రాజధాని అమరావతి ఇప్పుడు దెయ్యాలదిబ్బగా మారిందా!

ప్రపంచ స్థాయి రాజధాని, అంతర్జాతీయ ప్రమాణాలు, నవ నిర్మాణాలంటూ ఊదరగొట్టిన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పదేళ్ల తర్వాత ఇప్పుడెలా ఉంది?

Update: 2024-05-09 07:10 GMT

ప్రపంచ స్థాయి రాజధాని, అంతర్జాతీయ ప్రమాణాలు, నవ నిర్మాణాలంటూ ఊదరగొట్టిన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పదేళ్ల తర్వాత ఇప్పుడెలా ఉంది? ఓపక్క హైకోర్టు మరోపక్క అసెంబ్లీ ఇంకోవైపు సెక్రరేటియట్ అంటూ మొదలెట్టిన నిర్మాణాలు ఇప్పుడెలా ఉన్నాయి? అమరావతి నుంచి హైదరాబాద్ కు, అమరావతి నుంచి బెంగళూరుకి తలపెట్టిన రోడ్లు ఇప్పుడేమయ్యాయి?


మహాకవి శ్రీ.శ్రీ. చెప్పినట్టు.. ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమసమూహములన్నట్టుగా ఉన్నాయా? అంటే అవుననే అంటున్నారు రాజధానికి భూములిచ్చిన రైతులు. రాష్ట్రం విడిపోయి పదేళ్లయినా ఏపీ రాజధాని ఏదీ అంటే సరైన సమాధానం దొరకడం లేదు.

విజయవాడ నుంచి 20 కిలోమీటర్ల దూరంలోని అమరావతిని 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. సుదీర్ఘ చర్చలు, సంప్రదింపులు, దేశదేశాల పర్యటనల అనంతరం నవ నిర్మాణాలంటూ చేపట్టిన అమరావతి మహానగరం ఇప్పుడు దెయ్యాలదిబ్బగా ఉందంటే ఆశ్చర్యం కాదు. కోర్ సిటీగా భావించిన అమరావతి మహానగరమంతా మొండి గోడలతో, సగం సగం పూర్తయిన భవనాలతో, తుప్పుబట్టిపోయిన యంత్రాలతో, గడ్డకట్టుకుపోయిన ఇసుక, కంకర, సిమెంటు దిబ్బలతో, పూడిపోయిన కాల్వలతో, ఎండిపోయిన ట్యాంకులతో దర్శనం ఇస్తోంది. రాజధానికి భూములిచ్చి ఈసురోమంటున్న రైతులతో, బజ్జీలు పునుగులు, కూరగాయల బండ్లతో అమరావతి ప్రాంతం ఉసూరంటున్నది. ప్రభుత్వం ఇచ్చే కౌలుతో బతుకెళ్లదీస్తున్న మరికొందరు ఏదో ఒక నాటికి రియల్ ఎస్టేట్ పెరక్కపోతుందా? అనే ఆశాభావంతో వచ్చిపోయే వాహనాలను చూస్తూ రచ్చబండల మీద కాలక్షేపం చేస్తున్నారు.

“మా పిల్లల భవిష్యత్తును కూడా లెక్కచేయకుండా మూడు పంటలు పండే భూముల్ని రాజధానికి ఇచ్చాం. రాజధాని వస్తుందన్న నమ్మకంతో అప్పు చేసి ఇళ్లు కట్టుకున్నాం. కానీ నేడు పెరుగుతున్న అప్పు తప్ప మాకు మిగిలిందేమీ లేదు” అన్నారు గుంటూరు జిల్లా అమరావతికి చెందిన రైతు ఎం.శేషగిరిరావు.

2014లో కొత్త తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ను విభజించినప్పటి నుంచి రాజధానికి సంబంధించిన వివాదాస్పద అంశం రాష్ట్ర రాజకీయాలను వెంటాడుతూనే ఉంది. మే 13న ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరగబోతున్నాయి. 2024 జూన్ 2 తర్వాత ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా హైదరాబాద్ ను వినియోగించుకునే అవకాశం ఉండదు. అయినా రాజధాని అంశం ఇంతవరకు కొలిక్కిరాలేదు. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ అధినేత జగన్ మాత్రం తన రాజధాని విశాఖపట్నమేనని, తాను అక్కడే రెండోసారి ప్రమాణం చేస్తానని చెబుతున్నారు. చంద్రబాబు మాత్రం తాను మళ్లీ అధికారంలోకి వస్తే అమరావతిని కట్టితీరుతానంటున్నారు.

2014లో చంద్రబాబు అమరావతిలో "ప్రపంచ స్థాయి రాజధాని" కట్టాలని ప్రతిపాదించారు. ఏపీ రాజధాని అభివృద్ధి ప్రాంతం (ఏపీసీడీఆర్) కింద భూ సేకరణను ప్రారంభించింది. గుంటూరు, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లోని 29 గ్రామాల నుంచి సుమారు 33,000 ఎకరాల భూమిని సేకరించారు. 2015 అక్టోబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ రాజధానికి శంకుస్థాపన చేశారు.

ఐదేళ్లు గడిచాయి. 2019 ఎన్నికలు వచ్చాయి. జగన్ ప్రభుత్వం వచ్చింది. ఏపీసీడీఆర్ చేపట్టిన ప్రాజెక్టులను నిలిపేసింది. 2019 డిసెంబర్‌లో మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చింది. విశాఖపట్నంను "కార్యనిర్వాహక రాజధాని"గా, అమరావతిని "శాసన రాజధాని"గా కర్నూలును "న్యాయ రాజధాని"గా ప్రకటించింది. దీంతో అమరావతి రైతుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ‘‘రాష్ట్రాభివృద్ధి కోసం తమకున్న ఏకైక ఆధారాన్ని వదులుకుంటే ఇప్పుడీ పరిస్థితి వచ్చిందంటూ’’ అని వెంకటపాలెం గ్రామానికి చెందిన జే రమేశ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క రాజధాని కోసం ఇచ్చిన భూముల్ని నిరుపేదల ఇళ్ల నిర్మాణానికి వినియోగించాలన్న ప్రతిపాదనను కూడా స్థానికులు వ్యతిరేకించారు. “నా చిన్నతనంలో ఇది పచ్చటి పొలం. దశాబ్దం క్రితం టీడీపీ వారు ఈ గ్రామాన్ని సింగపూర్‌గా మారుస్తామని చెప్పారు. ఈరోజు అది ‘చెత్త కుప్ప’గా మారింది” అన్నారు మందడం గ్రామవాసి కృష్ణారెడ్డి. “నా తల్లిదండ్రులు రాజధాని కోసం 8 ఎకరాల భూమిని ఇచ్చారు. ఇప్పుడు ఏమి చేయాలో అర్థం కాక దిక్కులు చూస్తున్నాం అన్నారు కృష్ణారెడ్డి.


ఈ ప్రాంతంలో రాజధాని ఏర్పాటుకు అధికార ప్రతిపక్ష పార్టీలు రెండూ అంగీకరించాయి. ఆ తర్వాతే పరిస్థితి మారిపోయింది. టీడీపీ వాళ్లు చేపట్టిన ఏ ప్రాజెక్టును కొనసాగించకూడదన్న అభిప్రాయంతో వైఎస్ జగన్ ఉన్నారనే దానికి అమరావతి రాజధానే పెద్దనిదర్శం అంటున్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌. వచ్చే ఎన్నికల్లో (2024) ఎన్నికల్లో గెలిచిన మూడు నెలల్లో మొత్తం 29 గ్రామాలకు సంబంధించిన విజన్ డాక్యుమెంట్‌తో బయటకు వస్తాం. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో అమరావతిని గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేస్తాం అంటున్నారు శ్రావణ్ కుమార్. ఆయనే కాదు పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్ కూడా అదే మాట అంటున్నారు.

గుంటూరు లోక్‌సభ స్థానంలో ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో తాటికొండ ఒకటి. 2019లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఆరింటిలో (తాడికొండ, పొన్నూరు, తెనాలి, మంగళగిరి, ప్రత్తిపాడు, గుంటూరు తూర్పు) గెలుపొందగా, మిగిలిన ఒకటి (గుంటూరు వెస్ట్) టీడీపీ గెలుచుకుంది. గుంటూరు లోక్‌సభ సీటు నుంచి టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్ విజయం సాధించారు. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో దేశంలోనే అత్యంత సంపన్న అభ్యర్థుల్లో ఒకరైన పేమసాని చంద్రశేఖర్‌ను టీడీపీ బరిలోకి దించింది. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు కిలారి వెంకట రోశయ్యను ఆయన ఎదుర్కొంటున్నారు. పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకుని టీడీపీ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తోంది.

2019లో తాడికొండ నుంచి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి ఉండవల్లి శ్రీదేవి దాదాపు 4 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినందుకు వైఎస్సార్‌ సీపీ సస్పెన్షన్‌కు గురైన శ్రీదేవి గతేడాది డిసెంబర్‌లో టీడీపీలో చేరారు. అయితే ఆమెకు టీడీపీ ఈసారి టికెట్ ఇవ్వలేదు.

ప్రస్తుతం బరిలో ఉన్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేకతోటి సుచరిత పోయినసారి ఎన్నికల్లో పొరుగున ఉన్న ప్రత్తిపాడు అసెంబ్లీ స్థానం నుంచి గెలిచారు. ఆమె ఇప్పుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌ను సవాల్ చేస్తున్నారు. సుచరితకు రాజధాని ప్రాంత రైతుల నుంచి నిరసన వ్యక్తమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

“రాజధాని గురించి ప్రజలు మమ్మల్ని ప్రశ్నిస్తున్నందున ఇక్కడ ప్రచారం చేయడం కూడా మాకు కష్టమే. మేము మూడు రాజధానులు ఎందుకు అవసరమో చెప్పాలని చూస్తున్నా ఇక్కడి వాళ్లు వినేలా లేరు ”అని సుచరిత అనుచర నాయకుడు అంగీకరించారు. ఎన్నికల సమయంలో ఇవన్నీ మామూలేనని తేలిగ్గా కొట్టిపారేస్తోంది వైసీపీ నాయకత్వం. రాజధాని కేవలం పాలనాపరమైందే తప్ప అదే సర్వస్వం కాదన్నది వైసీపీ నేతల వాదనగా ఉంది. కానీ, తుళ్లూరు గ్రామంలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు మాత్రం అందుకు భిన్నంగా స్పందించారు. ఇక్కడ వైఎస్సార్‌సీపీకి ప్రచారం చేయడం కష్టం’’ అని పార్టీ నేత ఒకరు చెప్పారు. “రాజధాని విషయంలో ప్రజల నుంచి ప్రతిఘటన వస్తుందనే భయంతో మా కేడర్‌లో కొందరు బయటకు వెళ్లేందుకు భయపడుతున్నారు’’ అని వ్యాఖ్యానించారు మరికొందరు. 29 బాధిత గ్రామాల్లో ఒకటైన ఉద్దండరాయునిపాలెంకు చెందిన వైఎస్‌ఆర్‌సిపికి చెందిన బాపట్ల ఎంపీ నందిగామ సురేశ్ బాబు కూడా ఈ అంశంపై మాట్లాడానికి వెనుకాడుతున్నారు.

సురేశ్ ఇంటికి కొన్ని కిలోమీటర్ల దూరంలో సీఆర్డీఏకి చెందిన చాలా సంస్థలున్నా వాటి భద్రతకు ఒక సెక్యూరిటీ గార్డు కూడా లేకపోవడం దేనికి సంకేతమూ అర్థం కావడం లేదు.

రాజధాని కట్టలేదన్న అసంతృప్తి ఈ ప్రాంతంలో బాగానే ఉంది. చిన్నా చితక వ్యాపారాలు చేసుకునే వారు, ఆటో మెకానిక్ షాపులు నడుపుకునే వారు, ఆటోలు, కార్లు నడుపుకునే వారు కూడా తీవ్ర అసంతృప్తే వ్యక్తం చేస్తున్నారు. “ప్రతి రాష్ట్రానికీ ఒక రాజధాని ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది? అని ప్రశ్నించే వాళ్ల సంఖ్య ఎక్కువగానే ఉంది. రాష్ట్ర రాజధాని ఉంటే ఉద్యోగాలు వస్తాయనే అభిప్రాయం కూడా కొందరిలో ఉంది.

అమరావతికి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న మచిలీపట్నానికి చెందిన ఓ డ్రైవర్ చెప్పే దాని ప్రకారం, టీడీపీ హయాంలో తాను నెలకు కనీసం 20 ట్రిపులు అమరావతి, విజయవాడ మధ్య వేసేవారట. ఇప్పుడది 10 కూడా ఉండడం లేదని డ్రైవర్ శేషయ్య చెప్పారు. ఇలా చుట్టుపక్కల టౌన్లు వారు చెబుతున్నారు.

2104 నుంచి 2019 వరకు గుంటూరు నుంచి వెలగపూడికి ఆర్టీసీ బస్ లో సీటు దొరకాలంటే చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు బస్సులు బోసిపోయి వస్తున్నాయన్నది తాడికొండకు చెందిన మల్లికార్జున్ వాదన.

అమరావతిలోకి వెళ్లే ప్రధాన రహదారి పొడవునా పెద్ద డ్రైనేజీ పైపులు పడి ఉన్నాయి. వాటిలో కొన్ని పగిలిపోయి ఉంటే మరికొన్ని మట్టితో సగం వరకు నిండి ఉన్నాయి. రోడ్డు పక్కన సగం నిర్మించిన అపార్ట్మెంట్ కాంప్లెక్లులు దిష్టిబొమ్మల్లా కనిపిస్తున్నాయి. వీటికి డబ్బులు కట్టిన వాళ్లు లబోదిబో మంటున్నారు. ఈ ప్రభుత్వాన్ని ఎందుకు క్షమించాలో చెప్పండంటున్నారు నెల్లూరు నుంచి అమరావతి ప్రాంతంలో బిల్డర్ గా మారిన వెంకట్రామిరెడ్డి.

2022 మార్చిలో అమరావతిని రాష్ట్ర రాజధానిగా అభివృద్ధి చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వైసీపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వం దానిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేసు వేసింది. ప్రస్తుతం అది పెండింగ్‌లో ఉంది. తమకు తెలియజేయకుండా రాజధానిని తరలించవద్దని హైకోర్టు చెప్పింది.

వైసీపీ ప్రభుత్వం మాత్రం ఇవేవీ పట్టించుకోలేదు. 2024 ఎన్నికల మానిఫెస్టోలో యథావిధిగా తాము మూడు రాజధానుల హామీకే కట్టుబడి ఉన్నామని ప్రకటించింది. విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధాని అనే స్పష్టం చేసింది. 

Tags:    

Similar News