కవిత బెయిల్ పై బండి సెటైర్లు

సుప్రింకోర్టు కవితకు ఇలా బెయిల్ మంజూరు చేసిందో లేదో వెంటనే కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ వెంటనే సెటైర్లు వేసేశారు.

Update: 2024-08-27 10:00 GMT

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కల్వకుంట్ల కవితకు బెయిల్ రావటాన్ని బీజేపీ తట్టుకోలేకపోతోంది. సుప్రింకోర్టు కవితకు ఇలా బెయిల్ మంజూరు చేసిందో లేదో వెంటనే కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ వెంటనే సెటైర్లు వేసేశారు. కవితకు బెయిల్ వచ్చిందన్న ఉక్రోషం ఆయన సెటైర్లో స్పష్టంగా కనబడింది. కవితకు బెయిల్ వచ్చిన వెంటనే బండి తన ట్వట్టర్ ఖాతాలో కాంగ్రెస్ పార్టీకి, పార్టీ లాయర్లకు అభినందనలు తెలిపారు. కవితకు బెయిల్ ఇప్పించే విషయంలో కాంగ్రెస్ పడిన కష్టానికి ఫలితం వచ్చిందని ఎద్దేవా చేశారు.

బెయిల్ రావటం ఇటు కాంగ్రెస్ తో పాటు అటు బీఆర్ఎస్ రెండుపార్టీలు సాధించిన విజయంగా చెప్పారు. బీఆర్ఎస్ లీడర్ కవిత బెయిల్ మీద బయటకు రావటం, కాంగ్రెస్ నేత రాజ్యసభ ఎంపీ అవటం ఒకేసారి అయినట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రతిపాదించిన రాజ్యసభ ఎంపీ అభ్యర్ధికి మద్దతు ఇవ్వటం కేసీఆర్ చాణుక్యంలో భాగమే అన్నారు. కవిత బెయిల్ విషయంలో మొదట్లో కోర్టులో వాదనలు వినిపించిన లాయర్ ను కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీని చేయటం కేసీఆర్ చాణుక్యానికి నిదర్శనంగా బండి అభివర్ణించారు. క్విడ్ ప్రో కో నేరంలో భాగంపంచుకుని విజయం సాధించిన కాంగ్రెస్, బీఆర్ఎస్ కు అభినందనలు తెలిపారు. విలీనం మాట ముచ్చట పూర్తయ్యింది ఇక అప్పగింతలే తరువాయి అంటు బండి ట్విట్టర్ ఖాతాలో సెటైర్లు వేశారు.

కవితకు బెయిల్ రావటంపై నిజానికి బండి ఇంతగా స్పందించాల్సిన అవసరమే లేదు. బెయిల్ రావటంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కృషి ఫలించిందని బండి అనటంలో అర్ధమేలేదు. బండి చెప్పిందే నిజమైతే మరి ఐదునెలలు కవితకు బెయిల్ రాకుండా జైలులోనే ఉంచటంలో బీజేపీ విజయం సాధించిందని అంటే అంగీకరిస్తారా ? తన కూతురును కుట్రతో అరెస్టుచేసి బీజేపీ జైలులో ఉంచిందన్న కేసీఆర్ ఆరోపణలను బండి అంగీకరిస్తున్నట్లుగానే అనుకోవాలి.

ఇక్కడ విషయం ఏమిటంటే బీఆర్ఎస్ తొందరలోనే బీజేపీలో విలీనమైపోతుందని రేవంత్ తో పాటు కాంగ్రెస్ నేతలు పదేపదే చెబుతున్నారు. కేసీఆర్ ఏదో రాష్ట్రానికి గవర్నర్ గా, కేటీఆర్ కేంద్రమంత్రగా, కవిత రాజ్యసభ ఎంపీగా వెళతారని, హరీష్ రావు అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ అవుతారని రేవంత్ ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో బండి స్పందిస్తు బీఆర్ఎస్ ను కేసీఆర్ కాంగ్రెస్ లో కలిపేస్తారని ఎదురు ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ కలిసిపోగానే కేసీఆర్ కు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా, కేటీఆర్, కవిత, హరీష్ కు సముచిత బాధ్యతలు అప్పగించటానికి రంగం రెడీ అయిపోయిందని బండి ఆరోపించారు. వీళ్ళ ఆరోపణలు, ఎదురు ఆరోపణల్లో నిజాలు ఎంత అన్నది తెలియకపోయినా కవితకు బెయిల్ రావటాన్ని బండి తట్టుకోలేకపోతున్నారన్నది మాత్రం వాస్తవం.

Tags:    

Similar News