బాంబుపేలుళ్ళ నిందితుల ఉరిశిక్షను సమర్ధించిన హైకోర్టు

బాంబుపేలుళ్ళల్లో 18 మంది చనిపోగా 130 మందికి తీవ్రగాయాలయ్యాయి;

Update: 2025-04-08 05:56 GMT
Telangana High Court

దిల్ సుఖ్ నగర్లో జరిగిన బాంబుపేలుళ్ళ కేసు నిందితులకు ఉరిశిక్షను హైకోర్టు సమర్ధించింది. 2013, ఫిబ్రవరి 21వ తేదీన దిల్ సుఖ్ నగర్లో రెండు బాంబుపేలుళ్ళు జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది. ఆ బాంబుపేలుళ్ళల్లో 18 మంది చనిపోగా 130 మందికి తీవ్రగాయాలయ్యాయి. పేలుళ్ళకు ఇండియన్ ముజాహిదీన్(Indian Mujahedeen) టెర్రరిస్టులే కారణమని నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ(ఎన్ఐఏ) గుర్తించింది. పేలుళ్ళకు యాసిన భత్కల్(Yasin Bhatkal) నాయకత్వంలో అసదుల్లా అక్తర్, వకాస, తెహసీన్ అక్తర్, ఎజాజ్ షేక్, సయ్యద్ మక్బూల్ ప్రధాన కారకుతులుగా ఎన్ఐఏ గుర్తించింది. వీళ్ళకోసం ఎన్ఐఏ దేశవ్యాప్తంగా జల్లెడపట్టింది. దేశంలోని అనేకప్రాంతాల్లో జరిపిన సోదాల ఫలితంగా ఐదుగురు టెర్రరిస్టులు పట్టుబడ్డారు. దిల్ సుఖ్ నగర్(Dilsukhnagar Bomb Blast) బస్టాప్ తో పాటు మిర్చియార్డులో కొద్ది నిముషాల వ్యవధిలోనే రెండు బాంబుపేలుళ్ళు జరిగాయి.

దొరికిన వాళ్ళని అరెస్టుచేసిన ఎన్ఐఏ(NIA Court) విచారణలో అనేక విషయాలను రాబట్టింది. తర్వాత విచారణకోసం ఏర్పాటుచేసిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు(Fast track Court) లో ఎన్ఐఏ అందరినీ ప్రవేశపెట్టింది. దాదాపు మూడేళ్ళ విచారణ తర్వాత ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిందితులు ఐదుగురికి 2016లో మరణశిక్షను విధించింది. అయితే ఆతీర్పును సవాలుచేస్తు నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. అప్పటినుండి కేసు విచారణ జరుగుతునే ఉంది. నిందితుల తరపు లాయర్, ఎన్ఐఏ తరపు లాయర్ వాద, ప్రతివాదనలు విన్న తర్వాత హైకోర్టు ఉరిశిక్షను సమర్ధించింది. జరిగిన బాంబుపేలుళ్ళు, చనిపోయిన, బాధితుల పరిస్ధితిని గమనించి 157 మంది సాక్ష్యులను విచారించిన తర్వాత నిందితులకు ఎన్ఐఏ కోర్టు విధించిన ఉరిశిక్ష సబబే అని హైకోర్టు(Telangana High Court) జడ్జి కే. లక్ష్మణ్, జస్టిస్ పి. శ్రీసుధ ధర్మాసనం మంగళవారం తీర్పుచెప్పింది.

ఐదుగురు నిందితులను ఎన్ఐఏ దేశంలోని వివిధ ప్రాంతాల్లో పట్టుకోగా పేలుళ్ళ సూత్రధారి యాసిన్ భత్కల్ ను మాత్రం నేపాల్ సరిహద్దుల్లో పట్టుకున్నారు. భత్కల్ అప్పటికే దిల్ సుఖ్ నగర్ తో పాటు ఢిల్లీలో అంతకుముందు జరిగిన బాంబుపేలుళ్ళల్లో కూడా సూత్రధారిగా గుర్తించారు. రెండు కేసుల్లోను నిందితుడిగా తేలటంతో కోర్టు వేసిన శిక్ష కారణంగా భత్కల్ ఢిల్లీలోని తీహార్ జైలులో శిక్షను అనుభవిస్తున్నాడు.

Tags:    

Similar News