గాంధీ తప్పు ఒప్పుకున్నారు..మరి కౌశిక్ ?

గురువారం ఉదయం ‘బీఆర్ఎస్ ఎంఎల్ఏ పాడి కౌశిక్ రెడ్డిని ఉద్దేశించి తాను మాట్లాడిన మాటలు తప్పే’ అని మరో ఎంఎల్ఏ అరెకపూడి గాంధీ అంగీకరించారు.

Update: 2024-09-13 12:11 GMT

చాలామంది ఆవేశంలో నోరు జారుతారు. తర్వాత కొందరు తప్పయిపోయిందని ఒప్పుకుంటారు. మరికొందరు మాత్రం తాము మాట్లాడింది కరెక్టే అని సమర్ధించుకుంటారు. ఇంకొందరు మాత్రం మళ్ళీ అలాంటి మాటలను కావాలనే రిపీట్ చేస్తుంటారు. ఇపుడు విషయం ఏమిటంటే గురువారం ఉదయం ‘బీఆర్ఎస్ ఎంఎల్ఏ పాడి కౌశిక్ రెడ్డిని ఉద్దేశించి తాను మాట్లాడిన మాటలు తప్పే’ అని మరో ఎంఎల్ఏ అరెకపూడి గాంధీ అంగీకరించారు. తనను టార్గెట్ చేస్తు కౌశిక్ రిపీటెడుగా రెచ్చగొట్టేట్లుగా మాట్లాడాడు అని గాంధీ అన్నారు. కౌశిక్ రెచ్చగొట్టడం వల్లే తాను బ్యాలెన్సు కోల్పోయి నోటికొచ్చినట్లుగా దుర్భాషలాడినట్లు అంగీకరించారు. సరే తాను మాట్లాడినందుకు కారణాలను సమర్ధించుకున్నా వాడిన భాష మాత్రం తప్పేనని ఒప్పుకున్నారు. అంతవరకు సంతోషించాల్సిందే.

ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టి రాష్ట్రాన్ని నాశనం చేయాలని కౌశిక్ ప్రయత్నించినట్లు గాంధీ ఆరోపించారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టేట్లుగా కౌశిక్ ను ఎవరు ప్రోత్సహించారో జనాలకు తెలియాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని డిస్ట్రబ్ చేయాల్సిన పరిస్ధితి బీఆర్ఎస్, కౌశిక్ కు ఎందుకొచ్చిందో అందరు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. మహిళలను కూడా అవమానించేట్లుగా పాడి మాట్లాడిన మాటలను గాంధీ గుర్తుచేశారు. తన భాషను మార్చుకోవాలని హరీష్ రావు సూచించినట్లు గాంధీ చెప్పారు. నిజమే తాను భాషను మార్చుకోవాల్సిన అవసరం ఉందని అంటూనే ఉన్నతమైన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై హరీష్ మాట్లాడిన భాష మాటేమిటి ? అని చురకలంటించారు.

ఇక్కడితో గాంధీ ఎపిసోడ్ అయిపోయినట్లుగానే భావించాలి. ఇదే సమయంలో కౌశిక్ తాను వాడిన భాష విషయంలో ఇంతవరకు స్పందించలేదు. ఫిరాయింపు ఎంఎల్ఏలు రాజీనామాలు చేయకపోతే చీరలు కట్టుకుని, గాజులు వేసుకుని జనాల్లో తిరగాలని మీడియా సమావేశంలోనే చీరలు, గాజులను చూపించారు. గాంధీతో వ్యక్తిగత విభేదాలుంటే తీర్చుకునే విధానం వేరుగా ఉండగా మధ్యలో చీరలు, గాజుల ప్రస్తావన ఎందుకు తెచ్చినట్లు ? ఈ విషయం ఇలాగుండగానే తాను ప్యూర్ తెలంగాణా బిడ్డనని గాంధీకి తెలంగాణా పవర్ అంటే ఏమిటో చూపిస్తానని చాలెంజ్ చేశారు.

ఆంధ్రానుండి ఇక్కడకు బతకటానికి వచ్చిన గాందీ తనింటిమీద దాడిచేయటం ఏమిటని పాడి మండిపోయారు. వ్యక్తిగత వివాదాన్ని వ్యక్తిగతంగా చూడకుండా మధ్యలో ఆంధ్రా నుండి బతకటానికి వచ్చావని, తెలంగాణా పవర్ చూపిస్తానని అనాల్సిన అవసరమే లేదు. కౌశిక్ వ్యాఖ్యలపై పార్టీ చీఫ్ కేసీఆర్, అగ్రనేతలు కేటీఆర్, హరీష్ అసలు నోరెత్తనే లేదు. గాంధీ తాను మాట్లాడింది తప్పే అని అంగీకరించారు కాబట్టి కౌశిక్ కూడా తను మాట్లాడిన మాటలపై క్లారిటి ఇస్తారని అనుకుంటున్నారు. మరి కౌశిక్ ఏమి చేస్తారో చూడాల్సిందే.

Tags:    

Similar News