒకసారి మీడియాతో మాట్లాడినపుడు కాళేశ్వరం(Kaleswaram), మేడిగడ్డ(Medigadda) ప్రాజెక్టులను రైతులతో కలిసి ముట్టడిస్తానని, అగ్గిపుట్టిస్తానని చేసిన ప్రకటనలు ఏమయ్యాయో తెలీదు.

ఒకరోజు అసెంబ్లీ(Telangana Assembly) సమావేశాలకు హాజరయ్యారు. ఆ సమయంలో ప్రజావ్యతిరేక పాలన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలువునా చీరేస్తానని భీకరంగా హెచ్చరించారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పటివరకు చప్పుడు చేయలేదు. మధ్యలో కొద్దిరోజులు పార్లమెంటు నియోజకవర్గాల సమీక్షలు చేసినపుడు నేతలతో పాటు వాళ్ళ కుటుంబసభ్యులతో ఫొటో సెషన్లు, సెల్ఫీలు దిగారు. అంతే అప్పటినుండి ఇప్పటివరకు కేసీఆర్ ఫామ్ హౌసులో ఏమిచేస్తున్నారో కూడా ఎవరికీ అర్ధకావటంలేదు.

జనాల కష్టాలు కూడా పట్టదా ?

భారీ వర్షాల కారణంగా కొన్నిజిల్లాలు అతలాకుతలం అయిపోయాయి. తుపాను దెబ్బకు లక్షలాది మంది ప్రజలు రోజుల తరబడి అల్లాడిపోయారు. అయినా సరే వారిని పరామర్శించలేదు. చెరువులు, కుంటలు, కాల్వలను ఆక్రమించుకుని నిర్మించుకున్న నిర్మాణాల్లో కొన్నింటిని హైడ్రా(Hydra) కూల్చేసింది. హైడ్రా దెబ్బకు వందలమంది ఇళ్ళ యజమానులు బాదితులుగా మారిపోయి రోడ్డున పడ్డారు. ఇప్పటికీ హైడ్రా ఎవరి నిర్మాణాలను కూల్చేస్తుందో అనే భయం చాలామందిని వెంటాడుతోంది. అయినా కేసీఆర్ బాధితులను కలిసి భరోసా ఇచ్చిందిలేదు. హైడ్రా బాధితుల సంగతే ఇలాగుంటే ఇక మూసీనది(Musi River Front) బాదితుల సంగతి చెప్పేదేముంది ?

మూసీనది పునరుజ్జీవనం పేరుతో నదికి రెండువైపులా ఉన్న ఆక్రమణలు, నిర్మాణాలను క్లియర్ చేయాలని ప్రభుత్వం అనుకున్నది. దాంతో వేలాదిమంది బాదితులు గగ్గోలు పెట్టేస్తున్నారు. ఇప్పటికి 200 ఇళ్ళను ప్రభుత్వం కూల్చేసింది. బాధితులకు పునరావాసం కింద ఎక్కడెక్కడో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను కేటాయిస్తోంది. తాము ఉన్నచోట నుండి కదిలేదిలేదని బాధితులు, ఎలాగైనా ఇళ్ళు ఖాళీ చేయాల్సిందే అని ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉన్నాయి. 13 వేలమంది బాధితులను మూసీనది దగ్గర నుండి ఖాళీ చేయించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. బాధితులను బీజేపీ(BJP) నేతలు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) సీనియర్ నేతలు హరీష్ రావు(Harish Rao), వేముల ప్రశాంత్ రెడ్డి కలిశారు. మూసీనది కేంద్రంగా ఇంత గోల జరుగుతున్నా కేసీఆర్ మాత్రం ఒక్కసారి కూడా బాదితుల దగ్గరకు వచ్చిందిలేదు.

అధికారంలో ఉన్నపుడే జనాల్లోకి కేసీఆర్ వెళ్ళింది తక్కువ కాబట్టి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత రెగ్యులర్ గా జనాల్లోకి వస్తారని వేసిన అంచనా తప్పయింది. తరచూ కాకపోయినా కష్టాల్లో ఉన్నపుడు నేతల నుండి ఓదార్పును, భరోసాను జనాలు కోరుకోవటం చాలా సహజం. అదికూడా కేసీఆర్ నుండి జనాలకు అందని ద్రాక్షపండులాగే అయిపోవటమే ఆశ్చర్యంగా ఉంది.

Tags:    

Similar News