గోరకల్లు రిజర్వాయర్ పూర్తి చేయాలి
గోరకల్లు ప్రాజెక్టు రైతులకు, ప్రజలకు న్యాయం చేయాలంటే వెంటనే రిజర్వాయర్ నిర్మాణం, మరమ్మతులు పూర్తి చేయాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి ప్రభుత్వాన్ని కోరింది.;
ఎస్ఆర్బీసీ ప్రాజెక్టులో కీలకమైన గోరకల్లు రిజర్వాయర్ నిర్మాణము, మరమ్మత్తులు పూర్తిగా చేసి ఆయకట్టుకు, ప్రజల ప్రాణాలకు భరోసా కల్పించాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అద్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గోరుకల్లు రిజర్వాయర్ మరమ్మత్తులకు తక్షణమే నిధులు విడుదల చేయాలని కోరుతూ రాయలసీమ సాగునీటి సాధన సమితి అనుబంధ సంస్థ SRBC ఆయకట్టు పరిరక్షణ సమితి ఆద్వర్యంలో మంగళవారం నంద్యాల జిల్లా పాణ్యం మండల తహశీల్దారు కార్యాలయం దగ్గర SRBC ఆయకట్టు రైతులు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా బొజ్జా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ.. శ్రీబాగ్ ఒడంబడికను గౌరవిస్తూ రాయలసీమలో చేపట్టిన ఏకైక ప్రాజెక్టు ఎస్ఆర్బీసీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంజయ్య ముఖ్యమంత్రిగా ఎస్ ఆర్ బి సి ప్రాజెక్టు నిర్మాణానికి అంకురార్పణ చేశారన్నారు. ఈ ప్రాజెక్టుకు గుండెకాయ లాంటి గోరకల్లు రిజర్వాయర్ నిర్మాణానికి ఆనాటి ప్రధానమంత్రి పీవీ నరసింహారావు సహకారం అందించిన విషయాన్ని ఆయన గుర్తు చేసారు. వెనకబడిన రాయలసీమలోని 1,90,000 ఎకరాలలో సిరులు కురిపించే అవకాశం ఈ ప్రాజెక్టు కల్పించిందని తెలిపారు.
ఎస్ ఆర్ బి సి ఆయకట్టుకు నీరు సకాలంలో సక్రమంగా అందించడానికి కీలకమైనది గోరుకల్లు రిజర్వాయర్. గోరుకల్లు రిజర్వాయర్ భద్రతకు కీలకమైన నిర్మాణాలను ఐదు సంవత్సరాల కిందట అర్ధాంతరంగా ఆపారనీ, దీనికి తోడు రిజర్వాయర్ నిర్వహణ లోపాలతో అనేక చోట్ల రిజర్వాయర్ రివిట్మెంట్ కూడా కిందికి జారిందని ఆందోళన వ్యక్తం చేశారు.
శ్రీశైలం రిజర్వాయర్ లో నీరు ఉన్నప్పుడు బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ నుండి గోరుకల్లు వరకు ఉన్న కాలువ ద్వారా రోజుకు 2 టిఎంసీల నీటిని ఈ రిజర్వాయర్లో నింపడానికి అవకాశం ఉందనీ.. అయితే రిజర్వాయర్ తెగిపోతుందన్న భయంతో కేవలం 1/2 టి ఎం సీ నీటిని మాత్రమే రిజర్వాయర్ లోకి తీసుకొనివస్తున్నారు. దీని వలన శ్రీశైలంలో వరద ఉన్నప్పటికీ రిజర్వాయర్ లో నీటిని నింపుకోలేని దుస్థితి ఏర్పడిందన్నారు.
శ్రీశైలంలో వరద ఉన్న సందర్భంలో సకాలంలో గోరుకల్లు నింపలేకపోతే 1,90,000 ఎకరాల ఎస్ ఆర్ బి సి ఆయకట్టు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గాలేరు నగరి ప్రాజెక్టుకు కీలకమైన గండికోటకు, మైలవరం, ఔక్ రిజర్వాయర్ల కు గోరుకలు రిజర్వాయర్ నుంచి కృష్ణా జలాలను పంపాల్సి ఉంటుంది. ఈ రిజర్వాయర్ల ఆధారంగా 1,50,000 ఎకరాలకు పైగా ఆయికట్టుకు సాగునీరు అందించాల్సి ఉంది. అత్యంత కీలకమైన గోరుకల్లు రిజర్వాయర్ భవిష్యత్తు మీద ఆధారపడిన సుమారు మూడు లక్షల ఎకరాల ఆయకట్టు ద్వారా ప్రతి సంవత్సరం 3000 కోట్ల రూపాయల వ్యవసాయ ఉత్పాదన జరుగడమే గాక లక్షలాది ప్రజలకు త్రాగునీరు లభిస్తున్నదన్నారు.
SRBC ఆయకట్టు పరిరక్షణ సమితి నాయకులు మాట్లాడుతూ... ప్రభుత్వం తక్షణమే స్పందించి సాగునీటి హక్కలున్న ఎస్ ఆర్ బి సి ప్రాజెక్టు పరిరక్షణకు కీలకమైన గోరుకల్లు రిజర్వాయర్ మరమ్మత్తులకు నిధులు కేటాయించి, వచ్చే ఖరీఫ్ సీజన్ కు పనులు పూర్తి చెయ్యాలని డిమాండ్ చేసారు.
అనంతరం పాణ్యం తహశీల్దారు నరేంద్రకుమార్ రెడ్డికి వినతిపత్రం అందచేసారు. ఈ విషయంపై తహశీల్దారు స్పందిస్తూ.. గోరుకల్లు రిజర్వాయర్ పై రైతులు ఇచ్చిన వినతిపత్రంను జిల్లా కలెక్టర్ కు, ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ కు పంపుతామని తెలిపారు. ధర్నా కార్యక్రమంలో SRBC ఆయకట్టు పరిరక్షణ సమితి నాయకులు మురళీనాథ్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, యాగంటి బసవేశ్వర రైతు సంఘం కన్వీనర్ M.C కొండారెడ్డి, శేషారెడ్డి, సమాజ్ వాది పార్టీ నాయకులు శివకృష్ణాయాదవ్, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ప్రతినిధి వనం వెంకటాద్రి, NSUI నంద్యాల జిల్లా కార్యదర్శి ప్రతాప్ రెడ్డి, నెరవాడ ప్రసాద్ రెడ్డి, సూర్యమహేశ్వరరెడ్డి, మహిళా నాయకురాలు సీతక్క, ఏరువ రామచంద్రారెడ్డి, న్యాయవాది అసదుల్లా, కొణిదేడు శంకరయ్య, ఆయకట్టు రైతులు పాల్గొన్నారు.