వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీ చేతుల్లోకి...

వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీ చేతుల్లోకి ఏసిఏ వెళుతోంది. అపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యులు రాజీనామా చేశారు. రాజీనామాలకు ఆమోదం లభించింది.

Update: 2024-08-05 05:09 GMT

ఆంధ్ర క్రికెట్‌ సోసియేషన్‌లో రాజకీయ నాటకానికి తెరపడింది. ఎప్పుడూ లేని విధంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తన బంధువులను ఏసీఏ ద్వారా పోటీ చేయించి గెలిపించుకుంది. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఆ కమిటీని బలవంతంగా రాజీనామా చేయించి తమ వారిని ఎన్నికల బరిలోకి దించేందుకు కార్యాచరణ రూపొందించింది. ఏసిఏ ప్రత్యేక సమావేశానికి విజయవాడ వేదికైంది. వైఎస్సార్‌సీపీ అధికారం చేపట్టగానే గతంలో ఉన్న సభ్యుల పదవీ కాలం ముగిసే వరకు కొనసాగారు. ఆ తరువాత తమ వారికి అవకాశం వచ్చేలా వైఎస్సార్‌సీపీ పావులు కదిపింది. విజయవాడలో ఉన్న ఏసీఏ కార్యాలయాన్ని విశాఖపట్నం తరలించారు. రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తన ఆదిపత్యాన్ని క్రికెట్‌ అసోసియేషన్‌లో నిలుపుకున్నారు.

Delete Edit

ఎందుకు ఇంత పోటీ?

క్రికెట్‌ అసోసియేషన్‌లో వందల కోట్ల ధనం ఉంటోంది. అసోసియేషన్‌కు అన్ని జిల్లాల్లోనూ ఆఫీసులు ఉన్నాయి. అసోసియేషన్‌ క్రికెట్‌ రంగంలో రాణించే యువతీ యువకులకు ప్రోత్సాహకాలు కూడా అందిస్తోంది. కొందరికి పౌష్టికాహారం కూడా అందిస్తోంది. ఒక్క క్రికెట్‌లోనే కాకుండా క్రీడల్లో రాణించే వారికి అసోసియేషన్‌ నుంచి మంచి ప్రోత్సాహం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఎవరు క్రికెట్‌ ఆడాలన్నా అసోసియేషన్‌ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా క్రికెట్‌ ప్రపంచం నుంచి ఎన్నిటీములైనా ఆడవచ్చు. కోచ్‌లు కూడా అసోసియేషన్‌ నిబంధనలకు కట్టబడి ఉండాల్సిందే. మ్యాచ్‌ల సందర్బంగా వచ్చే డబ్బుతో పాటు క్రికెట్‌ క్రీడను ప్రోత్సహించే వారి ఆర్థిక సాయం కూడా అసోసియేషన్‌కు అందుతుంది. మంచి ఆర్థిక బలమున్న సంస్థగా క్రికెట్‌ అసోసియేషన్‌ ఉంది. రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన అసోసియేషన్‌ రాజకీయ నాయకుల చేతుల్లోకి పోవడం విచారకరమని పలువురు క్రీడాకారులు వ్యాఖ్యానిస్తున్నారు. అసోసియేషన్‌లోకి పార్టీలు చొరబడటానికి క్రీడాకారుల్లో కొందరు కారణమనే విమర్శలు ఉన్నాయి.
వ్యాపారాలపై ఎక్కుపెడతారనే..
ప్రస్తుతం అపెక్స్‌ కౌన్సిల్‌లో ఉన్న సభ్యులు అందరికీ సొంత వ్యాపారాలు ఉన్నాయి. తాము తెలుగుదేశం పార్టీ వారు చెప్పినట్లు రాజీనామా చేయకుంటే తమ వ్యాపారాలను దెబ్బతీసే అవకాశం ఉందని భావించి వీరు రాజీనామా చేశారు. వీరి పదవీ కాలం ఇంకా ఏడాది పైనే ఉంది. అయినా రాజీనామా చేశారు. వైఎస్సార్‌సీపీలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి సొంత అల్లుడు ఒకరు కాగా అల్లుని సోదరుడు మరొకరు అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ఉన్నారు. వీరితో పాటు మిగిలిన వారు కూడా వైఎస్సార్‌సీపీకి అనుకూలురనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వారు రాజీనామాలు చేశారు.
టీడీపీ కబంధ హస్తాల్లోకి...
ఇప్పటి వరకు వైఎస్సార్‌సీపీ కబంధ హస్తాల్లో చిక్కుకున్న ఏసీఏ ఇక నుంచి తెలుగుదేశం పార్టీ కబంధ హస్తాలోకి వెళుతోంది. విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్‌ను ఏసీఏ అధ్యక్షునిగా చేసేందుకు రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ నిర్ణయించారు. ఈ మేరకు ఆయనను చిత్తూరు జిల్లాలోని ఒక క్రికెట్‌ క్లబ్‌ నుంచి సభ్యునిగా చేర్పించి అక్కడ ఓటు హక్కు లభించగానే ఎన్నికల్లో పోటీ చేయించేందుకు రెడీ చేశారు. ఆయనతో పాటు బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు కూడా అసోసియేషన్‌లో బాధ్యలు చేపట్టే అవకాశం ఉంది. వీరిద్దరూ ఆదివారం రాత్రి విజయవాడలో జరిగిన ఏసీఏ ప్రత్యేక సమావేశానికి హాజరు కావడం విశేషం.
సభ్యుల రాజీనామా
ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) ఆరుగురు అపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యులు రాజీనామా చేశారు. వీరు చేసిన రాజీనామాలను ఆదివారం విజయవాడలోని ఓ హోటల్‌ లో నిర్వహించిన ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో ఆమోదించారు. ఏసీఏ అధ్యక్షుడు పి శరత్‌ చంద్రారెడ్డి, ఉపాధ్యక్షుడు పి రోహిత్‌ రెడ్డి, కార్యదర్శి ఎస్‌ఆర్‌ గోపినాథ్‌ రెడ్డి, సంయుక్త కార్యదర్శి రాకేష్, ట్రెజరర్‌ ఎవి చలం, కౌన్సిలర్‌ పురుషోత్తం చేసిన రాజీనామాలను ఆమోదించారు. ఎన్నికల నిర్వహణ పూర్తయ్యే వరకు రోజు వారీ కార్యక్రమాల నిర్వహణ కోసం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని నియమించారు. ఇందులో మాంఛో ఫెర్రర్, మురళీ మోహన్, ఆర్‌విఎస్‌కె రంగారావులను నియమిస్తూ ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల అధికారిగా రాష్ట్ర మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ను నియమించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని), విశాఖపట్నం నార్త్‌ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజుతో పాటు వివిధ జిల్లాలకు చెందిన క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు, క్లబ్‌ మెంబర్లు పాల్గొన్నారు.
Tags:    

Similar News