భారీ వర్షాలు–మంత్రులు ఏమన్నారంటే

అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అదికారులను ఆదేశించారు.;

Update: 2025-08-18 05:42 GMT

అల్పపీడనం, వాయుగుండం ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్‌లు ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రజలకు, మత్స్యకారులకు కూడా సూచనలు చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్‌ సరఫరాకు ఎలాంటి అంతరాయాలు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆ శాఖ అధికారులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కరెంట్‌ సరఫరాకు సంబంధించి ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని, అధికారులు, ఇతర సిబ్బంది అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మంత్రి గొట్టి పాటి విద్యుత్‌ శాఖ అధికారులతో సోమవారం ఉదయం సమీక్ష నిర్వహించారు. విద్యుత్‌ ప్రమాదాలు జరక్కుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, వర్షాలు, ఈదురు గాలుల కారణంగా తెగిపడే లైన్లు, కూలిన స్తంభాలను తక్షణమే పునరుద్దరించేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడటంతో ఐదు రోజుల పాటు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ మత్స్యకారులకు సూచించారు. సముద్ర తీర ప్రాంతాల్లోని ప్రజలు, మత్స్యకారులు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ అధికారులను ఆయన ఆదేశించారు. వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ.. అవసరమైన చోట లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.
Tags:    

Similar News