విజయవాడ వరదల్లో నుంచి నేరుగా ఒక కథనం

నేను ఉదయమే బయటకు వెళ్లే టైములో వరద మా ఇంటి ముందు రోడ్డుమీద మోకాలి లోతు ఉంది. తిరిగి ఉ. 9 గంటలకు ఇంటికి వచ్చే సరికి వరద నడుములోతు దాటింది.

By :  Admin
Update: 2024-09-09 10:55 GMT

-ఇప్టూ ప్రసాద్

రాష్ట్ర రాజధాని విజయవాడలోని న్యూ ఆర్ఆర్ పేట లోని సుబ్బరాజు నగర్ నగర్ లో నివసిస్తున్నాము . బుడమేరు వరదలో చిక్కుకున్న సింగు నగర్, పాయకాపురం, కండ్రిక, రాజీవ్ నగర్, ప్రకాష్ నగర్, రాధా నగర్, సుందరయ్య నగర్ వంటి ప్రాంతాల్లో మా ప్రాంతం ఒకటి. గత 24 గంటల్లో పదులవేల కుటుంబాల బాధలు వర్ణనాతీతమైనవి. మేము ఫస్ట్ ఫ్లోర్ లో అద్దెకు ఉంటున్నందున మా ఇల్లు వరదలో చిక్కుకున్నా , మా ఇంట్లోకి వరద నీరు రాలేదు. గ్రౌండ్ ఫ్లోర్ దొరక నందున ఫస్ట్ ఫ్లోర్ కి మారాం. ఫలితంగా మా ఇంట్లోకి ఇప్పుడు వరద రాలేదు. ముఖ్యంగా నా పుస్తకాలు సురక్షితంగా ఉన్నాయి. దీన్నిబట్టి మాకంటే అనేక రెట్లు దుర్భర స్థితిని అనుభవించే కుటుంబాల సంఖ్య మావంటి వాళ్లకంటే అనేక రెట్లు ఎక్కువే. మా బాధను అర్థం చేసుకుంటే, అంతకంటే అనేక రెట్ల బాధల్ని అనుభవించే ప్రజల బాధల్ని ఊహించుకోవచ్చును.

మూడు రోజుల పాటు చిత్తూరు, తిరుపతి జిల్లాల పర్యటన ముగించుకొని నిన్న (1.9.2024) తెల్లవారుజామున మూడు గంటలకు ఇంటికి చేరాల్సిన నేను ఎట్టకేలకు ఉదయం ఏడు గంటలకు చేరుకోగలిగా. కొత్తగా వర్షం కురవకుండానే హఠాత్తుగా మా వీధిలోకి నిన్న ఉదయం సుమారు 7:30 గంటలకు వరదనీరు వచ్చింది. ఎనిమిది గంటలకు మా ఇంటి ముందు రోడ్డుమీద ఒక అడుగు మట్టం చేరింది. చూస్తూండగానే వరద పెరిగింది. తమ టూవీలర్లు, ఆటోలను ఇరుగుపొరుగు వాళ్ళు బయటకు తరలించ సాగారు. నా బండిని ఎనిమిదిన్నరకు పక్కింటి కుర్రోడి సాయంతో మోకాలి లోతు వరదలో బయటకు తరలించాను. ఈ పేటలో మెరక వీధుల్లో నేనెరిగిన ఇళ్లల్లో బండి పెడదామని నాలుగైదు చోట్లకు వెళ్ళా. అటువైపు కూడా వరద క్రమంగా పోటెత్త సాగింది. ఇతరులు తమ బండ్లను తరలిస్తున్న దిశలో వెళ్లి దూరాన బాగా మెరక వీధిలోని సచివాలయం సమీపాన బండిని ఉంచి యింటికి కష్టంగా తిరిగి వచ్చా. నేను బండిని ఇంటి నుంచి తీసుకు వెళ్లే టైములో వరద మా ఇంటి ముందు రోడ్డుమీద మోకాలి లోతు ఉంది. తిరిగి 9 గంటలకు ఇంటికి వచ్చే సరికి వరద తొడలు దాటి నడుం అంచుకు చేరింది. బాల్యంలో ఈతగాణ్ణి అయినందున ఆత్మ విశ్వాసంతో వరద పోటు గుండా ఇంటికి చేరుకోగలిగాను. సాయంత్రం కల్లా వరద మా రోడ్డు మీద ఐదు అడుగులకు చేరింది. సుమారు ఆరు అడుగుల ఎత్తున్న ఓ గజ ఈతగాడు నిన్న సాయంత్రం ఐదు గంటలకు మా ఇంటి ముందు రోడ్డులో ఓ ఊత కర్రతో నడుస్తుంటే, భుజాల వరకూ మునిగి కేవలం తలకాయ కనిపిస్తున్న దృశ్యాన్ని మా డాబా పైనుంచి స్వయంగా చూసాము. మా ఇంటి గ్రౌండ్ ఫ్లోర్ పోర్షన్ లోకి మూడడుగుల లోతు నీళ్లు వచ్చాయి. (అందులో వుండే వాళ్లు ముందే వేరే చోటకు వెళ్ళిపోయారు). ఓ పెద్ద సరస్సులో తేలియాడే ఇళ్ళుగా మా డాబా పైనుంచి మా కాలనీల ద్రృశ్యం కనిపిస్తోంది.

నిన్న సుమారు ఉదయం ఎనిమిది గంటలకు కరంటు ఆపేశారు. మాకు త్రాగునీళ్లు లేవు. దుకాణాలకు వెళ్ళే అవకాశం లేదు. ఇంటర్నెట్ లేదు. టీవీలు లేవు. చార్జింగ్ అయిపోయిన ఫోన్లు పనిచేయవు. నిన్న సాయంత్రం కల్లా దాదాపు 90 శాతం కుటుంబాల్లో ఫోన్లు ఆగిపోయాయి. నా ఫోన్ 22.8.2024 న రిపేరుకొచ్చి ఆగిపోయింది. మేజర్ రిపేరు కావడంతో ఇంకా రిపేరు చేయించలేదు. పద్మ ఫోన్ కూడా నిన్న సాయంత్రం నుంచి పనిచేయడం లేదు. రాష్ట్ర రాజధాని లో నివసిస్తూ మా ప్రక్కింటి వాళ్లతో సహా బంధుమిత్రులు, కామ్రేడ్స్ తో సంబంధాలు లేవు.

గత రాత్రి గడపడం ప్రజలకు దుర్భరంగా వుంది. అదో కాళరాత్రి. తెల్లారేసరికి వరద తగ్గుతుందనే బాధిత ప్రజల ఆశలు ఫలించలేదు. ఈ లేఖ రాస్తున్న టైం కి కేవలం బెత్తెడు మట్టం మాత్రమే తగ్గింది. ఇలా నెమ్మదిగా తగ్గితే మరో 48 గంటలకు గాని వరద పోటు నుండి బయటపడలేము.ఈరోజు రాత్రికి నేను అనంతపురం వెళ్లాలి. ఈ దుస్థితిలో వెళ్లలేను. కనీసం రేపు రాత్రికి బస్సుకి వెళ్లాలన్నా సాధ్యం కాదు. ఒకవేళ నేను బ్యాగులో బట్టలు పెట్టుకుని వరద నీటిలో బయటకు వెళ్లే అవకాశం ఉన్నా, ఈ పరిస్థితుల్లో నా సహచరి పద్మను వదిలేసి వెళ్లలేను. 




Tags:    

Similar News