రేవంత్ ప్రభుత్వానికి ముందే వార్నింగ్ ఇచ్చిన హరీష్
ప్రమాదస్ధలానికి వెళుతున్న హరీష్ అండ్ కో కు కూడా అక్కడ తాముచేయగలిగేది ఏమీలేదని బాగా తెలుసు;
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గరకు గురువారం తాము వెళుతున్నట్లు పార్టీలో కీలకనేత హరీష్ రావు(Harish Rao) ప్రకటించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) దగ్గరకు వెళ్ళే క్రమంలో తమను ఎవరూ అడ్డుకోవద్దని ముందుగానే హరీష్ వార్నింగ్ ఇవ్వటమే ఆశ్చర్యంగా ఉంది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదానికి రేవంత్ రెడ్డి(Revanth) కమీషన్ల కక్కుర్తే కారణమని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), మాజీమంత్రి హరీష్ పదేపదే ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. తమహయాంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు ఎలాంటి సమస్యలు లేకుండా, ఆటంకాలు లేకుండా జరిగిన విషయాన్ని హరీష్ గుర్తుచేశారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రమాదంజరిగిన టన్నెల్ ప్రాంతానికి బీఆర్ఎస్ నేతలు వెళ్ళాలని అనుకోవటంలో అర్ధమేలేదు. ఎందుకంటే హరీష్ నాయకత్వంలో పెద్ద బృందం ప్రమాదం జరిగిన ప్రాంతానికి గురువారం బయలుదేరుతోంది. ఇక్కడ కీలకమైన పాయింట్ ఏమిటంటే బీఆర్ఎస్(BRS) బృందం టన్నెల్ దగ్గరకు వెళ్ళిచేసేది ఏమీలేదని అందరికీ తెలుసు. ప్రమాదస్ధలానికి వెళుతున్న హరీష్ అండ్ కో కు కూడా అక్కడ తాముచేయగలిగేది ఏమీలేదని బాగా తెలుసు. తెలిసిన తర్వాత కూడా ఎందుకు వెళుతున్నట్లు ?
ఎందుకంటే ప్రమాదస్ధలంలో పెద్ద సీన్ క్రియేట్ చేయటానికే. టన్నెల్ దగ్గరకు వెళ్ళటం వల్ల అక్కడ జరుగుతున్న పనులకు కొంతసేపైనా ఆటంకాలు తప్పవు. టన్నెల్లోకి తాము వెళ్ళాలని ప్రయత్నం చేసినపుడు పోలీసులు తమను అడ్డుకోకూడదని హరీష్ ముందుగా హెచ్చరించటమే విచిత్రంగా ఉంది. ప్రమాదస్ధలం దగ్గరకు రాజకీయపార్టీలను, మామూలు పబ్లిక్కును ప్రభుత్వం అనుమతించటంలేదు. ఎందుకంటే పార్టీల నేతలు, పబ్లిక్ వెళ్ళి చూసేందుకు అక్కడేమీ లేదు. పైగా వీళ్ళు వెళ్ళి చేసేది కూడా ఏమీలేదు. రాజకీయపార్టీలు, పబ్లిక్ టన్నెల్ ప్రాంతానికి వెళ్ళటం వల్ల జరుగుతున్న పనులకు అడ్డం. అందుకనే ఇప్పటివరకు ఏ ప్రతిపక్ష పార్టీ నేత కూడా అక్కడకు వెళ్ళలేదు.
ఈవిషయాలన్నీ తెలిసి కూడా బీఆర్ఎస్ ప్రమాదస్ధలానికి వెళ్ళాలని అనుకున్నదంటే కచ్చితంగా హిడెన్ అజెండాతోనే అని అర్ధమవుతోంది. ఆ హిడెన్ అజెండా ఏమిటంటే తమను అక్కడ పోలీసులు అడ్డుకుంటే గొడవ చేయటమే. ఒకవేళ ఫ్రీగా టన్నెల్లోకి వెళ్ళగలిగినా చూడగలిగినంత చూసి బయటకు వచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఆరోపణలతో రెచ్చిపోవటమే టార్గెట్ గా బీఆర్ఎస్ పెట్టుకున్నట్లు అర్ధమవుతోంది. కాబట్టి గురువారం ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర పెద్ద సీనే జరగబోతోంది.