సుప్రిం విచారణతో హిందుత్వ ఛాంపియన్ల నోర్లుపడిపోయాయా ?

హిందుత్వానికి తామే ప్రతినిదులమని, ఛాంపియన్లమని నానా గోలచేసిన బీజేపీ నేతలు నోళ్ళు తెరవటంలేదు. సుప్రింకోర్టు విచారణ దెబ్బకు వీళ్ళ నోళ్ళు మూతపడిపోయాయి.

Update: 2024-10-01 08:30 GMT

హిందుత్వానికి తామే ప్రతినిదులమని, ఛాంపియన్లమని నానా గోలచేసిన బీజేపీ నేతలు నోళ్ళు తెరవటంలేదు. సుప్రింకోర్టు విచారణ దెబ్బకు వీళ్ళ నోళ్ళు మూతపడిపోయాయి. ఇంతకీ విషయం ఏమిటంటే తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయంలో లడ్డూ ప్రసాదంలో వాడిన నెయ్యి కల్తీ జరిగిందని, జంతుకొవ్వు ఉపయోగించారని చంద్రబాబునాయుడు చేసిన ఆరోపణలపై ప్రపంచవ్యాప్తంగా ఎంత గోల జరిగిందో అందరికీ తెలిసిందే. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని భూస్ధాపితం చేయాలన్న టార్గెట్ తో లడ్డూ అస్త్రాన్ని చంద్రబాబు ప్రయోగించారు. ఇది నూరుశాతం రాజకీయపరమైన ఆరోపణలే కాని మరోటి కాదని అందరికీ అర్ధమవుతునే ఉంది. ఎందుకంటే జగన్ పై ఆరోపణలు చేసిన చంద్రబాబు తన ఆరోపణలకు ఆధారాలను మాత్రం చూపించలేదు. ఆధారాలు లేకుండానే ఆరోపణలు చేయటం అంటే అది రాజకీయ ఆరోపణలు కాక మరేమిటి ?

చంద్రబాబు అలా ఆరోపణలు చేశారో లేదో ఇక మద్దతు మీడియా రంగంలోకి దిగేసి ఎంత కంపుచేయాలో అంతా చేసేసింది. ఇందులో భాగంగానే జగన్ను వ్యతిరేకించే వాళ్ళంతా పదిరోజులు తమిష్టంవచ్చినట్లు నోళ్ళు పారేసుకున్నారు. జగన్ను శాపనార్ధాలు పెట్టారు, నోటికొచ్చినట్లు తిట్టారు, వార్నింగులు కూడా ఇచ్చేశారు. ఇందులో భాగంగానే తెలంగాణాకు చెందిన కేంద్రమంత్రి బండి సంజయ్, రాజాసింగ్, మాధవీలత కూడా తామేమీ తక్కువ తినలేదన్నట్లుగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. బండి కన్నా రాజాసింగ్, మాధవీ చేసిన ఓవర్ యాక్షన్ తో జనాలు ఆశ్చర్యపోయారు. భగవంతుడికి జగన్ అపచారం చేశాడంటు మాధవీ ప్రాయశ్చిత దీక్ష పేరుతో చాలా హడావుడి చేశారు. తన మద్దతుదారులను వెంటపెట్టుకుని తిరుపతికి చేరుకుని భజనలు చేసుకుంటు అలిపిరి మెట్ల మార్గంలో తిరుమల చేరుకుని శ్రీవారి దర్శించుకున్నారు. హైదరాబాద్ నుండి బయలుదేరినపుడు, తిరుపతి నుండి తిరుమల చేరుకునే మెట్ల మీద కూడా ఒకవైపు భజనలు చేస్తు మరోవైపు జగన్ను నోటికొచ్చినట్లు తిడుతునే ఉన్నారు.

ఇక రాజాసింగ్ ఓవర్ యాక్షన్ మరోస్ధాయిలో ఉంది. జగన్ కనబడితే చంపేయాలన్నంత కసిలో జనాలున్నారంటు ఒక వీడియో రిలీజ్ చేశారు. భగవంతుడి మీద భక్తి లేనపుడు జగన్ అసలు తిరుమలకు ఎందుకు వెళ్ళాలంటు తీవ్రంగా ప్రశ్నించారు. జగన్ చేసిన అపచారం వల్ల తిరుమల దేవాలయానికి అపచారం జరిగిపోయిందని, హిందువులంతా మండిపోతున్నారంటు వార్నింగు కూడా ఇచ్చారు. మాధవీ, రాజాసింగ్ వ్యవహారం ఎలాగుందంటే హిందుత్వానికి, హిందూమతానికి తామే ఛాంపియన్లం అన్నట్లుగా చాలా బిల్డప్ ఇచ్చారు. జగన్ పైన తమలో పేరుకుపోయిన కసినంత ఈ సందర్భంగా తీర్చేసుకున్నారు. అసలు తిరుమల ప్రసాదాల విషయంలో ఏమి జరిగిందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారో తెలీదు. లేకపోతే అపచారం ఏమీ జరగకపోయినా సరే జరిగిపోయిందని చంద్రబాబు ఆరోపణలను సమర్ధిస్తు జగన్ను టార్గెట్ చేయాలన్న టార్గెట్ తో నోటికొచ్చింది మాట్లాడేశారు.

సీన్ కట్ చేస్తే లడ్డూ వివాదంపై సోమవారం జరిగిన విచారణలో జస్టిస్ గవాయ్, జస్టిస్ విశ్వనాధన్ దెబ్బకు టీటీడీ లాయర్ సిద్ధార్ధ లూథ్రా చేతులెత్తేశారు. లడ్డూ కల్తీపై ద్విసభ్య ధర్మాసనం వేసిన చాలా ప్రశ్నలకు లూథ్రా సమాధానాలు చెప్పలేకపోయారు. దాంతో లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగినట్లు టీటీడీ ఎలాంటి ఆధారాలను చూపించలేకపోయిందని ధర్మాసనం అభిప్రాయపడింది. పైగా మొత్తం వ్యవహారంలో చంద్రబాబునే ధర్మాసనం తప్పుపట్టింది. సున్నితమైన అంశంలో ఆధారాలు లేకుండానే ఆరోపణలు చేసేసి భక్తుల మనోభావాలను గాయపరుస్తారా అంటూ లాయర్ ద్వారా చంద్రబాబును తప్పుపట్టింది. దాదాపు గంటకుపైగా జరిగిన విచారణలో లడ్డూ ప్రసాదంలో ఎలాంటి కల్తీ జరగలేదని ద్వాసభ్య ధర్మాసనం నిర్ణయానికి వచ్చింది. కల్తీ నెయ్యిని ప్రసాదాల తయారీలో వాడలేదన్న ఈవో శ్యామలరావు ప్రకటనను సుప్రింకోర్టు ప్రస్తావించినపుడు లూథ్రా ఏమీ సమాధానం చెప్పలేకపోయారు.

మొత్తంమీద ధర్మాసనం వేసిన ప్రశ్నలకు లూథ్రా సమాధానం చెప్పలేకపోవటంతో చంద్రబాబు చేసిన ఆరోపణలన్నీ తప్పుడు ఆరోపణలే అన్న విషయంలో జనాలందరికీ క్లారిటి వచ్చేసింది. ఈ నేపధ్యంలోనే హిందుత్వానికి ఛాంపియన్లమన్నట్లుగా బిల్డప్పులు ఇచ్చుకున్న రాజాసింగ్, మాధవి ఇపుడు ఎక్కడా నోరెత్తటంలేదు. బండి సంజయ్ కూడా తిరుమల విషయంతో తనకు సంబంధంలేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కోర్టు పరిధిలో ఉన్న అంశంపై తాను మాట్లాడనని అంటున్నారు. మొత్తంమీద సుప్రింకోర్టు విచారణ వీర హిందువులమని చెప్పుకునే చాలామంది నోళ్ళు మూయించేసినట్లు అర్ధమవుతోంది.

Tags:    

Similar News