Revanth Zindabad|బీఆర్ఎస్, బీజేపీ ప్లాన్ వర్కవుట్ కాలేదా ?
గురువారం ఉదయం రేవంత్ తో సినీఇండస్ట్రీలోని ప్రముఖల సమావేశంలో ఈ విషయం స్పష్టమైంది.
జరిగింది చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. గురువారం ఉదయం రేవంత్ తో సినీఇండస్ట్రీలోని ప్రముఖల సమావేశంలో ఈ విషయం స్పష్టమైంది. పుష్ప సినిమా(Pushpa Movie) రిలీజ్ సందర్భంగా సంధ్యా ధియేటర్లో(Sandhya Theatre) జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించగా ఆమె కొడుకు శ్రీతేజ్ ఆసుపత్రి పాలయ్యాడు. గడచిన 20 రోజులుగా కోమాలో ఉన్న తేజ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఘటనకు కారకుడన్న ఆరోపణలపై పోలీసులు హీరో అల్లుఅర్జున్(Allu Arjun) పై కేసు పెట్టడమే కాకుండా అరెస్టు చేశారు. ఎప్పుడైతే పోలీసులు అల్లుఅర్జున్ పై కేసునమోదు చేశారో అప్పటినుండి బీఆర్ఎస్, బీజేపీలు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని టార్గెట్ చేయటం మొదలుపెట్టాయి. నేషనల్ అవార్డ్ గ్రహీత అల్లుఅర్జున్ పై పోలీసులు కేసు పెడతారా ? అంటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR), మాజీమంత్రి హరీష్ రావు(Harish Rao), కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తో పాటు ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందనరావు తదితరులు నానా గోలచేస్తున్నారు.
భేషరతుగా అల్లుఅర్జున్ కు బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఫుల్లుసపోర్టు ప్రకటించాయి. పుష్పమీద కేసును అడ్డంగా పెట్టుకుని రేవంత్ మీద వ్యక్తిగతంగా పై పార్టీలు ఎంత బురదచల్లాలో అంతా చల్లేశాయి. పార్టీల మద్దతుదారులు రేవంత్ పైన సోషల్ మీడియాలో చాలా నీచమైన కామెంట్లు, వీడియోలు కూడా పెట్టారు. ప్రభుత్వం ఒకవైపు అల్లుఅర్జున్, సినీఇండస్ట్రీ, బీఆర్ఎస్, బీజేపీలు మరోవైపు అన్నట్లుగా వాతావరణం తయారైంది. అందరు ఏకమైన తర్వాత ఇంకేముంది రేవంత్ కు చుక్కలు కనబడటం ఖాయమన్నట్లుగా ప్రకటనలు ఇచ్చుకున్నారు.
తీరాచూస్తే బీఆర్ఎస్, బీజేపీల వ్యూహాలన్నీ తుస్సుమన్నట్లుగా అయిపోయాయి. గురువారం రేవంత్ తో భేటీ అయిన సినీఇండస్ట్రీ(Telugu Cine Industry) ప్రముఖులు దాదాపు సాగిలపడ్డారనే చెప్పాలి. తాను ముఖ్యమంత్రిగా ఉన్నంతవరకు బెనిపిట్ షోలు, టికెట్ల ధరల పెంపు ఉండదన్న రేవంత్ ప్రకటనతో మొత్తం సినీఇండస్ట్రీ పెద్దలకే చుక్కలు కనిపించాయి. వందల కోట్ల రూపాయలతో సినిమాలు తీయటం దాన్ని తిరిగి రాబట్టుకోవటానికి తామిష్టం వచ్చినట్లు టికెట్ల రేట్లు పెంచుకోవటం, బెనిఫిట్ షో, ప్రీమియర్ షోలు వేసుకోవటం నిర్మాతలకు అలవాటుగా మారిపోయింది. ధియేటర్లో తొక్కిసలాటను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం ఇకనుండి బెనిఫిట్, ప్రీమియర్ షోలు ఉండకూడాదని, టికెట్ల రేట్ల పెంపు ఉండదని నిర్ణయించటంతో నిర్మాతలు, హీరోల నెత్తిన పెద్ద బండిపడినట్లే.
దాంతో ఏమిచేయాలో దిక్కుతోచక అందరు కలిసి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎఫ్డీసీ) ఛైర్మన్, నిర్మాత, ఎగ్జిబిటర్ దిల్ రాజు(FDC Chairman Dil Raju)ను పట్టుకున్నారు. దిల్ రాజు ఎలాగూ సినిమా వాడే అవటంతో పాటు రేవంత్ కు కూడా బాగా సన్నిహితుడు. ఈ కారణంగానే దిల్ రాజు ద్వారా ఈరోజు రేవంత్ తో భేటీ అయ్యారు. సమావేశంలో సినీపెద్దలు రేవంత్ కు ఒంగి ఒంగి దణ్ణాలు పెట్టడం, శాలువాలు కప్పటం, రిక్వెస్టులు చేయటం చూసిన తర్వాత అందరికీ ప్రభుత్వం పవర్ ఏమిటో తెలిసొచ్చింది. ఇదేసమయంలో రేవంత్ కు సినీఇండస్ట్రీకి మధ్య గ్యాప్ పెంచేసి పబ్బంగడుపుకుందామని ప్రయత్నించిన బీఆర్ఎస్, బీజేపీలకు షాక్ కొట్టినట్లయ్యింది. సమావేశంలో బెనిఫిట్, ప్రీమియర్ షోలకు అనుమతులు ఇచ్చేదిలేదని, టికెట్ల రేట్ల పెంపు కూడా ఉండదని రేవంత్ సినీ ప్రముఖులకు స్పష్టంగా చెప్పేశాడు. ఈ రెండు పాయింట్లు మినహా మిగిలిన చర్చలంతా ఉత్త కాలక్షేపానికి పనికొచ్చేవి మాత్రమే. సమావేశం అయిన తర్వాత సినీ ప్రముఖులు మీడియాతో మాట్లాడుతు రేవంత్ జిందాబాద్ అన్నట్లుగా పోటీలుపడి ప్రస్తుతించటమే కొసమెరుపు.