మీ పంట నీట మునిగిందా..అయితే ఇలా చేయండి
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు వరి, పత్తి, వేరుశనగ, సజ్జ పంటల పలు జిల్లాల్లో నీట మునిగాయి.
రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు వరి, పత్తి, వేరుశనగ, సజ్జ పంటలకు తీవ్ర దెబ్బ తీసాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతులకు తక్షణ చర్యలు చేపట్టాలని సాంకేతిక సూచనలు జారీ చేసింది. ఈ చర్యలు పాటిస్తే వర్షాలు, ముంపు నుంచి పంటలను పునరుద్ధరించి, నష్టాన్ని తగ్గించేందుకు సహాయపడతాయని అధికారులు తెలిపారు.
వరి పంట..సూచనలు
రాష్ట్రంలో వరి 15.58 లక్షల హెక్టార్లలో సాగులో ఉంది. ప్రస్తుతం పూత దశ, పాలపోసుకునే దశ, గింజ గట్టిపడే దశ, కోత దశల్లో ఉంది. ఆలస్యంగా నాటిన వరిలో పిలకలు తొడిగే దశ, పొట్ట దశలో ఉంది. బాపట్ల, పల్నాడు, నంద్యాల జిల్లాల్లో పంట పిలకలు తొడిగే దశ నుండి పొట్ట దశలో ఉంది. కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతాల్లో పూత, పాలపోసుకునే దశ నుండి కోత దశలో ఉంది.
పూత దశ, గింజ దశల్లో వర్షాలు పడటంతో పూత సరిగా రాకపోవడం, గింజ రంగు మారటం, కాటుక తెగులు వచ్చే అవకాశం ఎక్కువ. అధిక వర్షాలు వల్ల గింజల నిద్రావస్థ తొలగిపోయి, మొలకలు రావచ్చు. ముఖ్యంగా బి.పి.టి 5204, పి.ఎల్ 1100 రకాల్లో ఈ సమస్య ఎక్కువ. బాక్టీరియల్ ఆకు మచ్చ తెగులు, పొడ తెగులు వ్యాధులు విస్తరించే అవకాశం ఉంది.
- పాల దశలో వాలిపోయిన పంట: పొలాల్లో ఉన్న నీటిని వెంటనే బయటకు పంపాలి. చిన్న కమతాల్లో పంటను నిలబెట్టవచ్చు. పెద్ద కమతాల్లో డ్రైనేజీ మురుగు నీరు పోయే సదుపాయం చేయాలి.
- గింజ రంగు మారడాన్ని నివారించడానికి, పాము పొడ, కాటుక తెగులు వ్యాప్తిని అరికట్టడానికి: ఒక ఎకరానికి 200 ఎంఎల్ ప్రాపికోనజోల్ పిచికారి చేయాలి.
- ధాన్యం గట్టిపడే నుండి కోత దశలో ఉన్న పంట: పొలాల్లోని నీటిని లోపలి కాలువల ద్వారా తొలగించాలి. కంకుల గింజలపై మొలకలు కనిపిస్తే, 5% ఉప్పు ద్రావణం (50 గ్రాముల కల్లు ఉప్పు / లీటరు నీరు) పిచికారి చేయాలి. ఇది గింజల మొలకెత్తడాన్ని, గింజ రంగు మారడాన్ని నివారిస్తుంది.
- ఆలస్యంగా నాటిన పంట (పిలకలు తొడిగే దశ): వర్షపు నీరు పొలాల్లో సాధారణ రకాల్లో 7 రోజుల్లో తగ్గితే, యూరియా 20 కేజీ + పొటాష్ 20 కేజీ / ఎకరాకు బూస్టర్ డోసుగా వేయాలి. ఇది పంట పెరుగుదలకు దోహదపడుతుంది.
- దక్షిణ కోస్తా మండలాలు (నెల్లూరు, చిత్తూరు, తిరుపతి) జిల్లాల్లో – నారు మడులలో యాజమాన్యం: నర్సరీలు నీటమునిగి, నీరు 5 రోజుల్లో తగ్గినప్పుడు, ప్రతి 5 సెంట్ల నారు మడికి యూరియా 1 కేజీ + పొటాష్ 1 కేజీ కలిపి బూస్టర్ డోసుగా వేయాలి. నారు మడులు కుళ్ళిపోకుండా ఉండేందుకు: కార్బెండాజిం @ 1 గ్రామ్/లీటరు లేదా కార్బెండాజిం + మాంకోజెబ్ @ 2 గ్రామ్/లీటరు నీటిలో కలిపి స్ప్రే చేయాలి.
ముఖ్య సూచనలు
అన్ని పొలాల్లో నీరు త్వరగా బయటకు పోయేలా చూడాలి. పూత, గింజ గట్టిపడే దశల్లో నీటి నిల్వను నివారించాలి. సమయానికి శిలీంద్ర నాశినాలను స్ప్రే చేయడం ద్వారా గింజ నాణ్యతను కాపాడుకోవచ్చు. సమతుల్య ఎరువులు, మురుగునీటి నిర్వహణ ద్వారా నీటమునిగిన లేదా వాలిపోయిన పంటను పునరుద్ధరించవచ్చు.
పత్తి, వేరుశనగ పంటలకు చర్యలు
ఈ వర్షాలకు ఆకు మచ్చ తెగులు నివారణకు హెక్సా కొనజోల్ 2 మి.లీ లేదా కార్బన్ డిజిమ్ 1 గ్రామ్ /లీటరు నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి. పత్తిలో పూత మరియు గూడరాలు అవకాశం ఉంది కాబట్టి, నివారణకు బోరాక్స్‌ను లీటరు నీటికి 1.5 గ్రాములు కలిపి వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి. 2 శాతం యూరియా లేదా నీటిలో కరిగే ఎరువులైన 19-19-19 లేదా 17-17-17 లేదా పొటాషియం నైట్రేట్‌ను పిచికారి చేయటం ద్వారా పెరుగుదల కనిపిస్తుంది. కాయ దశలో కాయ కుళ్ళు నివారణకు కాపర్ ఆక్సిక్లోరైడ్ 30 గ్రాములు మరియు 2 గ్రాముల ప్లాంటో మైసిన్ 10 లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
సజ్జ పంటకు చర్యలు
కోత దశలో గింజ మొలక రాకుండా కంకులపై గళ్ళ ఉప్పు 50 గ్రాములను ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
మెట్ట పంటలు.. చర్యలు
అన్ని మెట్ట పంటల్లో పొలం నుండి నీళ్లను బయటకు వెళ్లగట్టడం, బూస్టర్ డోస్‌గా 25 కేజీల యూరియా, 10 కేజీల పొటాష్‌ను మొక్కల మొదట్లో వేయాలి. ఆకు మచ్చ, పొడ తదితర శిలీంద్ర తెగులకు హెక్సకోనజోల్ 2 గ్రాములు /లీటరు నీటికి లేదా కార్బన్ డిజిమ్ 1 గ్రామ్ /లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. ఈ సూచనలు పాటించి అమలు చేస్తే పంటల నష్టాన్ని తగ్గించి, దిగుబడిని పునరుద్ధరించవచ్చని విశ్వవిద్యాలయ అధికారులు తెలిపారు. రైతులు స్థానిక వ్యవసాయ కార్యాలయాలకు సంప్రదించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలని సూచించారు. ఆ మేరకు వ్యవసాయ శాఖ అధికారులు శుక్రవారం పక్రటన విడుదల చేశారు.