UPASANA TWEET| రామ్ చరణ్ దర్గా సందర్శన, విమర్శకులకు ఉపాసన రిప్లై
ది గేమ్ ఛేంజర్ హీరో రామ్ చరణ్ (RAM CHARAN) కడప పర్యటనపై సోషల్ మీడియాలో హోరెత్తుతున్న ప్రచారంపై రామ్ చరణ్ భార్య ఉపాసన సున్నితంగా, ఘాటుగా స్పందించారు.
By : The Federal
Update: 2024-11-20 12:32 GMT
మెగాస్టార్ చిరంజీవి కుమారుడు, ది గేమ్ ఛేంజర్ హీరో రామ్ చరణ్ (RAM CHARAN) కడప పర్యటనపై సోషల్ మీడియాలో హోరెత్తుతున్న ప్రచారంపై రామ్ చరణ్ భార్య ఉపాసన సున్నితంగా, ఘాటుగా స్పందించారు. ప్రతి విషయాన్నీ విమర్శించాల్సిన అవసరం ఉందా అని సోషల్ మీడియాను ప్రశ్నించారు. కడప పెద్ద దర్గాలో నిర్వహించిన 80వ నేషనల్ ముషాయిరా గజల్ ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా రామ్‌చరణ్ హాజరయ్యారు. ఈ సందర్భంలో ఆయన అయ్యప్ప స్వామివారి మాలలో ఉన్నారు. కడప వెళ్లిన రామ్ చరణ్ దర్గాను సందర్శించడంపై సోషల్ మీడియాలో పలువురు విమర్శలు చేశారు. ఏఆర్ రహమాన్ ను కూడా అయ్యప్పస్వామి ఆలయానికి తీసుకువెళతారా అని కొందరు, మాలధారణలో ఉండి దర్గాకు ఎలా వెళతారని ఇంకొందరు వ్యాఖ్యలు చేశారు. దీనిపై రామ్‌చరణ్ భార్య ఉపాసన అసహనం వ్యక్తంచేశారు.
ఆమె ఏమన్నారంటే,,,
కడప దర్గాలో నవంబర్ 18న 80వ జాతీయ ముషాయిరా గజల్ కార్యక్రమం జరిగింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రామ్ చరణ్ హాజరయ్యారు. ఈ సందర్భంలో రామ్ చరణ్ అటు గుడికి ఇటు దర్గాకి వెళ్లివచ్చారు. రెండు చోట్లా ప్రార్ధనలు చేశారు. దీనిపై సోషల్‌మీడియా వేదికగా విమర్శలు వచ్చాయి. దీనిపై ఉపాసన స్పందించారు. ఇప్పుడా పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. చరణ్ అన్ని మతాలను గౌరవిస్తుంటారని ఉపాసన పేర్కొన్నారు.
‘‘దేవుడిపై విశ్వాసం అందరినీ ఏకం చేస్తుంది. చిన్నాభిన్నం చేయదు. భారతీయులుగా మేము అన్ని మత విశ్వాసాలను గౌరవిస్తాం. ఐక్యతలోనే మా బలం ఉంది. రామ్‌చరణ్ తన మతాన్ని అనుసరిస్తూనే ఇతర మతాలనూ ఎప్పుడూ గౌరవిస్తుంటారు’’ అని ఉపాసన పేర్కొన్నారు. ‘వన్ నేషన్.. వన్ స్పిరిట్’ అని ఆమె హ్యాష్‌ట్యాగ్ జత చేశారు.
సోషల్ మీడియా పోస్టుల్లో రామ్ చరణ్ సినిమాలను ప్రస్తావించారు. చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆయన ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. కియారా అడ్వాణీ కథానాయిక. జనవరి 10న ఇది విడుదల కానుంది. మరోవైపు, త్వరలో ఆయన బుచ్చిబాబుతో మూవీ పట్టాలెక్కించనున్నారు. ఈనేపథ్యంలోనే బుచ్చిబాబుతో కలిసి దర్గాలో జరిగిన ఈవెంట్‌కు వచ్చారు. ‘‘నా కెరీర్‌ను మలుపుతిప్పిన సినిమా ‘మగధీర’. ఆ సినిమా రిలీజ్‌కు ఒక్కరోజు ముందు ఈ దర్గాకు వచ్చా. ఇక్కడి పెద్దల ఆశీర్వాదాలు తీసుకున్నా. నాకు మంచి స్టార్‌డమ్ తీసుకొచ్చింది. ఈ దర్గాకు ఎప్పటికీ రుణపడి ఉంటా. బుచ్చిబాబుతో చేయనున్న సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఆయనే నాకు ఈ కార్యక్రమం గురించి చెప్పారు. కచ్చితంగా ఈ ముషాయిరా గజల్ ఈవెంట్‌కు వస్తానని రెహమాన్‌కు మాటిచ్చా. అయ్యప్ప మాలలో ఉన్నప్పటికీ ఆయనకు ఇచ్చిన మాట తప్పకూడదని ఇక్కడికి వచ్చా. ఎంతో ఆనందంగా ఉంది’’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ముందు సమీపంలోని విజయదుర్గాదేవి ఆలయంలో చరణ్ - బుచ్చిబాబు ప్రత్యేక పూజలు చేశారు.
సోషల్ మీడియా పేరిట ప్రతి విషయాన్నీ వివాదం చేయాలని చూడడం తగదని పలువురు సినీ ప్రముఖులు వ్యాఖ్యానించారు.