మరో 48 గంటలు భారీ వర్షాలే.. వణుకుతున్న ఉత్తరాంధ్ర
మరో 48 గంటలు భారీ వర్షాలే.. వణుకుతున్న ఉత్తరాంధ్ర;
By : The Federal
Update: 2025-08-26 09:43 GMT
వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల వెంబడి అల్పపీడనం ఏర్పడింది. రాబోయే 48 గంటల్లో అది మరింత బలపడే అవకాశం ఉంది. పశ్చిమ వాయువ్య దిశగా కదిలుతోందని ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు.
తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షాలు
మరోవైపు.. తెలంగాణ (Telangana) రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నిన్న వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసరాల్లో ఒడిశా వెస్ట్ బెంగాల్ తీరాలకు సమీపంలో ఉపరితల ఆవర్తనం కొనసాగిందని.. దీని ప్రభావంతో మంగళవారం ఉదయం అదే ప్రాంతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
వణుకుతున్న ఉత్తరాంధ్ర..
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం సాయంత్రం నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నరసన్నపేట సమీపంలోని జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న సర్వీస్ రోడ్లు నీటిలో మునిగాయి. నరసన్నపేట, జలుమూరు మండలాల మధ్య గొట్టిపల్లి రహదారిపై భారీగా వర్షపు నీరు చేరింది. ఎచ్చెర్ల ఆమదాలవలస, పాతపట్నం నియోజకవర్గాల్లో వర్షం కురుస్తోంది. చాలా చోట్ల పంటపొలాలు నీటి మునిగాయి.
కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. వాతావరణ మార్పులతో ఉప్పాడ సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. తీరంలో కెరటాలు ఎగసి పడుతున్నాయి. ఉప్పాడ నుంచి కాకినాడ గ్రామీణ వాకలపూడి వరకు రహదారి కోతకు గురై ప్రమాదకరంగా మారింది. రక్షణగా రోడ్డుపై వేసిన రాళ్లు కెరటాల తాకిడికి కొట్టుకుపోతున్నాయి. భారీ గుంతలు ఏర్పడడం వల్ల వాహనాదారులు ఇబ్బందులు పడుతున్నారు.
మంత్రుల సమీక్ష...
ఉత్తరాంధ్రలో పలు చోట్ల ఇప్పటికే వర్షాలు కురుస్తుండటంతో హోం మంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో దిశా నిర్దేశం చేశారు. సహాయక చర్యలు చేపట్టేందుకు ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది సిద్ధంగా ఉండాలన్నారు. ప్రమాదకర హోర్డింగ్‌లు, కూలిన చెట్లను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు.
మరోవైపు ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలపై మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను అప్రమత్తం చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడం కారణంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ మహేశ్వర్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనందున సముద్రంలో వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు సూచించారు. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకైనా అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.