వీళ్లు ఉద్యోగుల సహకార సంఘం పెద్దలా? గద్దలా?

అడ్డగోలు దోపిడీకి తెగబడిన వీళ్లపై సర్కారు చర్యలేవీ?

By :  Admin
Update: 2024-09-24 01:30 GMT

(ది ఫెడరల్ ప్రతినిధి, విజయవాడ)

దొంగలు దొంగలూ కలిసి ఊళ్లు పంచుకున్న చందాన ప్రభుత్వ ఉద్యోగుల గృహ నిర్మాణ సహకార సంఘం తయారైంది. అధికారాన్ని, రాజకీయ పలుకుబడిని అడ్డం పెట్టుకుని సహకార స్ఫూర్తినే దెబ్బతిస్తున్న ఓ ప్రభుత్వ ఉద్యోగుల గృహ నిర్మాణ సంస్థ నిర్వాహకుల బాగోతం ఇప్పుడు బట్టబయలైంది. ప్రశ్నించడమే పాపమన్నట్టుగా అడిగిన వారిని అడిగినట్టు సస్పెండ్ చేయడం, అడ్డగోలుగా వ్యవహరించడం ఆ సంఘం నేతల రివాజుగా మారింది. ఈ సంఘం పెద్దలు గద్దలుగా మారి నోరూవాయి లేని చిరుద్యోగుల పొట్టగొడుతున్న తీరు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. సభ్యుల్ని బెదిరించేందుకు ఉద్దేశించిన సర్వసభ్య సమావేశం రసాబాస కావడంతో ఇప్పుడు విస్తుగొలిపే నిప్పులాంటి బయటకు వస్తున్నాయి. కోట్ల రూపాయిల సొసైటీ నిధులు పక్కదారి పట్టడంపై సభ్యుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవతున్నాయి. ఇంత జరుగుతున్నా ఆ సంఘం అధ్యక్షుడు గానీ ఇతర డైరెక్టర్లు గానీ ఏమాత్రం జడుపు లేకుండా నిస్సిగ్గుగా సభ్యుల గోళ్లూడగొట్టే పనికి పూనుకోవడం వారి బరితెగింపు ఆగడాలకు నిదర్శనమంటున్నారు 655 మంది ప్లాట్ హోల్డర్లు. సొసైటీలో జరుగుతున్న అవినీతి బాగోతాన్ని బాధితుల తరఫున మాజీ ప్రభుత్వ ఉద్యోగులైన శ్రీనివాసు, రత్నప్రసాద్ ‘ది ఫెడరల్’కి వివరించారు. వారేమి చెప్పారో వాళ్ల మాటల్లోనే...

అసలు విషయమేమిటంటే..

స్త్రీ ,శిశు సంక్షేమ శాఖలో పనిచేసే అడ్డాల సుబ్బరాజు అనే ఉద్యోగి హౌసింగ్ కోపరేటి సొసైటీ పేరుమీద కోట్ల రూపాయిల దోపిడీకి స్కెచ్ వేశాడు. ఈ ప్లాన్ తెలపకుండా ఓ ల్యాండ్ లార్డ్, ఓ కన్సల్టెంట్ ను భాగస్వాములను చేసుకున్నారు. ఈ ప్లాన్ లో భాగంగా తొలుత 2016లో ప్రభుత్వ ఉద్యోగుల పరస్పర సహాయ సహకార గృహ నిర్మాణ సంఘం పేరుతో ఓ సంస్థను రిజిస్టర్ చేశారు. కార్యదర్శిగా నాదేండ్ల విశ్వనాథ నాయుడు అనే వ్యక్తికి సొసైటీ పనులు అప్పజెప్పారు. ఆ తర్వాత ఉద్యోగులకు వల వేశారు. ఎవరూ ముందుగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. సంఘమే రైతులను ఒప్పించి భూమి కొంటుందన్నారు. లేఔట్ వచ్చిన తర్వాత డబ్బు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకొమ్మని ప్రభుత్వ ఉద్యోగులను నమ్మించారు. 2018లో భూమి కొనుగోలు చేయకుండానే 'కలిదిండి కన్సల్టెంట్' వారితో ఎకరం రూ. 1 కోటీ 30 లక్షలు చొప్పున 100 ఎకరాలు కొనుగోలు చేయాలని, డెవలప్మెంట్ చార్జీలు కింద చదరపు గజానికి 1888 రూపాయలు ఇచ్చే లా అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు.

 

ఉమ్మడి కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని కేతనకొండ గ్రామంలో ఎకరం రూ. ఒక కోటి 20 లక్షల కు కొనుగోలు చేశారు. 85 ఎకరాలను ముందస్తు తేదీల చెక్కులతో కొనుగోలు చేసి 2020 జూలై నెలలో సి.ఆర్ .డి.ఏ. లేఔట్ పొందారు. మొత్తం 828 ప్లాట్లు రాజధానికి దగ్గరగా ఉంటుందని, పైగా ఎంప్లాయీస్ కోపరేటివ్ సొసైటీ అనే నమ్మకంతో సుమారు 3వేల మంది సభ్యులుగా చేరారు. 165, 300, 400 గజాల విస్తీర్ణం ఉండేలా ప్లాట్లు విడగొట్టారు. ప్రభుత్వ అధికారుల సమక్షంలో లాటరీ వేయడం ద్వారా ప్లాట్లు కేటాయించారు. 2021 డిసెంబర్ వరకు 650 మంది సభ్యులకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. రూ 126 కోట్లు సొసైటీ ఖాతాకి చేరాయి. మరో 72 మంది ప్లాట్ల కొనుగోలుకు రూ.7.47 కోట్లు అడ్వాన్సుగా చెల్లించారు. రూ.74 కోట్ల విలువైన 62 వేల చదరపు గజాల స్థలం ఇంకా సంఘం వద్ధ మిగిలి ఉంది. సుమారుగా 40% లేఔట్ అభివృద్ధి జరిగింది. ఈ దశలో ఓ పెద్ద ట్విస్ట్ చోటుచేసుంది. సభ్యులు ప్లాట్లు తమకు దక్కుతాయనుకున్న సమయంలో - సొసైటీకి పొలం అమ్మిన ముగ్గురు రైతులు తమకు డబ్బు ఇవ్వలేదని- సెవెంత్ అడిషనల్ డిస్టిక్ట్ కోర్టులో 41 కోట్ల రూపాయలకు దావాలు వేశారు. భూముల యజమానులు తమకు ఇచ్చిన చెక్కులను తేదీల ప్రకారం బ్యాంకులో వేసుకోలేదు. తమ భూములను సంఘ సభ్యులకు ప్లాట్లుగా విభజించి విక్రయిస్తున్నా మౌనంగానే ఉన్నారని రత్నప్రసాద్, శ్రీనివాస్ వివరించారు.

రిజిస్ట్రేషన్ పూర్తయిన మూడేళ్ల తర్వాత...

రిజిస్ట్రేషన్ పూర్తయిన మూడేళ్ల తర్వాత సీఆర్డీఏ తనఖా ప్లాట్లు, అడ్వాన్సులు తీసుకొని సభ్యులకు విక్రయించిన ప్లాట్లపై భూ యజమానులు కోర్టు అటాచ్ మెంట్ ఉత్తర్వులు పొందడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇరువర్గాలు కుమ్మక్కై ఇదంతా నడిపిస్తున్నారంటూ సభ్యులు సొసైటీ పాలకవర్గాన్ని నిలదీస్తున్నారు. భూమిని అమ్మిన రైతులు 'తమ తెలివితేటలతో' సీఆర్డీఏకి తనఖా పెట్టిన ప్లాట్లను కూడా కోర్టు ద్వారా అటాచ్ చేసుకున్నారు. సంఘ అధ్యక్ష, కార్యదర్శులు 18,650 చదరపు గజాలు ఐకేఎఫ్ ఫైనాన్స్ వద్ద తాకట్టు పెట్టి రూ.5 కోట్ల డబ్బులు తెచ్చారు. సకాలంలో ఆ డబ్బు చెల్లించక పోవడంతో ఆ సంస్థ వేలం ప్రకటన జారీ చేసింది. మిగిలిన 62 వేల గజాలలో 43 వేల గజాలు- పొలం అమ్మిన రైతు చింతా మనోజ్ రాజ్- స్వాధీనంలో ఉంది. ఈ విషయాలన్నీ సొసైటీ అధ్యక్షుడు, ఇతర డైరెక్టర్లకు తెలుసు. కానీ ఏ సభ్యుడీకి ఈ విషయం తెలియజేయలేదు. సర్వసభ్య సమావేశంలో చెప్పలేదు. ఆ విషయాలేవి సభ్యులకు తెలపకుండా 2022 సెప్టెంబర్ లో జరిగిన మహాజనసభలో '2023 మార్చి నాటికి మీ ప్లాట్లు మీకు అభివృద్ధి చేసి ఇస్తాం' అని అధ్యక్షుడు సుబ్బరాజు వార్షిక నివేదికలో తెలిపారు. సంఘం 15 కోట్ల రూపాయల లాభంతో ఉందని కూడా అప్పటి నివేదికలో తెలిపారు.

 

అభివృద్ధికి డబ్బులివ్వాలంటూ నోటీసులు...

సొసైటీ అధ్యక్షుడు తాను చెప్పిన దానికి భిన్నంగా ప్లాట్ల కేటాయింపు సమయంలో అభివృద్ధి కోసం సొసైటీ పాలకవర్గం నిర్ణయించిన మొత్తం డబ్బు చెల్లించినా- మళ్లీ డెవలప్మెంట్ పేరిట 2023 మార్చిలో నోటీసులు ఇచ్చారు. గజానికి వేయి చొప్పున డబ్బు కట్టాలని హుకుం జారీ చేశారు. దీనిపై సభ్యులు ప్రశ్నించడంతో పాటు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. స్పందన కార్యక్రమంలోనూ వినతిపత్రాలు ఇచ్చారు. దీంతో ఓ సందర్భంలో డీసీవోను పిలిచి కలెక్టర్ ప్రశ్నించారు. నిధుల దుర్వినియోగం జరిగిన మాట వాస్తవమేనని చెప్పారు. నిధుల దుర్వినియోగాన్ని ప్రశ్నించిన వారిని ఎలా తొలిగిస్తారని కూడా కలెక్టర్ ప్రశ్నించడంతో నోరు వెళ్లబెట్టడం ఆనాటి డీసీవో వంతైంది.

ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేసిన మూడేళ్ల తర్వాత తిరిగి నష్టం/లోటు పేరుతో అప్పటికే రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారిని అదనంగా చదరపు గజానికి రూ.1000 చొప్పున సొమ్ము చెల్లించమని ఒత్తిడి చేయడం విడ్డూరంగా ఉందని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన ఉపాధ్యాయుడు బాపిరాజు చెబుతున్నారు. అక్రమాలను ప్రశ్నించిన వారిని సర్వసభ్య సమావేశాలకు రాకుండా ఆపడం కాకుండా వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా తీర్మానాలు కూడా రాయించారని తెలిపారు.

సభ్యులకు హెచ్చరికలు, బెదిరింపులు ...

2023 మార్చి నెలలో మార్చి 11వ తేదీన స్పెషల్ జనరల్ బాడీ ఏర్పాటు చేసి సంఘంలో రూ.26 కోట్లు లోటు ఏర్పడిందని ఆ లోటు పూరించడానికి చదరపు గజానికి వెయ్యి రూపాయలు చొప్పున చెల్లిస్తే గాని ఈ లోటు భర్తీ చేయడం కుదరదని సభ్యులను బెదిరించారని రత్నప్రసాద్, శ్రీనివాస్ ఆరోపించారు అదే సభలో 'రైతులు పొలం దున్నేస్తామంటున్నారని, మీరేమీ చేయలేరని' సభ్యులను భయపెటారని కూడా ఆరోపించారు. ఐ.కె. ఎఫ్. ఫైనాన్స్ వారికి 18,650 చదరపు గజాలను రూ.8 కోట్ల రూపాయలకు తాకట్టు పెట్టడం మూలంగా అప్పు చెల్లించలేక వేలానికి వచ్చిందని సుబ్బరాజు చెప్పారు. 72 మంది సభ్యులు ప్లాట్లు కొనుగోలుకు అడ్వాన్సులు, కొంతమంది పూర్తిగా డబ్బులు చెల్లించినా పొలం కోర్టు అటాచ్ మెంట్ లో ఉండడంతో ఏమీ చేయలేనని, నిస్సహాయ పరిస్థితిలో ఉన్నానని తెలిపారు. సమావేశాలు నిర్వహించకుండానే సభ్యుల సంతకాలు సేకరించడంలో దిట్టలైన ఈ సొసైటీ పాలకవర్గం తిమ్మిని బమ్మిని చేసి ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా సభ్యులను నమ్మజూపారన్నది బాధితుల ఆరోపణ. గత ఏడాది జరిగిన సర్వసభ్య సమావేశంలో సభ్యులు సొసైటీలో జరుగుతున్న అక్రమాలపై నోరెత్తారు. సభ్యులలో ఉన్న వ్యతిరేకతను గమనించి 2023 జూలై నెలలో సభ్యులు చదరపు గజానికి వెయ్యి రూపాయలు కట్టాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు.

 

ఆ తర్వాత 2023 నవంబర్ నెలలో జరిగిన మహాజనసభలో చదరపు గజానికి 1500 రూపాయలు సభ్యులు చెల్లించవలసిందేనని, అలా చెల్లించకపోతే అభివృద్ధి జరగదని హెచ్చరించారు. అలా కట్టని పక్షంలో బైలా ప్రకారం, చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని, చట్టపరంగా శిక్షిస్తానని ఇది ప్రభుత్వ నియంత్రణలోని సంస్థ అని హెచ్చరికలు జారీ చేశారు. సంఘ అధ్యక్షుడిని 'నన్నే ప్రశ్నిస్తారా' అని మహాజన సభ తర్వాత 29 మంది సభ్యులను సభ్యత్వం నుంచి తొలగించారు. గజానికి రూ. 1500, మెయింటినెన్స్ కింద చదరపు గజానికి నెలకు రూ.10 చొప్పున 300చదరపు గజాలు ఉన్న ప్లాటుకు 36 వేల రూపాయల ఆర్థిక భారాన్ని మోపడాన్నీ సభ్యులు ప్రశ్నించారు. 655 మంది ప్లాట్ ఓనర్స్ లో 65, 85 ఏళ్ల వయస్సున్న రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు 472 మంది ఉన్నారు. వీరు కేవలం పెన్షన్ మీద ఆధారపడి బతుకుతున్నవారు. అదనపు ఆర్ధిక భారానికి సభ్యులు ససేమిరా అని అడ్డం తిరిగారు. దీంతో బెదిరింపులకు, సభ్యుల సస్పెన్షన్ లకు దిగినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. బోగస్ సభ్యులకు ప్లాట్లు ఎలా కేటాయిస్తారని నిలదీసిన వారిపై వేటు ఎలా వేస్తారని ప్రశ్నించినందుకు వాళ్లను అసలు సర్వసభ్య సమావేశానికే రాకుండా చేసిన ఘటనలు ఉన్నాయి.

బైలా నిబంధనలు, సహకార విలువలకు పాతర...

సొసైటీ నిబంధనల ప్రకారం నిర్వహించాల్సిన ఎన్నికల్ని నిర్వహించడం లేదు. ఆడిట్ లేదు. ఎజెండాలో 15 అంశాలు ఉంటే సభ్యులకు తెలియకుండా 2019 ఆగస్టు 10న ఏకంగా 60 తీర్మానాలు చేశారు. సుమారు 43 కోట్ల రూపాయల అప్పులకు సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించి తీర్మానించారని రాసుకున్నారు. కోపరేటివ్ డిపార్ట్మెంట్ తన గుప్పెట్లో ఉందనే ధీమాతో ఆది నుంచి బైలా నిబంధనలు, సహాకార విలువలకు పాతరేసి ఇష్టా రాజ్యాంగా కోట్ల నిధులు దుర్వినియోగం చేశారని రత్నప్రసాద్ ఆరోపించారు.

విచారణ అధికారికి కనిపించని అవకతవకలు

సొసైటీ అవకతవకలపై ఏపీ మాక్స్ చట్టంలోని సెక్షన్ 29 కింద సమగ్ర విచారణ జరపాల్సిన సహకార సంఘాల రిజిస్ట్రార్ మిన్నకుండిపోయారు. సభ్యులు పోరగా పోరగా ఆనాటి కోఆపరేటివ్ రిజిస్ట్రార్ బాబు నందిగామ సబ్ డివిజినల్ సహకార అధికారి ఎస్.శ్రీనివాసరావును విచారణాధికారిగా నియమించారు. కాగితాల్లో లెక్కలకు క్షేత్ర స్థాయిలో వాస్తవాలకు ఏమాత్రం పొంతన లేకపోయినా ఆ అధికారి పట్టించుకోలేదన్నది సభ్యుల ఆవేదన.

 

మౌలిక వసతులు, అదనపు స్టాంపు డ్యూటీ , బ్రోకరేజి, సర్వే, మ్యూటేషన్ రుసుం వంటి అనేకం పేరిట కోట్లాది రూపాయల దుర్వినియోగం జరిగినట్టు సభ్యులు ఆరోపించారు. సీఆర్డీఏ ఆర్కిటెక్టుకు ఏకంగా రూ. 2.36 కోట్లు చెల్లించారు. ఇతర ఖర్చుల పేరిట ఎకరాకు రూ. 7 లక్షలు చొప్పున రూ. 6 కోట్ల ఖర్చు పద్దులో రాశారు. ఏడాదికి సగటున రూ. 2.5 కోట్ల చొప్పున రూ. 18.50 కోట్లు ఖర్చు అయినట్లు లెక్కల్లో చూపారు. ఇలా ప్రతి అంశంలో అడ్డగోలు ఉల్లంఘనలకు పాల్పడినా అవి విచారణాధికారి పరిధిలోకి రాలేదు.

ప్రారంభ నుంచే మోసాలు...

భూమి కొనుగోలు చేసేటప్పుడే సుబ్బరాజు మోసానికి తెరలేపాడన్నది సభ్యుల ఫిర్యాదు. ఆ సమయంలో ఎకరం ధర మార్కెట్ విలువ రూ.25 లక్షలుంటే ఏకంగా రూ.కోటీ 20 లక్షల కు కొనుగోలు చేశాడు. ఇందులో ఎకరాకు రూ. 5లక్షలు బ్రోకరేజి, మిస్ లీనియన్స్ రూ. 5 లక్షలు చూపించారు.

*సభ్యులకు ఏకరీతిన కాకుండా రకరకాల ధరలతో ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేశారు. 41 ప్లాట్లను సభ్యులు కాని వారికి కట్టబెట్టారు. 26 ప్లాట్లను కన్సెల్టెంట్లకు అప్పగించారు.

*స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ రుసుం, ట్రాన్స్ ఫర్ డ్యూటీ పేరితో అధిక వసూళ్లు చేశారు.

*సొసైటీ పేరున రిజిస్ట్రేషన్ లో కూడా అవకతవకలకు పాల్పడ్డాడు. ఎక్కడా లేనివిధంగా భూ యజమానికి పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చి సొసైటీకి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. చట్ట బద్దత లేని దస్తావేజులను సీఆర్డీఏకి సమర్పించారు.

*భూముల కొనుగోలు, ప్లాట్ల రిజిస్ట్రేషన్, స్టాంపు డ్యూటీ, డెవలెప్ మెంట్ ఖర్చులు, కమీషన్ల వంటి వాటన్నింటిని లెక్కగట్టి ప్రతి ఒక్కరి నుంచి ఆనాడే దాదాపు 10, 11 లక్షల చొప్పున రూ.126 కోట్లు సుబ్బరాజు వసూలు చేశారు.

*ప్లాట్ రిజిస్ట్రేషన్ సమయంలో డెవలప్మెంట్ ఖర్చుల కింద చదరపు గజానికి రూ.2250 వసూలు చేసి ప్లాట్లు డెవలెప్ చేసినట్టుగా సంఘం రికార్డుల్లో సుమారు 35 కోట్ల రూపాయలు ఖర్చు రాశాడు. డెవలప్మెంట్ మాత్రం జరగలేదు

*రిజిస్ట్రేషన్ ఖర్చులు కింద చదరపు గజానికి రూ. 400 వసూలు చేసి 150 రూపాయిలే ఖర్చు చూపారు.

*బ్రోకరేజి ఒక శాతానికి 6శాతం చెల్లించారు.

*ప్లాట్లుకొన్న సభ్యులు నుంచి రూ. 148 కోట్లు వచ్చినా భూ యజమానుల డబ్బు చెల్లించలేదు.

*రికార్డుల ప్రకారం కొనుగోలు చేసిన భూమి ధర రూ.99 కోట్లు. రిజిస్ట్రేషన్ ఖర్చులు రూ. 7 కోట్లు, కమిషన్ కింద ఇచ్చింది రూ.6కోట్లు. మొత్తం 112 కోట్లు అయింది. ఇంకా 36 కోట్లు చేతిలో ఉన్నా రైతుల అప్పు ఎందుకు తీర్చ లేకపోయాడు. ఇప్పటికి ఐదేళ్లు దాటినా చెల్లించకుండా సీఆర్డీఏను, ఇటు సభ్యులను నిర్భీతిగా దగా చేస్తున్నాడు.

*2019 నుంచి ఇప్పటివరకు భూ యజమానులకు 24 శాతం వడ్డీతో సుమారు రూ. 20కోట్లు వడ్డీ కట్టాడు.

*లాండ్ లార్డ్ సిఆర్డీఏకి తనఖా పెట్టిన ప్లాట్లను ఐకెఎఫ్ ఫైనాన్స్ దగ్గర తనఖా పెట్టాడు. ఈ తనఖాపై సిఆర్డీఏ ఇటీవల సుబ్బరాజుకు షో కాజు నోటీసు ఇచ్చింది.

 

అన్ని వ్యవస్థలు సుబ్బరాజు గుప్పిట్లోనే..!

సంఘం నిర్వహణ పూర్తిగా గాడితప్పిందని సుబ్బరాజు అవినీతి లీలలు, మోసాలపై సభ్యులు కోపరేటివ్ కమిషనర్ కు, సిఆర్డీఏ కు విజ్ఞానపనలు రావడంతో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అయినా గత ప్రభుత్వం గానీ ఇప్పటి ప్రభుత్వం గానీ ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇన్ని ఆరోపణలు వెల్లువెత్తుతున్నా ఏ మాత్రం ఖాతరు చేయని సొసైటీ అధ్యక్షుడు ఏ.సుబ్బరాజు మళ్లీ ఇప్పుడు ప్లాట్లకు డబ్బులు కట్టాలంటూ నోటీసులు ఇవ్వడం గమనార్హం. అభివృద్ధి కోసం ఎన్ని సార్లు డబ్బులు కట్టాలని సభ్యులు ప్రశ్నించిన నేపథ్యంలో ఇటీవల జనరల్ బాడీ పెట్టారు. ఆ సమావేశంలో గందరగోళం చెలరేగింది. ఆ సందర్భంలో సొసైటీ నుంచి బహిష్కరణకు గురైన సభ్యులు, సొసైటీ పాలకవర్గం దోపిడీ భరించలేమంటున్న సభ్యులు కలిసి నిరసన తెలిపారు. దీంతో అసలు విషయం బయటపడింది. స్థానికంగా ఓ ప్రజాప్రతినిధి అండచూసుకునే ఈ సుబ్బరాజు ఇంతగా బరి తెగించారని ఓ రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఆరోపించారు.

ఈనెల సెప్టెంబర్ 29వ తేదీన మధ్యాహ్నం 2.30 గంటలకు కేతనకొండ వద్ద లేఔట్ స్థలంలోనే మళ్లీ వార్షిక సర్వ సభ్య సమావేశం నిర్వహిస్తున్నట్టు సుబ్బరాజు సభ్యులకు నోటీసు జారీచేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని సభ్యులు కోరుతూన్నారు. రిజిస్ట్రార్ కార్యాలయాల సంస్కరణకు పూనుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడైనా ఈ సహకార సంఘం గద్దల్ని కట్టడి చేయాలని కోరుతున్నారు శ్రీనివాస్, రత్నప్రసాద్. ఈ వ్యవహారమై సుబ్బరాజును వివరణ అడిగేందుకు ప్రయత్నించగా ఆయన ఫోన్ ఎత్తలేదు.

Tags:    

Similar News