రాజకీయాలు ఖరీదైపోయాయా

యనమల రామకృష్ణుడు టీడీపీలో సీనియర్‌ నాయకుడు. అటు ప్రభుత్వంలో కానీ, ఇటు పార్టీలో కానీ ఆయన లేని కమిటీ లేదు. అయితే ఇప్పుడెందుకిలా మాట్లాడారు?;

Update: 2025-03-14 06:47 GMT

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు బాగా ఖరీదై పోయాయి. సామాన్యులు రాజకీయాలు చేసే పరిస్థితులు కనిపించడం లేదు. బాగా డబ్బున్న వాళ్లే రాజకీయాలు చేసే దుస్థితులు నెలకొన్నాయి. ప్రజల కోసం పని చేసే వారు, డబ్బు లేని వారు రాజకీయాలు చేసే వాతావరణం ఆంధ్రప్రదేశ్‌లో కనిపించడం లేదు. ఇలాంటి వాతావరణం ప్రజా స్వామ్యానికి మంచిది కాదు. ఇదే దోరణి కొనసాగితే ప్రజాస్వామ్యానికి ప్రమాదం వాటిల్లే పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. అంటూ తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుడు, టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలు అటు టీడీపీ శ్రేణుల్లోను, ఇటు రాజకీయ వర్గాల్లోను చర్చనీయాంశంగా మారాయి. అసెంబ్లీ లాబీలో గురువారం మీడియా ప్రతినిధులతో ముచ్చటిస్తూ తన మనసులోని మాటలు బయటకు వెల్లడించారు. యనమల లాంటి సీనియర్‌ ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటూ చర్చించుకుంటున్నారు. అంటే తెలుగుదేశం పార్టీతో పాటు కూటమి రాజకీయాలు కూడా ఖరీదై పోయాయనేగా యనమల అభిప్రాయం అంటూ కూటమి వర్గాలు చర్చించుకుంటున్నారు. ఒక వేళ్ల ఆయనకు మళ్లీ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి ఉంటే ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారా? అనే చర్చ కూడా సాగుతోంది.

ఈ నెలాఖరుతో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అందులో యనమల కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు మళ్లీ అవకాశం కల్పిస్తారని యనమలతో సహా ఆ పార్టీలోని సీరియన్‌ నేతలంతా భావించారు. అయితే యనమలకు ఆ అవకాశం చంద్రబాబు ఇవ్వలేదు. మూడు నెలల క్రితం ఖాళీ అయిన రాజ్య సభకు తనను పంపాలని చంద్రబాబును యనమల కోరారు. అక్కడ కూడా యనమలకు నిరాశే ఎదురైంది. దీంతో అటు రాజ్యసభ స్థానం, ఇటు ఎమ్మెల్సీ స్థానం రెండూ యనమలకు దక్కకుండా పోయాయి. దీంతో యనమల చంద్రబాబు పట్ల అసంతృప్తిగానే ఉన్నారు. అయితే దీనిని యనమల కవర్‌ చేస్తూ చంద్రబాబుతో తన సంబంధాలు సక్రమంగానే ఉన్నాయనే విధంగా స్పందించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత చంద్రబాబు తనతో ఫోన్‌లో మాట్లాడారని, ఎంపిక చేసిన వారి పేర్లు చెప్పారని, దానిని తాను స్వాగతించానని, తనకు రెండు సార్లు ఎమ్మెల్సీగా అవకాశం కల్పంచినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పానంటూ చెప్పొకొచ్చారు. అంటే తనకు, చంద్రబాబుకు మధ్య ఎలాంటి గ్యాప్‌ లేదని చెప్పే ప్రయత్నం చేశారనే టాక్‌ వినిపిస్తోంది.
ఇదే క్రమంలో తెలుగుదేశం పార్టీలో తన సీరియారిటీ గురించి కూడా ప్రస్తావించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తాను టీడీపీలోనే కొనసాగుతున్నానని, దశాబ్దాల పాటు పార్టీకి సేవలు అందించానని చెప్పొకొచ్చారు. అంటే ఇండైరెక్టుగా అంత పార్టీ ఆవిర్భావం నుంచి తాను ఉన్నా.. తనకు తగిన గౌరవం లేకుండా అటు రాజ్యసభ స్థానం, ఎమ్మెల్సీ అవకాశాలు లేకుండా పోయాయనే ఆవేదన కూడా కనిపిస్తుందనే చర్చ టీడీపీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో తన రాజకీయ భవిష్యత్‌ గురించి మాట్లాడిన యనమల రాజ్యసభకు అవకాశం ఇస్తే వెళ్తానని, లేకుండా విశ్రాంతి తీసుకుంటానని ముచ్చటించారు. అంటే రాజ్యసభ మీద తనకు ఉన్న మక్కువను వెల్లడిస్తూనే పార్టీలో ఎంతో సీనియారిటీ ఉన్న తనకు రాజ్యసభకు అవకాశం ఇవ్వాలని సంకేతాలు చంద్రబాబుకు ఇచ్చారనే టాక్‌ కూడా కూటమి వర్గాల్లో వినిపిస్తోంది.
మార్చి 29 నాటికి యనమల రామకృష్ణుడి ఎమ్మెల్సీ పదవీ కాలం ముగియనుంది. మరో వైపు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి తన కుటుంబ సభ్యులు చాలా మందికి అవకాశాలు దక్కించుకున్నారు. తన కూతురు యనమల దివ్య తుని నుంచి ఎమ్మెల్యేగా ఉండగా, అల్లుడు పుట్టా మహేష్‌కుమార్‌ యాదవ్‌ ఏలూరు ఎంపీగాను, వీయంకుడు మైదుకూరు పుట్టా సుధాకర్‌ యాదవ్‌ ఎమ్మెల్యేగాను ఉన్నారు. చంద్రబాబు కుటుంబం తర్వాత అత్యధిక స్థానాలు సంపాదించుకున్న కుటుంబంగా యనమల కుటుంబం నిలిచింది.
యనమల తన సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో స్పీకర్‌గాను, ఆర్థిక మంత్రిగాను, మండలి ప్రతిపక్ష నేత, టీడీపీ పొలిట్‌ బ్యూరో, క్రమశిక్షణా సంఘం, మేనిఫెస్టో కమిటీలలో కీలక పాత్ర పోషించారు. అయితే తనకు ఈ సారి రాజ్య సభ స్థానం, ఎమ్మెల్సీగా మళీ అవకాశం దక్కదని ముందే ఊహించారో ఏమో కానీ తనను ఏదో రాష్ట్రానికి గవర్నర్‌గా పంపాలనే ప్రతిపాదనలను కూడా సీఎం చంద్రబాబు ముందు ఉంచారు. ఇదే సమయంలో మరో టీడీపీ సీనియర్‌ నాయకుడు పూసపాటి అశోక్‌గతజపతి రాజు పేరును ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్‌గా పంపాలనే ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకున్న చంద్రబాబు కేంద్రానికి ఆ మేరకు సిఫార్సు కూడా చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో యనమలకు గవర్నర్‌ గిరి కూడా దక్కే అవకాశం లేదనే టాక్‌ టీడీపీ శ్రేణుల్లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇస్తే రాజ్యసభకు అవకాశం ఇస్తే వెళ్తానని, లేదంటే విశ్రాంతి తీసుకుంటానని చెప్పినట్లు టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ క్రమంలో యనమలకు సంబంధించి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? యనమలను విశ్రాంతి తీసుకోమంటారా? అనేది అటు టీడీపీ వర్గాల్లోను, ఇటు రాజకీయ వర్గాల్లోను ఆసక్తికరంగా మారింది.
Tags:    

Similar News