హైకోర్టు బెయిలిచ్చింది..సుప్రీం కోర్టు నోటీసులిచ్చింది

ఏపీ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి సంజయ్‌ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.;

Update: 2025-04-02 03:30 GMT

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారికి, తన మీద నమోదైన కేసులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయగా, భాతర దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్‌ను సవాల్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో, ఈ పిటీషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్‌ అమానుతుల్లా, జస్టిస్‌ పీకే మిశ్రా సుప్రీం కోర్టు దీని మీద కౌంటర్‌ దాఖలు చేయాలని ఆ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారికి నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెలాఖరుకు సుప్రీం కోర్టు వాయిదా వేసింది.

ఆంధ్రప్రదేశ్‌ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులో ఎన్‌ సంజయ్‌ ఒకరు. ఈయన 1996వ బ్యాచ్‌కు చెందిన అధికారి. అదనపు డైరెక్టర్‌ జనరల్‌ ర్యాంకులో ఉన్నారు. ప్రస్తుతం ఈయనను ఆంధ్రప్రదేశ్‌ కూటమి ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. గత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో అగ్నిమాపక శాఖ డీజీగా ఉన్నప్పుడు, సీఐడీ చీఫ్‌గా విధులు నిర్వహించినప్పుడు నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారనే అభియోగాలతో సంజయ్‌ను సస్పెండ్‌ చేసింది.
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టార్గెట్‌ అయిన ఐపీఎస్‌ అధికారుల్లో సంజయ్‌ ఒకరు. ఆయన కంటే ముందు మరో అదనపు డైరెక్టర్‌ జనరల్‌ ర్యాంకులో ఉన్న పీ సీతారామాంజనేయులు, ఐజీ ర్యాంకులో ఉన్న కాంతి రాణా టాటా, డీఐజీ ర్యాంకులో ఉన్న విశాల్‌ గున్నీలను తొలుత టార్గెట్‌ చేసింది. ముంబాయి సినీ నటి కాదంబరి జెత్తాని కేసులో వీరిని సస్పెండ్‌ చేసింది. తర్వాత ఎన్‌ సంజయ్‌ను తెరపైకి తెచ్చారు. ఆయన తర్వాత ఇదే పోస్టుల్లో పని చేసిన మరో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీవీ సునీల్‌ కుమార్‌ మీద కూడా టార్గెట్‌ పెట్టి సస్పెండ్‌ చేసింది.
కూటి అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో సంజయ్‌ నిర్వహించిన పోస్టుల మీద దృష్టి సారించింది. అగ్నిమాప శాఖతో పాటు సీఐడీ విభాగాల్లో సంజయ్‌ అక్రమాలకు పాల్పడ్డారని, దీనిపై విజిలెన్స్‌ విచారణ జరిపించాలని నిర్ణయించింది. కూటమి ప్రభుత్వ ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన విజిలెన్స్‌ అధికారులు ఎన్‌ సంజయ్‌ అవకతవకలకు పాల్పడ్డారని, దాదాపు రూ. 2 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారని ప్రభుత్వానికి నివేదికలను అందించింది. ఈ రిపోర్టుల ఆధారంగా ఎన్‌ సంజయ్‌ను విధుల నుంచి కూటమి ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది.
అగ్నిమాపక శాఖలో ఎన్‌వోసీ సర్టిఫికేట్లను ఆన్‌లైన్‌లో జారీ చేసేందుకు అగ్ని–ఎన్‌వోసీ వెబ్‌సైట్, మొబైల్‌ యాప్‌ డెవలప్‌మెంట్, దాని నిర్వహణ, 150 ట్యాబ్‌ల సరఫరాలకు సంబంధించిన కాంట్రాక్టును సౌత్రికా టెక్నాలజీస్‌ అండ్‌ ఇన్‌ఫ్రా సంస్థకు అప్పగించారు. ఈ సంస్థ ద్వారా ఎలాంటి పనులు చేపట్టక పోయినా, రూ. 59.93 లక్షలకు సంబంధించిన బిల్లులను సౌత్రికా టెక్నాలజీస్‌ అండ్‌ ఇన్‌ఫ్రా సంస్థకు చెల్లించారు. ఇక సీఐడీలో.. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం మీద ఎస్సీ, ఎస్టీలకు అవేర్‌నెస్‌ ప్రోగ్రామ్స్‌ నిర్వహించేందుకు సంబంధించిన కాంట్రాక్టును క్రిత్వా్యప్‌ టెక్నాలజీస్‌ సంస్థకు నాడు సీఐడీ చీఫ్‌గా ఉన్న సంజయ్‌ ఇవ్వడంతో పాటు ఈ సంస్థ ద్వారా ఎలాంటి సదస్సులు నిర్వహించకుండానే, సీఐడీ ఆధ్వర్యంలోనే కార్యక్రమాలను నిర్వహించి, అవన్నీ క్రిత్వా్యప్‌ టెక్నాలజీస్‌ సంస్థ ద్వారా నిర్వహించినట్లు చూపించి, దీని కోసం రూ. 1.19 కోట్లు బిల్లులు చెల్లించడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చారని పేర్కొంటూ విజిలెన్స్‌ అధికారులు ప్రభుత్వానికి నివేదికను అందించారు.
ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఏసీబీని రంగంలోకి దింపింది. విచారణ జరిపి నిగ్గు తేల్చాని ఆదేశాలు జారీ చేసింది. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ ఎన్‌ సంజయ్‌ మీద కేసును నమోదు చేసింది. విచారణకు అనుమతించాలని ప్రభుత్వ ప్రధాన క్యాదర్శికి లేఖ రాశారు. ఇదే సమయంలో విచారణకు హాజరు కావాలంటూ సంజయ్‌కు నోటీసులు జారీ చేసింది. 30 రోజుల్లో స్వయంగా వ్యక్తిగతంగా విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఎన్‌ సంజయ్‌ ఏసీబీ నమోదు చేసిన కేసులో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని పిటీషన్‌ దాఖలు చేశారు. సీనియర్‌ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరామ్‌ పిటీషనర్‌ సంజయ్‌ తరపున వాదనలు వినిపించారు. కూటమి ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు నమోదు చేసింది, సంజయ్‌ అక్రమాలకు పాల్పడ్డారనేది అవాస్తవమని, నిబంధనల ప్రకారమే అగ్నిమాక శాఖలో కానీ, సీఐడీలో కాని టెండర్లు పిలిచారని, కార్యక్రమాలు చేపట్టారని, ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌ యాప్‌ పనితీరుకు టెక్నాలజీ సభ అవార్డు కూడా వచ్చిందని, సంజయ్‌ ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, అందువల్ల ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సీఐడీ తరపున వాదనలు వినిపించిన న్యాయవాదులు.. ఈ మొత్తం వ్యవహారంలో సంజయ్‌ లబ్ధి పొందారనే ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, దీంతో సంజయ్‌ను కస్టడీలోకి తీసుకొని విచారించాల్సిన అవసరం ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరు పక్షాల వాదనలు విన్నఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు సంజయ్‌కు బెయిల్‌ మంజూరు చేసింది. సంజయ్‌కు హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ మీద కూటమి ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్‌ చేసింది. దీనిపై మంగళవారం విచారణ చేపటిన సుప్రీం కోర్టు ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్‌కు కౌంటర్‌ దాఖలు చేయాలని సంజయ్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సంజయ్‌కు హైకోర్టు జారీ చేసిన బెయిల్‌ మీద సుప్రీం కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
Tags:    

Similar News