Religious harmony|మానవత్వమే..మా అభి'మతం' అంటున్న హెల్పింగ్ మైండ్స్
అయ్యప్ప మాలధారణ భక్తులకు ముస్లింలు అన్నప్రసాదాలు వడ్డించారు. పూజకు హాజరైన హెల్పింగ్ మైండ్స్ సభ్యులు ఈ కార్యక్రమం నిర్వహించి ఆదర్శంగా నిలిచారు.
By : SSV Bhaskar Rao
Update: 2024-11-17 13:45 GMT
ఏ మతమైనా మానవత్వాన్నే ప్రబోదిస్తుంది. దానిని మేము ఆచరిస్తున్నాం. అని హెల్పింగ్ మైండ్స్ సభ్యులు చెబుతున్నారు. మంచితనం, మానవత్వమే కర్తవ్యంగా భావించాలని ఆ సంస్థ ప్రతినిధులు చెప్పడమే కాదు. ఆచరణలో చూపిస్తున్నారు. అయ్యప్పమాల ధరించిన భక్తులకు ముస్లింలు భిక్ష (అన్నప్రసాదాలు) వడ్డించడం ద్వారా మతసామరస్యానికి అర్థం చెప్పారు.
చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఆదివారం అయ్యప్ప భక్తుల కోసం నిర్వహించిన ఆ కార్యక్రమం ద్వారా హెల్పింగ్ మైండ్స్ సంస్థ వ్యవస్థాపకుడు అబూబకర్ సిద్ధిక్ అందరి ప్రశంసలు అందుకున్నారు.
ఏటా కార్తీకమాసంలో అయ్యప్పస్వాములకు హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో గడచిన పదేళ్లుగా అయ్యప్పస్వామి భక్తులకు భిక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అబూబకర్ సిద్ధిక్ తెలిపారు. "హెల్పింగ్ మైండ్స్" ద్వారా స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్నాం" అని అబూబకర్ సిద్ధిక్ ' ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధికి చెప్పారు. తమ సంస్థలో ముస్లిం యువకులతో పాటు హిందువులు, క్రిస్టియన్లు కూడా ప్రజలకు సేవలు అందిస్తున్నారని తెలిపారు. అయ్యప్పమాల ధారణ భక్తులకు పూజల అనంతరం అన్నం, పప్పు సాంబారు, తీపి పదార్థం, అరటిపండు వడ్డించారు. సంస్థ సభ్యులతో పాటు చిన్నతనం నుంచే సేవాభావం పెంపొందించడానికి తమ పిల్లలను కూడా ఈ కార్యక్రమంలో మమేకం చేశారు.
మదనపల్లె పట్టణంలోని ఆదివారం జ్ఞానోదయా హైస్కూల్లో అయ్యప్పస్వామి భక్తులకు 'భిక్ష' కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొదట అయ్యప్పమాల ధారణ భక్తులు స్వామి చిత్రపటానికి పూజలు నిర్వహించారు. హారతి సమర్పించిన ఈ కార్యక్రమంలో మతాలకు అతీతంగా "హెల్పింగ్ మైండ్స్" సభ్యులు పాల్గొన్నారు. అనంతరం అయ్యప్పస్వామి భక్తులకు తమ బృందంలోని సభ్యులు అన్నదాన వితరణ చేశారని అబూబకర్ సిద్ధిక్ వివరించారు.
హెల్పింగ్ మైండ్స్ సభ్యులు సమాజహితం కోసం చేస్తున్న సేవలను అయ్యప్పస్వామి భక్తులు కొనియాడారు.
హెల్పింగ్ మైండ్స్ సభ్యులు కిరణ్, ఆబిద్, మొఖద్దర్, ముఫీ, హనీఫ్, సమీర్, పవన్, సాయి దీపక్, రాహుల్, బావాజాన్, తదితరులతో కలిసి కార్యక్రమం నిర్వహించిన సంస్థ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడారు. ఏటా సోదరభావంతో, మత సామరస్యాన్ని పెంపొందించాలనే లక్ష్యంతోనే అయ్యప్ప స్వామి భక్తులకు భిక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తమ సంస్థ సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమంతో పాటు సమాజహితం కోసం మంచి పనులు చేస్తున్నామనే సంతృప్తి మిగులుతోందని అన్నారు.
ఏమిటీ సంస్థ సేవలు
ప్రార్ధంచే పెదవుల కంటే సాయం చేస చేతులు మిన్న అనేది "హెల్పింగ్ మైండ్స్" సంస్థ వ్యవస్థాపకుడు అబూబకర్ సిద్ధిక్ చెప్పే మాట. మదనపల్లె పట్టణంలో నాలుగేళ్ల కిందట ఈ సంస్థను ప్రారంభించిన సిద్ధిక్ గొప్ప ఆస్థిపరుడు కాదు. సామాన్య ముస్లిం కుటుంబానికి చెందిన సగటు మనిషి. పేదల ఆకలి తీర్చడానికి తనకు తోచిన సహకారం అందిస్తున్నాడు. స్వతహాగా మధ్య తరగతి కుటుంబం. పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి. ఐదుపూటల నమాజ్ ఎందుకు చేస్తారనేది తెలుసు. దీనివల్ల పేదల ఆకలి బాధ తెలిసిన వ్యక్తి. "కష్టాల్లో ఉన్న వారికి సేవ చేయడంలో ఉన్న గొప్ప ఏముంటుంది" అని అంటారు సిద్ధిక్. "సాయం చేయడానికి స్థితిమంతులు కావాల్సిన అవసరం లేదు. ఆలోచన ఉంటే చాలు, మనిషికి తోడు ఉన్నామనే భరోసా ఇస్తే చాలు" అదే ఆపదలో ఉన్న వారికి కొండంత ఆసరా దొరికినట్లు ధైర్యంగా ఉంటారనే ఆలోచన రావడంతోనే పేదల ఆకలి తీర్చడానికి సంస్థను ఏర్పాటు చేసి, తన స్నేహితులు బంధువులను మమేకం చేశానని సిద్ధిక్ చెప్పారు. 2021లో పుల్వామాలో మానవబాంబు ధాటికి బలైన భారత జవాన్ల స్మారకార్థం ఆ సంస్థ ఆధ్వర్యంలో ఫుడ్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేసిన సిద్ధిక్... శుభకార్యక్రమాల్లో మిగిలిపోయిన ఆహారపదార్థాలను సేకరించి, ఫుడ్ బ్యాంక్ కు చేర్చడం ద్వారా పేదల ఆకలి తీరుస్తున్నారు. అంతేకాదు...
ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి రక్తదానం చేయడం, ఆకలితో ఉన్న వారి కోసం మదనపల్లి, గుర్రంకొండ ప్రాంతాల్లో ఫుడ్ బ్యాంక్ సేవలు, పాఠశాల, కాలేజీ విద్యార్థినులకు శానిటరీ ప్యాడ్ బ్యాంక్ సేవలు, క్యాన్సర్ బాధితులకు హెయిర్ డోనేషన్, ఆఖరి చూపు కోసం ఉచిత బాడీ ఫ్రీజర్ బాక్స్ అందుబాటులో ఉంచడం ద్వారా మానవతావాదిగా, సభ్యులను కూడా ఆ కోవలో నిలిపారు. పదేళ్లుగా హిందు, ముస్లిం, క్రిస్టియన్ సోదరుల మత సామరస్యం తో సోదరభావాన్ని పెంపొందిస్తూ పవిత్ర అయ్యప్ప స్వామి మాల ధరించిన అయ్యప్పస్వామి భక్తులకు భిక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నారు.