ఫైబర్ నెట్‌కు మహర్దశ
కొత్త విధానాలు అమలు చేసి..కనెక్షన్లు పెంచుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.;
By : The Federal
Update: 2025-07-14 14:26 GMT
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్టాత్మకంగా 2014–19 మధ్య తీసుకువచ్చిన ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టును తిరిగి గాడిలో పెట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సంస్థ ముందున్న సవాళ్లు, ఆర్థిక సమస్యలు, ఫైబర్ నెట్‌ను పూర్తి స్థాయిలో గాడిన పెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలు, కొత్త పాలసీ నిర్ణయాలపై సోమవారం సచివాలయంలో అధికారులతో సిఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రజలకు, విద్యార్థులకు, ప్రభుత్వ విభాగాలకు ఉపయోగపడే« విధంగా ఈ సంస్థను తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. 2019లో 8.70 లక్షల కనెన్షన్‌లు ఉండగా... వైసీపీ ప్రభుత్వంలో వాటి సంఖ్య 4.50 లక్షలకు పడిపోయాయని అన్నారు.
నాడు కేవలం 130 మంది ఉద్యోగులతో సంస్థను అద్భుతంగా నడిపామన్నారు. 8 లక్షలకు పైగా కనెక్షన్లు ఇచ్చామన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం తన పార్టీ కార్యకర్తలకు ఉద్యోగుల కోసం సంస్థలో లేని పోస్టులు సృష్టించి, 130 మంది ఉద్యోగులను 1,350కి పెంచి దోచుకుందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వ్యవస్థల్లో వందల, వేల మందిని నియమించి...పార్టీ కోసం పని చేయించుకునే కొత్త తరహా అవినీతికి గత ప్రభుత్వం పాల్పడిందని ఆరోపించారు. ఫైబర్ నెట్‌లో సొంత వాళ్లను నియమించి పార్టీ కోసం పని చేయించుకున్నారని మండిపడ్డారు. దీనికి కారణమైన వారిని గుర్తించాలని, నాటి నియామకాలపై విచారణ జరిపి...అన్ని వివరాలు వెలుగులోకి తీసుకురావాలని, ఇదే సమయంలో నాటి తప్పులను సరిదిద్ది భవిష్యత్‌ను తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులకు దిశా నిర్థేశం చేశారు. ప్రస్తుతం 4,53,525 వరకు ఉన్న కనెక్షన్లను...తిరిగి 8 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాలని సిఎం సూచించారు.
భారత్‌నెట్‌తో ఏపీ ఫైబర్ నెట్‌ను అనుసంధానించేందుకు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అనుమతించారు. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఏపీ ఫైబర్ నెట్‌కు 2025 నుండి 2035 వరకు రూ.1,900 కోట్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయనుంది. చిత్తూరు, విశాఖపట్నం జిల్లాల్లోని 1,692 గ్రామ పంచాయతీల ఫైబర్ నెట్‌వర్క్‌ను లీనియర్ నుంచి రింగ్ ఆర్కిటెక్చర్‌కు మార్చేందుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. 480 కొత్త గ్రామ పంచాయతీలకు రింగ్ ఆర్కిటెక్చర్‌తో కనెక్టివిటీ కల్పిస్తారు. ఇందుకోసం మొత్తం రూ.430 కోట్లు కేంద్రం ఇస్తుంది. ఈ కార్యక్రమాల నిర్వహణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ఒక ప్రత్యేక వాహక సంస్థను ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు.
2014–19లో రూ. 149కి ట్రిపుల్ ప్లే ద్వారా 150 ఛానెళ్ల తో సేవలు అందించగా, 2019–24లో నెల వారీ చార్జీలను రూ.350కి పెంచడంతో పాటు నాణ్యత లేని ప్రసారాలు అందించడం వల్ల కనెక్షన్లు తగ్గినట్టు అధికారులు సీఎంకు తెలిపారు. ఫైబర్ నెట్‌కు సెట్ టాప్ బాక్స్ సరఫరాదారుల ఎంపికను తక్షణమే పూర్తి చేయాలని, కొత్త బాక్స్‌లను తీసుకున్న స్థానిక కేబుల్ ఆపరేటర్ తో ఆదాయానికి సంబంధించిన విధానాన్ని పునః సమీక్షించాలని సూచించారు. దూర ప్రాంతాల్లో సెట్ టాప్ బాక్స్ సరఫరా కోసం ప్రైవేట్ సంస్థలను కూడా భాగస్వాములుగా తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు.
వర్చువల్ క్లాస్ రూమ్ వంటి సేవలను తిరిగి ప్రవేశపెట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల్లో ఫైబర్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయాలన్నారు. స్థానిక కేబుల్ ఆపరేటర్ల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలన్నారు. ఏపీ ఫైబర్ నెట్, భారత్ నెట్ నెట్‌వర్క్ నిర్వహణ కోసం కాంట్రాక్టర్‌ను నియమించాలని నిర్దేశించారు. ఏపీ ఫైబర్ నెట్ సామర్థ్యాన్ని వినియోగించేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించి రాబోయే కేబినెట్ సమావేశంలో సమర్పించాలని స్పష్టం చేశారు. జూన్ 2024 నుంచి జూన్ 2025 వరకు రూ. 192.5 కోట్లు పెట్టుబడి వ్యయం కింద , రూ. 66.76 కోట్లను నిర్వహణా వ్యయం కింద చెల్లింపులకు నిధులు విడుదల చేయగా, భారత్ నెట్ ఫేజ్ 2లో భాగంగా రూ. 67.14 కోట్ల కేంద్ర నిధులు అందాల్సి ఉంది.
అయితే గ్రామ పంచాయతీలను నెట్ అనుసంధానంలో ఏపీ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 12,946 గ్రామ పంచాయతీలకు ఫైబర్ నెట్ సౌకర్యం కల్పించడం జరిగింది. 104 ప్రభుత్వ సంస్థలు–కార్యాలయాలకు ఫైబర్ నెట్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రస్తుతం 5 ప్యాకేజీల రూపంలో గృహాలకు ఫైబర్ నెట్ కనెక్షన్లు అందిస్తున్నారు. 21,000 కంటే ఎక్కువ సంస్థలు హై–స్పీడ్ బ్రాడ్ బ్యాండ్‌ను పొందుతున్నాయి. 175 టెలికాం టవర్స్ తో లింక్ చేశారు. దీనిని మరింత అభివృద్ధి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 442 ఉద్యోగులు, అధికారులు ప్రస్తుతం సంస్థలో పనిచేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 78,355 కి.మీ. మేర ఫైబర్ నెట్ విస్తరించగా, మొత్తం 2 లక్షల కి.మీ. మేర ఫైబర్ నెట్ లైన్ వేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఫైబర్ నెట్ విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా ముందుంది. ఆంధ్రప్రదేశ్ తర్వాత స్థానంలో మహారాష్ట్ర 50,481 కి.మీ., తమిళనాడు 49,616 కి.మీ., గుజరాత్ 35,246 కి.మీ., తెలంగాణ 29,143 కి.మీ. మేర పైబర్ నెట్ కలిగి ఉన్నాయి.