రెరా కూడా తడాకా చూపిస్తోందా ?

అక్రమనిర్మాణాలపై ఒకవైపు హైడ్రా ఉక్కుపాదం మోపుతుంటే తాజాగా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటి (రెరా) కూడా కొరడా ఝుళిపిస్తోంది.

Update: 2024-09-12 09:11 GMT

అక్రమనిర్మాణాలపై ఒకవైపు హైడ్రా ఉక్కుపాదం మోపుతుంటే తాజాగా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటి (రెరా) కూడా కొరడా ఝుళిపిస్తోంది. నిజానికి రియల్ ఎస్టేట్ వెంచర్ల పేరుతో నిర్మిస్తున్న అపార్టమెంట్లు, విల్లాలు, గ్రూప్ హౌసింగ్ లాంటి వాటికి రెరా అనుమతులు తప్పనిసరి. కొనుగోలుదారుల సంక్షేమం కోసం కేంద్రప్రభుత్వం చేసిన చట్టం ద్వారా ఏర్పడిందే రెరా. బిల్డర్లు, రియల్టర్ల నుండి కొనుగోలుదారులు అపార్టమెంట్లు తదితరాలు కొన్నతర్వాత తలత్తే వివాదాలను పరిష్కరించటంలో రెరా కీలకపాత్ర పోషిస్తుంది. వెంచర్లు మొదలుపెట్టడానికి ముందే రెరా అనుమతులు తప్పనిసరిగా రెరా చట్టం చెబుతోంది. రెరా అనుమతులున్న వెంచర్లలో కొనుగోలు చేసిన ఫ్లాట్లు, విల్లాలు, గ్రూప్ హౌసింగ్ తదితరాల్లో ఏదైనా వివాదాలు తలెత్తితో మాత్రమే రెరా జోక్యం చేసుకుంటుంది. అందుకనే కొనుగోలుదారులు ఏదైనా ప్రాపర్టీని కొనేముందు రెరా అనుమతులు గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలని అప్పుడప్పుడు రెరా ప్రకటిస్తుంటుంది.

అయితే చాలామంది బిల్డర్లు రెరా అనుమతులు తీసుకోకుండానే వెంచర్లు వేసి అమ్మేస్తున్నారు. కొనుగోలుదారులు కూడా తెలిసో తెలీకో ప్రాపర్టీలను కొనేస్తున్నారు. తమనుండి అనుమతులు తీసుకోకుండానే వెంచర్లు వేస్తున్న బిల్డర్ల విషయంలో రెరా కూడా ఏమీ చేయలేక చూసీ చూడనట్లు వదిలేస్తోంది. అనుమతులు తీసుకుని వేసిన వెంచర్ల విషయంలో కూడా వివాదాలు తలెత్తిన ప్రాపర్టీల విషయంలో ఎంతమందికి కొనుగోలుదారులకు రెరా న్యాయం చేసిందనే విషయమై ఎవరికీ అవగాహనలేదు. ఇలాంటి నేపధ్యంలోనే సడెన్ గా హైడ్రా ఏర్పాటైంది.

ఏర్పాటవ్వటమే చెరువులు, కుంటలు, కాల్వల్లో నిర్మించిన అక్రమనిర్మాణాలను హైడ్రా కూల్చేస్తోంది. దాంతో హైడ్రా యాక్షన్ తెలంగాణా వ్యాప్తంగా సంచలనమైపోయింది. ఇన్ని సంవత్సరాల నుండి రెరా అనే చట్టం ఉన్నా దానిగురించి తెలిసింది చాలా తక్కువమందికే. ఇలాంటి నేపధ్యంలో రెరా కూడా అక్రమార్కులపై కొరడా ఝుళిపించాలని డిసైడ్ అయినట్లుంది. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లిలో సాహితీ వెంచర్స్ ఇన్ ఫ్రాటెక్ నిర్మిస్తున్న సాహితీ శిష్టా ఎడోబ్ ప్రాజెక్టుపై వస్తున్న ఆరోపణలపై విచారణ జరిపింది. రెరా చట్టంలోని సెక్షన్ 80 ప్రకారం సదరు సంస్ధను ప్రాసిక్యూట్ చేయాలని ఆదేశించింది. నిర్ణీత సమయంలోగా కొనుగోలుదారులకు ఫ్లాట్లు నిర్మించి ఇవ్వకపోవటం, ఒకే ఫ్లాటును ఇద్దరికి అమ్ముతు అగ్రిమెంట్లు చేయటం లాంటి ఆరోపణలను సాహితీ శిష్టా ఎదుర్కుంటోంది. వీటిపై విచారణ జరిపిన రెరా ఆరోపణలు నిజమే అని నిర్ధారించింది. అందుకనే వెంటనే యాజమాన్యాన్ని మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు సంస్ధ యాజమాన్యాన్ని హాజరుపరచాలని రెరా చైర్మన్ సత్యనారాయణ, బోర్డు సభ్యులు లక్ష్మీనారాయణ, శ్రీనివాసరావు ఆదేశించారు.

ప్రీలాంచ్ ఆఫర్ల పేరుతో సాహితీశిష్టా 2019, జూన్ నుండి 3 వేలమంది నుండి రు. 1290 కోట్లు వసూలుచేసినట్లు రెరా బోర్డు గుర్తించింది. సాహితీశిష్టా మీదే కాకుండా గ్రూప్ పేరుతో ఉన్న సాహితీ శర్వాణి ఎలైట్, సాహితీ కార్తికేయ, సాహితీ సితార కమర్షియల్ ప్రాజెక్టులపైన కూడా యాక్షన్ తీసుకోవాలని రెరా డిసైడ్ చేసింది. అలాగే జయభేరి యాజమాన్యంకు కూడా ఫైన్ వేసింది. మెజారిటి కొనుగోలుదారులకు సమాచారం ఇవ్వకుండా క్లబ్ హౌజ్ నిర్మించిన జయభేరి యాజమాన్యానికి రెరా బోర్డు రు. 2.75 లక్షలు ఫైన్ వేసింది. బేగంపేటలోని ఒక వెంచర్లో కొనుగోలుదారుడిని మోసం చేసిందని నిర్ధారణ అయిన రిలయన్స్ వెవలపర్స్ కు రెరా రు. 20 లక్షలు ఫైన్ వేసింది. ఇదే సమయంలో కొనుగోలుదారుడు చెల్లించిన రు. 1.20 కోట్లను వడ్డీతో సహా తిరిగి చెల్లించేయాలని కూడా ఆదేశించింది. అనంతరం రెరా బోర్డు ఛైర్మన్ సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతు కొనుగోలుదారుల ప్రయోజనాలను కాపాడటం కోసం ఏర్పాటైందే రెరా అన్నారు. కొనుగోలుదారులు చేసే ఫిర్యాదులపై రెరా ఎప్పటికప్పుడు స్పందించి విచారణ జరుపుతుందని ఛైర్మన్ చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణాలపై రెరా కఠినంగా వ్యవహరిస్తుందని ఛైర్మన్ హెచ్చరించారు.

Tags:    

Similar News