18, 19న ఎస్ఆర్ఎం వర్సిటీలో గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్
ఎస్ఆర్ఎంలో జరగబోయే జాతీయ స్థాయి హైడ్రోజన్ సమ్మిట్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరవుతున్నారు.;
మరావతిలో ఉన్న ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఈ నెలు 18, 19 తేదీల్లో జాతీయ స్థాయి గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్- 2025 నిర్వహించనున్నట్లు ఎస్ఆర్ఎం గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (రీసెర్చ్) ఆచార్య డి నారాయణరావు చెప్పారు. ఈ నదస్సును రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రారంభించనున్నారని వివరించారు. కేంద్రమంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, నీతి అయోగ్ మెంబర్ డాక్టర్ వీ కే సారస్వత తో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఈ సదస్సులో పాల్గొంటున్నారని తెలిపారు. మంగళవారం విజయవాడలోని హోటల్ రెయిన్ ట్రీ పార్కులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆచార్య నారాయణరావు సదస్సు వివరాలను వెల్లడించారు.
గడచిన 20 ఏళ్లలో దేశ వ్యాప్తంగా విద్యుత్ శక్తి అవసరాలు రెండింతలు పెరిగాయనీ, వికసిత్ భారత్ సాధనలో భాగంగా అన్నింటా అభివృద్ది సాధించాల్సి ఉందన్నారు. విద్యుత్ శక్తికి బదులు గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి అనివార్యమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు యూనివర్సిటీ లో గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ ను ఏర్పాటు చేశామన్నారు. విశాఖను గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా మార్చాలన్న సీఎం ఆకాంక్ష నెరవేర్చే లక్ష్యంతో హైడ్రోజన్ సదస్సును ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.
దేశ వ్యాప్తంగా ఉన్న నిపుణులు, పారిశ్రామికవేత్తలు, పరిశోధన రంగ నిపుణులు, పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నామని వివరించారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ సహకారంతో ఎస్ఆర్ఎం లో ఇన్నోవేషన్ సెంటర్ ను ప్రారంభించి హైడ్రోజన్ పవర్లో నడిచే కారును రూపొందించే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు.
సదస్సు నిర్వహణకు ఏపీ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా సంపూర్ణ సహకారం అందిస్తున్నామని కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎం కమలాకరబాబు పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీని ప్రవేశ పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఐదేళ్లలో 100 గిగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు వివరించారు. ఇందుకోసం 32 ప్రాజెక్టులపై ఎంవోయూ జరిపినట్లు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా కొర్పర్లకోట వద్ద 1,200 ఎకరాలు సేకరించి రెన్యువబుల్ మాన్యు ఫ్యాక్చరింగ్ జోన్ ఏర్పాటు చేసి 20 గిగావాట్ల రె న్యువబుల్ ఎనర్జీని ఉత్పత్తి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.
ఎస్ఆర్ఎం యానివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సతీష్ కుమార్ మాట్లాడుతూ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఎమెర్జింగ్ టెక్నాలజీతో పనిచేస్తుందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, నానో, క్వాంటమ్ లో నిష్ణాతులైన అధ్యాపకులున్న యూనివర్సిటీగా పేర్కొన్నారు. బోధన, పరిశోధనల్లో అగ్రగామిగా ఉన్న ఎస్ఆర్ఎం వర్సిటీ హైడ్రోజన్ సమ్మిట్ ఏర్పాటుకు ప్రభుత్వం సహకారం అందించడం సంతోషదాయకమన్నారు. ఈ నేపథ్యంతో గ్రీన్ హైడ్రోజన్ సదస్సు నిర్వహణకు ముందుకు రావడం జరిగిందన్నారు. ఈ సంధర్భంగా సమ్మిట్ బ్రోచర్ ను వేదికపై ఆవిష్కరించారు.