కరేడు వద్ద 20 వేల ఎకరాల భూ సేకరణకు జీవో జారీ
రామాయపట్నం ఇండస్ట్రియల్ క్లస్టర్ కింద 20 వేల ఎకరాల భూమిని సేకరించేందుకు ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది.;
ఉద్యమాలు భూ సేకరణను ఆపలేవని ప్రభుత్వం జీవో ద్వారా తేల్చి చెప్పింది. నెల్లూరు జిల్లా కరేడు గ్రామంలో వారం రోజుల క్రితం కందుకూరు సబ్ కలెక్టర్ నేతృత్వంలో జరిగిన భూ సేకరణ సభ రసాభస అయింది. సభలో సుమారు 3వేలకు పైన గ్రామస్తులు, రైతులు, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. గత నెల 29న చెన్నై, కోల్ కతా హైవేపై సుమారు రెండు వేల మంది రైతులు రస్తారోకో నిర్వహించి భూ సేకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేసి నిరసన తెలిపారు. అయినా ప్రభుత్వం ఇవేమీ పట్టనట్లు జీవో జారీ చేయడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది.
పెట్టుబడి దారులు చెప్పినట్లుగానే...
ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం పెట్టుబడులను ఏపీలో ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లా రామాయపట్నం ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడితే ప్రస్తుత ప్రభుత్వం దానిని అమలు చేసే పని పెట్టుకుంది. రామాయపట్నం పోర్టు నుంచి హైవే మీదకు 12 కీలో మీటర్ల దూరం ఉంటుంది. ప్రస్తుతం పోర్టు నుంచి హైవే వరకు డబుల్ రోడ్డు నిర్మించారు. అందువల్ల పోర్టుకు వెళ్లి వచ్చేందుకు వీలుగా ఉంటుంది. రామాయపట్నం నుంచి కరేడు గ్రామానికి రెండు కీలో మీటర్ల దూరం ఉంటుంది. కరేడు, మారాయపట్నం, ఇంకా పలు గ్రామాలకు చెందిన భూములను సేకరించాల్సి ఉంది.
ఇండోసోల్ కంపెనీకి 5,000 ఎకరాలు ఇవ్వాలనుకున్నారు...
గత ప్రభుత్వంలో కుదిరిన ఒప్పందం ప్రకారం ఇండోసోల్ కంపెనీకి గుడ్లూరు మండలం సోలిపేట, చేవూరు వద్ద 5వేల ఎకరాలు ఇవ్వాలనే ప్రతిపాదన జరిగింది. చేవూరు.. రామాయపట్నం పోర్టును ఆనుకుని ఉంటుంది. అయితే ప్రస్తుత ప్రభుత్వం కరేడు వద్ద ఎనిమిదిన్నర వేల ఎకరాల భూమి ఇండోసోల్ వాళ్లకు ఇస్తామని చెప్పి చేవూరు నుంచి వాళ్ళను కరేడు వద్దకు తరలించే ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే చేవూరు వద్ద ఇండోసోల్ కంపెనీకి 115 ఎకరాలు ప్రభుత్వం ఇచ్చింది. ప్రస్తుతం అక్కడ సోలార్ ప్లేట్స్ తయారీ కంపెనీ నడుస్తోంది. బీపీసీఎల్ వాళ్లకు కూడా రామాయపట్నం వద్దే భూములు ఇచ్చేందుకు నిర్ణయించిన నేపథ్యంలో ఇంకా ఏవైనా కంపెనీలు వస్తే వాటికి కూడా మరళా భూ సేకరణ జరగకుండా ఉండేలా 20 వేల ఎకరాలు సేకరించే నిర్ణయం తీసుకుంది.
పేరుకే రామాయపట్నం... పోర్టు ఉండేది రావూరు రెవెన్యూలో...
ఉలవపాడు మండలం రామాయపట్నం పోర్టు నిర్మాణం కొంత వరకు జరిగింది. ఇందులో ప్రస్తుతం నాలుగు బెర్త్ లు పూర్తయ్యాయి. ఈ నాలుగు బెర్త్ ల ద్వారా సరుకు రవాణా చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఈ నిర్మాణ పనులు పిపిపి పద్దతిలో జరుగుతున్నందున ఎవరు పోర్టు నిర్మాణం చేస్తుంటే వారే నిర్వహణ బాధ్యతలు కూడా చూస్తారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అరబిందో వాళ్లు నిర్మాణం చేపట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత వారిని పక్కన బెట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవయుగ కనస్ట్రక్షన్స్ వారికి అప్పగించారు. రానున్న రోజుల్లో నవయుగ వారు రామాయపట్నం పోర్టు మెయింటెనెన్స్ చూస్తారు.
భూ సేకరణకు ఐదు ప్రత్యేక యూనిట్లు
భూ సేకరణ కోసం ఐదు ప్రత్యేక యూనిట్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ యూనిట్లకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లు నేతృత్వం వహిస్తారు. ఈ యూనిట్ కార్యాలయాలు నెల్లూరు జిల్లా కావలి, కందుకూరుల్లో ఉంటాయి. ఐదు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లకు ప్రత్యేకంగా కార్యాలయాలు ఏర్పాటు చేస్తారు. ఐదుగ్గురు స్పెషల్ కలెక్టర్లకు ప్రత్యేకంగా వాహనాలు ఉంటాయి. డిప్యూటీ తహసిల్లార్ లు ఐదుగురు, సీనియర్ ససిస్టెంట్లు ఐదుగురు, జూనియర్ అసిస్టెంట్స్ ఐదుగురు, మండల సర్వేర్లు ఐదుగురు, గ్రామ సర్వేర్లు 10 మంది, ఆఫీస్ సబార్టినేట్లు పది మంది ఉంటారు. ఐదు యూనిట్ కార్యాలయాల్లో 55 మంది సిబ్బంది ఉంటారు.
రెండు ప్రత్యేక స్పెషల్ కలెక్టర్ కార్యాలయాలు
కందుకూరు, కావలి డివిజన్ల పరిధిలో రెండు స్పెషల్ కలెక్టర్ కార్యాలయాలు ఉంటాయి. ఈ కార్యాలయాలకు హెడ్స్ గా ఉండే ఆర్డీవోలు, కందుకూరు సబ్ కలెక్టర్, కావలి ఆర్డీవోలు, నెల్లూరు జిల్లా కలెక్టర్ భూ సేకరణకు పూర్తి స్థాయిలో సహకరిస్తారు. స్పెషల్ కలెక్టర్ కార్యాలయంలో ఒక తహసిల్దార్, సీనియర్ అసిస్టెంట్లు ఇద్దరు, జూనియర్ అసిస్టెంట్లు ఇద్దరు, సర్వే డిప్యూటీ ఇన్స్పెక్టర్, మండల సర్వేర్, ఆఫీస్ సబార్టినేట్లు ఇద్దరు ఉంటారు. ఇలా కందుకూరు, కావలి కేంద్రాల్లో రెండు స్పెషల్ కలెక్టర్ కార్యాలయాలు ఉంటాయి. అంటే ఈ రెండు కార్యాలయాల్లో మొత్తం 10 మంది సిబ్బంది పనిచేస్తారు.
రెండేళ్లలో భూ సేకరణ పూర్తి
రానున్న రెండేళ్లలో భూసేకరణ పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. అధికారులు ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామాల్లో ముందుగా తిరిగి అక్కడ భూములు కోల్పోయే వారికి వారు చెప్పదలుచుకున్నది చెప్పి ఒప్పించాల్సి ఉంటుంది. వారు ఒప్పుకున్న తరువాత గ్రామ సభ ఏర్పాటు చేసి సభ ఆమోదం తీసుకుంటారు. ఆ తరువాత భూములు స్వాధీనం చేసుకుని ఏ కంపెనీకైతే ఇవ్వాలో ఆ కంపెనీకి భూములు అప్పగిస్తారు.
ఉద్యమాన్ని కొనసాగించేందుకు నిర్ణయం
పేదలు, రైతుల నుంచి బలవంతపు భూ సేకరణకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని కొనసాగిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కెవివి ప్రసాద్ లు ‘ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్‘ కు చెప్పారు. కరేడు ప్రాంతంలో కానీ, రామాయపట్నం ప్రాంతంలో కానీ ఈ భూములు తీసుకుంటారు. గుడ్లూరు, ఉలవపాడు మండలాల్లో వ్యవసాయంపై ఆధారపడి బతికేవారే ఎక్కువగా ఉన్నారని, వారు సంతోషంగా బతకాలంటే వారి భూములను బలవంతంగా లాక్కోవద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు చెప్పారు.