మావోయిస్టులకు ప్రజల నుండి సహాయనిరాకరణ మొదలైందా ?
కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు కలిసి ‘ఆపరేషన్ కగార్’ పేరుతో మావోయిస్టుల ఏరివేతకు కంకణం కట్టుకున్నాయి;
అడకత్తెరలో పోకచెక్కంటారు కదా అలాగ తయారవుతున్నట్లుంది మావోయిస్టుల వ్యవహారం. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు కలిసి ‘ఆపరేషన్ కగార్’ పేరుతో మావోయిస్టుల ఏరివేతకు కంకణం కట్టుకున్నాయి. కొద్దినెలలుగా కేంద్రబలగాలు, గ్రేహౌండ్స్, సీఆర్పీఎప్, యాంటీనక్సల్ స్వ్కాడ్, పోలీసుల్లాంటి అనేక బలగాలు మావోయిస్టుల ఏరివేతేలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఛత్తీస్ గడ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఏవోబీ ప్రాంతాల్లో మావోయిస్టుల కోసం అంగుళం అంగుళం జల్లెడపడుతున్నాయి. ఫలితంగా భద్రతాదళాల నుండి తప్పించుకుని పోలేక, సురక్షితంగా దాక్కునే అవకాశాలులేక మావోయిస్టులు అల్లాడిపోతున్నారు. అందుకనే తప్పనిపరిస్ధితుల్లో వేరేదారిలేక మావోయిస్టులు పదేపదే శాంతిచర్చలంటు కేంద్రప్రభుత్వాన్ని బతిమలాడుకుంటున్నారు.
ఎదురుకాల్పులు లేకపోతే ఏరివేతతో గడచిన నాలుగునెలల్లో సుమారు 300 మంది మావోయిస్టు(Maoists)లు చనిపోయారు. గాయాలతో ప్రాణాలు దక్కించుకున్న మావోయిస్టులు పదులసంఖ్యలో తప్పించుకుని పారిపోగా సుమారు 200 మంది పోలీసుల ముందు లొంగిపోయారు. ఆపరేషన్ కగార్(Operation Kagar) ను పక్కనపెట్టేస్తే అటవీగ్రామాల్లో మావోయిస్టులకు వెన్నుదన్నుగా ఉంటున్న ఆదివాసీ(Tribals)ల్లో కూడా మావోయిస్టులంటే వ్యతిరేకత పెరిగిపోతోంది. సిర్పూర్ జిల్లాలోని కౌతాల్ గ్రామంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. ఆ పోస్టర్లలో ఆదివాసీలు మావోయిస్టులను ప్రశ్నలతో నిలదీశారు. తమమీద ఆధారపడి బతుకుతున్న మావోయిస్టులు తమనే అడవుల్లోకి ప్రవేశించవద్దని వార్నింగ్ ఇవ్వటాన్ని ఆదివాసీ యువజన సంఘం పేరుతో గిరిజనులు తీవ్రంగా ఆక్షేపించారు.
కర్రెగుట్టలమీదకు ఆదివాసీలను రావద్దనటానికి మీరెవరు అంటూ మండిపడ్డారు. కర్రెగుట్టల మీద మందుపాతరలు పేర్చటంలో మీఉద్దేశ్యం ఏమిటంటు నిలదీశారు. ఆదివాసీల మీద మావోయిస్టులు అప్రకటిత యుద్ధం చేస్తన్నారా అంటు తీవ్రంగా ప్రశ్నించారు. ఆదివాసీల జీవనాధారమైన అడవుల్లోకి రావద్దని చెప్పటానికి ఏమి అధికారం ఉందని మావోయిస్టులపై ఆదివాసీ యువజన సంఘం తిరగబడింది. కౌతాల్ గ్రామంలో పోస్టర్లు వేశారంటే మిగిలిన గ్రామాల్లో కూడా మావోయిస్టులపై గిరిజనుల్లో ఇదేవిధమైన ఆగ్రహం పేరుకుపోయిందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఒకవైపు భద్రతాదళాల దెబ్బను తట్టుకోలేకపోతున్న మావోయిస్టులకు గోరుచుట్టుమీద రోకటిపోటులాగ ఆదివాసి యువజన సంఘం వేసిన పోస్టర్లతో సెగ పెరిగిపోతోంది. అడవుల్లో నివాసముండే గిరిజనుల నుండి సహాయనిరాకరణ పెరిగిపోతే మావోయిస్టుల పని ఒడ్డునపడ్డ చేపల్లాగ తయారవ్వటం ఖాయం. తాజాపరిణామాలను గమనిస్తుంటే మావోయిస్టులకు ప్రజల నుండి కూడా సహాయనిరాకరణ పెరిగిపోతున్నట్లే ఉంది.