అందరికీ పిచ్చెక్కిస్తున్న గాంధీ

సీఎల్పీ మీటింగుకు రాజేంద్రనగర్ మరో బీఆర్ఎస్ ఫిరాయింపు ఎంఎల్ఏ ప్రకాష్ గౌడ్ తో కలిసి గాంధీ కూడా హాజరయ్యారు.

Update: 2024-09-22 12:16 GMT

తెలంగాణా కాంగ్రెస్ లో ఏమి జరుగుతోందో అర్ధంకావటంలేదు. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక హోటల్లో కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (సీఎల్పీ) మీటింగ్ జరిగింది. ఈ మీటింగుకు కాంగ్రెస్ ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు, ఎంపీలందరు హాజరయ్యారు. ఇంతవరకు ఎవరికీ ఎలాంటి సమస్యాలేదు. అయితే ఆ సమావేశానికి అరెకపూడి గాంధీ కూడా హాజరయ్యారు. సమావేశానికి హాజరైన గాంధీని చూసిన వాళ్ళు ఒక్కసారిగా షాకయ్యారు. ఎందుకంటే ఈమధ్య కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య జరిగిన అనేక వివాదాల్లో గాంధీ కూడా కేంద్రబిందువుగా మారిన విషయం తెలిసిందే. పబ్లిక్ ఎకౌంట్స్ కమిటీ(పీఏసీ)కి గాంధీని ఛైర్మన్ గా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎంపిక చేయగానే రెండుపార్టీల మధ్యా ఒక్కసారిగా మంటలు రేగాయి.




గాంధీకి పీఏసీ ఛైర్మన్ పదవి కట్టబెట్టడాన్ని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తంచేశారు. ప్రతిపక్షాలకు ఇవ్వాల్సిన పీఏసీ ఛైర్మన్ పదవిని గాంధీకి ఎలాగిస్తారంటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి తదితరులు స్పీకర్ను నిలదీస్తున్నారు. ఇదే సమయంలో గాంధీ ఒక ప్రకటన చేశారు. అదేమిటంటే తాను కాంగ్రెస్ లో చేరలేదని బీఆర్ఎస్ ఎంఎల్ఏని కాబట్టే తనకు పీఏసీ ఛైర్మన్ పదవి ఇచ్చారని ప్రకటించారు. దాంతో రెచ్చిపోయిన బీఆర్ఎస్ ఎంఎల్ఏ గాంధీ ప్రకటనపై పాడి రెచ్చిపోవటంతో ఎంతపెద్ద గొడవైందో అందరు చూసిందే. దాంతో గాంధీ బీఆర్ఎస్ లోనే ఉన్నారా ? లేకపోతే కాంగ్రెస్ ఎంఎల్ఏనా అనే అయోమయం పెరిగిపోయింది.



 సరిగ్గా ఈ నేపధ్యంలోనే ఈరోజు జరిగిన సీఎల్పీ మీటింగుకు రాజేంద్రనగర్ మరో బీఆర్ఎస్ ఫిరాయింపు ఎంఎల్ఏ ప్రకాష్ గౌడ్ తో కలిసి గాంధీ కూడా హాజరయ్యారు. సీఎల్పీ మీటింగు అంటే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు మాత్రమే హాజరవ్వాలి. అలాంటి మీటింగుకు గాంధీ ఎందుకు ? ఎలా హాజరయ్యారో అర్ధంకావటంలేదు. బీఆర్ఎస్ ఎంఎల్ఏలు అడిగినపుడేమో తాను కాంగ్రెస్ లో చేరలేదంటారు. తనంతట తానుగా తాను బీఆర్ఎస్ ఎంఎల్ఏనే అని చెబుతారు. మరిపుడు సీఎల్పీ మీటింగుకు ఎలా హాజరయ్యారో అర్ధంకాక రెండుపార్టీ నేతలు జుట్టు పీక్కుంటున్నారు.



 కొత్తగా నియమితుడైన పీసీసీ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను అభినందించేందుకు మాత్రమే వచ్చానని ఎలక్ట్రానిక్ మీడియాతో గాంధీ చెప్పినట్లు సమాచారం. అయితే మహేష్ ను అభినందించేందుకు ప్రైవేటు హోటల్లో జరుగుతున్న సీఎల్పీ సమావేశం సమయమే గాంధీకి దొరికిందా అనే సందేహాలకు సమాధానం దొరకటంలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే సాంకేతికంగా గాంధీ బీఆర్ఎస్ ఎంఎల్ఏనే. అయితే ఆయన అంటకాగుతున్నది మాత్రం కాంగ్రెస్ తో. దాంతో గాంధీ రాజకీయం ఏమిటో అర్ధంకాక రెండుపార్టీల నేతలు జుట్టుపీక్కుంటున్నారు. తాజాగా సీఎల్పీ మీటింగులో కనబడిన గాంధీ విషయమై బీఆర్ఎస్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సిందే.



 అజెండా

నాలుగు పాయింట్ల అజెండాతో సీఎల్పీ మీటింగ్ జరిగింది. మొదటిది ఏమిటంటే పీసీసీ అధ్యక్షుడు అయిన బొమ్మ మహేష్ కు సన్మానం. రెండో పాయింట్ ఏమిటంటే తొందరలో జరగబోయే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో పార్టీ గెలుపుకు అనుసరించాల్సిన విధి విధానాలు. మూడో పాయింట్ ప్రభుత్వం అమలుచేస్తున్న అనేక సంక్షేమపథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను జనాల్లోకి తీసుకెళ్ళటం. నాలుగో పాయింట్ ఏమిటంటే ప్రభుత్వం, పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు అనుసరిస్తున్న వైఖరిని ఏ విధంగా తిప్పికొట్టాలనే విషయంలో దిశా నిర్దేశం చేయటం.

Tags:    

Similar News