బిజెపి రాజ్యసభ సర్ ప్రైజ్ చాయిస్: ఎవరీ పాకా సత్యనారాయణ

ఆంధ్రాలో బిజెపి బిసిలను మచ్చిక చేసుకోవాలనుకుంటున్నదా?;

Update: 2025-04-29 07:48 GMT
పాక వెంకట సత్యనారాయణ (ఫైల్ ఫొటో)

వైఎస్సార్సీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన రాజ్యసభ స్థానం బీజేపీ నేత పాకా వెంకట సత్యనారాయణకు దక్కింది. ఆయన పేరు ఎవరూ వూహించలేదు. ఆయన పార్టీకి, ఆర్ ఎస్ ఎస్ సిద్ధాంతలకు కట్టుబడిన వాడే కాదు, వెనకబడిన వర్గానికి కూడా చెందిన వాడు. దీనిని బట్టి ఆంధ్రప్రదేశ్ లో బిజెపి చాలా పకడ్బందీగా వ్యూ: తయారు చేసుకుంటూ బిసిలను మచ్చిక చేసుకోవాలనుకుంటున్నట్లు అర్థమవుతుంది. ఉన్నట్లుండి ఆకాశం నుంచి ఊడిపడట్లు హెడ్ లైన్ అయిపోయిన ఈ పాకా ఎవరు?

ఆర్ ఎస్ ఎస్ నుంచి ఆర్ ఎస్ దాకా

పాకా వెంకట సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి వచ్చిన బీజేపీ సీనియర్ నాయకుడు. 64 ఏళ్ల వయస్సు. వృత్తిరీత్యా న్యాయవాది. ఆయన రాజకీయ జీవితం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)తో 1976లో ప్రారంభమైంది. ఆ తర్వాత 1980లో బీజేపీలో చేరారు. అప్పటి నుంచి ఆయన పార్టీలో వివిధ కీలక బాధ్యతలు నిర్వహించారు.

ఇది బీజేపీ సైద్ధాంతిక మూలం. బీజేపీలో చేరి, భీమవరంలో స్థానిక స్థాయిలో పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నారు. 1996లో నరసాపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికలో ఆయన చీఫ్ ఎలక్షన్ ఏజెంట్‌గా ప్రస్తుత కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ పనిచేశారు. 2009-2012 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ రాష్ట్ర ప్రశిక్షణ (పార్టీ కార్యకర్తలకు ఇచ్చే రాజకీయ, సంస్థాగత, సైద్ధాంతిక శిక్షణ) విభాగం సహయ కన్వీనర్‌గా పనిచేశారు. 2012-2018 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నారు. 2009-2014 బిజెపి ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పన కమిటీ సభ్యుడిగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కోసం పనిచేశారు. 2018-2021లో బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ బీజేపీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా ఉన్నారు.

సత్యనారాయణ బీసీ (గౌడ్) సామాజిక వర్గానికి చెందినవారు. ఇది ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా కీలకమైన సామాజిక వర్గం. ఆయనకు 45 ఏళ్లకు పైగా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌తో సుదీర్ఘ అనుబంధం ఉంది.


పాకా సత్యనారాయణ ఎలా తెరపైకి వచ్చారు?

సత్యనారాయణ ఎంపిక చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే ఆయన పేరు రాజ్యసభ అభ్యర్థిగా ఊహాగానాల్లో లేదు. అన్నామలై, స్మృతి ఇరానీ, మంద కృష్ణమాదిగ వంటి పేర్లు తెరపైకి వచ్చాయి. మీడియాకు అంతుచిక్కకుండా బిజెపి వ్యూహం తయారుచేసింది. బీజేపీ హైకమాండ్ ఇపుడవార్లల్లోని వ్యక్తి అయిన సత్యనారాయణను ఎంపిక చేసింది. సత్యనారాయణ రాష్ట్ర రాజకీయాల్లో అంత ప్రముఖంగా కనిపించలేదు. ఇలాంటి ఎంపికలు బీజేపీ వ్యూహంలో సాధారణం. ఎందుకంటే ఇది ఊహాగానాలను తప్పించి స్థానిక కార్యకర్తలకు గుర్తింపు ఇచ్చింది. గోదావరి జిల్లాల్లో బీసీ సామాజిక వర్గాల్లో సత్యనారాయణకు కొంత మద్దతు ఉంది. ఇది బీజేపీకి ఈ ప్రాంతంలో పట్టు సాధించడానికి సహాయపడుతుంది. సత్యనారాయణ ఆర్‌ఎస్‌ఎస్‌తో సుదీర్ఘ అనుబంధం ఉంది. ఆయన ఎంపికలో ఆర్‌ఎస్‌ఎస్ సిఫారసు ఉందని బీజేపీ వారు చెబుతున్నారు.

బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ, అమిత్ షా, జెపి నడ్డా నేతృత్వంలో సత్యనారాయణ ఎంపికను ఖరారు చేశారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఏపీ బీజేపీ చీఫ్ డి పురందేశ్వరి యూరప్‌లో ఉన్నప్పటికీ, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. 1996 ఎన్నికల్లో సత్యనారాయణ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్‌గా పనిచేసిన శ్రీనివాస వర్మ ప్రస్తుతం కేంద్ర మంత్రి. ఆయన ఎంపికలో కొంత పాత్ర పోషించి ఉండవచ్చని సమాచారం. మంగళవారం ఏపీ అసెంబ్లీలో సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు.

బీజేపీ ఆంధ్రా లో బలపడేందుకు రాజకీయ వ్యూహాలు

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ రాజకీయ ఆధిపత్యం సాధించడం కంటే, తన ప్రభావాన్ని పెంచుకోవడంపై దృష్టి సారించింది. దీనికి కొన్ని వ్యూహాలు రూపొందించుకుంది. 2018లో టీడీపీతో విడిపోయిన తర్వాత, 2024లో బీజేపీ మళ్లీ టీడీపీ, జనసేనతో కూటమి ఏర్పాటు చేసింది. ఈ కూటమి 2024 ఎన్నికల్లో 164 అసెంబ్లీ సీట్లు, 21 లోక్‌సభ సీట్లను గెలుచుకుంది. ఇది బీజేపీకి రాష్ట్రంలో అత్యధికమైన ప్రాతినిధ్యాన్ని అందించింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలను ఆకర్షించడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. పాకా సత్యనారాయణ వంటి బీసీ నాయకుడిని రాజ్యసభకు ఎంపిక చేయడం ఈ వ్యూహంలో భాగం. బీసీ సామాజిక వర్గం ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్లలో ఎక్కువ భాగం ఈ నిర్ణయం ఈ వర్గాల్లో బీజేపీ పట్ల మద్దతును పెంచే అవకాశం ఉంది. బీజేపీ స్థానికంగా పట్టు ఉన్న నాయకులను ప్రోత్సహిస్తోంది. వీరు రాష్ట్రంలో పార్టీ స్థానిక ఆధారాన్ని బలోపేతం చేయగలరు. సత్యనారాయణ ఎంపిక ఈ విధానాన్ని సూచిస్తుంది. ఎందుకంటే ఆయన దశాబ్దాలుగా పార్టీ కోసం కష్టపడిన కార్యకర్త. రాజ్యసభ సీట్లు బిజెపికి జాతీయ స్థాయిలో రాజ్యసభ శక్తిని పెంచడానికి కీలకం. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి ప్రస్తుతం ఒక రాజ్యసభ సీటు ఆర్ కృష్ణయ్య తో భర్తీ చేసింది. సత్యనారాయణ ఎన్నికతో ఈ సంఖ్య రెండుకు పెరుగుతుంది. 175 స్థానాలున్న అసెంబ్లీలో బిజెపికి ఉండేవి ఎనిమిది సీట్లే. ఈ సీట్లకి ఒక్క రాజ్యసభ సీటు కూడా రాదు. అయినా బిజెపి, నయాన్నో భయన్నో తెలుగుదేశం రెండు సీట్లు కేటాయించేలా చేసుకుంది. ఈ రెండు కూడా వైఎస్ ఆర్ కాంగ్రెస్ నుంచి వచ్చినవే.

చంద్రబాబు బీజేపీ కోర్కెలను ఎందుకు సమర్థిస్తున్నారు?

చంద్రబాబు బీజేపీ కూటమిలో ఉండటం వల్ల రాష్ట్ర రాజకీయాల్లో ఎదురులేని శక్తిగా, కేంద్రంతో సంబంధాలను బలోపేతం చేయడానికి కీలకంగా భావిస్తున్నారు. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంక్షోభంతో సతమతమఎవుతోంది. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ఆర్థిక సహాయం అవసరం. బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎలో భాగంగా, టీడీపీ కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి ప్రాధాన్యత కల్పించేలా చూడగలదు. 2019లో వైఎస్ఆర్‌సీపీ చేతిలో ఓడిపోయిన తర్వాత, చంద్రబాబు రాష్ట్రంలో టీడీపీ ఆధిపత్యాన్ని పునరుద్ధరించడానికి బీజేపీ, జనసేనతో కూటమిని అవసరమైన వ్యూహంగా భావించారు. ఈ కూటమి 2024లో విజయవంతమైంది. అయితే, తానుబిజెపికి, ప్రధానిమోదీకి చాలా దగ్గిర అనేసందేశం చంద్రబాబు ఇవ్వాలనుకున్నట్లుంది. ముఖ్యంగా ఈ సందేశం జనసేనకు పంపినట్లుంది. టిడిపికి జనసేనకి పైకి అంతగా కనిపించని గ్యాప్ మొదలయింది. ఇది సహజం.జనసేన అధినేత పవన్ తో టిడిపికి ఎపుడైనా చిక్కులు రావచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి కావాలన్న పవన్ కోరిక నారాలోకేష్ పట్టాభిషేకానికి స్పీడ్ బ్రేకర్ వంటిది. ఇది తక్షణ అజండా కాదు కాబట్టి పవన్ ఇపుడు మౌనంగా ఉండవచ్చు. కాని భవిష్యత్తులో ఇలాగే ఉండే అవకాశం లేదు. ఆయన అభిమానులు కార్యకర్తలు ఉండనీయరు కూడా.

అదనపు రాజ్యసభ సీటు ఎందుకు?

బీజేపీకి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో 8 ఎమ్మెల్యే సీట్లు, 2 లోక్‌సభ సీట్లు, ఒక కేంద్ర మంత్రి పదవి ఉన్నప్పటికీ, అదనపు రాజ్యసభ సీటు తీసుకోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. 2024లో చంద్రబాబు నాయుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మధ్య జరిగిన సమావేశంలో, ఖాళీగా ఉన్న రాజ్యసభ సీటును బీజేపీ అభ్యర్థితో భర్తీ చేయాలని నిర్ణయించారు. ఇది ఎన్‌డిఎ కూటమిలో భాగంగా సీటు షేరింగ్ ఒప్పందంలో ఒక భాగంగా జరిగినట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీకి రాజ్యసభలో మెజారిటీ సాధించడానికి అదనపు సీట్లు అవసరం. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన-బిజెపి కూటమికి 175 సభ్యుల అసెంబ్లీలో 164 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఇది బీజేపీ అభ్యర్థి సత్యనారాయణ ఎన్నికను సులభతరం చేసింది. బీసీ నాయకుడిని ఎంపిక చేయడం ద్వారా బీజేపీ ఏపీలో బీసీ వర్గాలను ఉపయోగించుకుని పార్టీని విస్తరించడానికి ప్రయత్నిస్తోంది. ఇది రాష్ట్రంలో భవిష్యత్ ఎన్నికల్లో బీసీ ఓటర్ల మద్దతును పొందే అవకాశాన్ని పెంచుతుందని చెప్పొచ్చు.

బీజేపీ ఇమేజ్‌పై ప్రభావం

పాకా సత్యనారాయణ ఎంపిక బీజేపీ ఇమేజ్‌ను ఏపీలో పెంచే అవకాశాలు ఉన్నాయి. సత్యనారాయణ వంటి స్థానిక, దీర్ఘకాల కార్యకర్తను ఎంపిక చేయడం ద్వారా బీజేపీ రాష్ట్రంలో తన స్థానిక బలాన్ని పెంచుకునేఅవకాశం ఉంది. ఇది పార్టీని రాష్ట్ర ఓటర్లకు మరింత సమీపంగా తసుకెళుతుందనే భావన వారిలో ఉంది. బీసీ నాయకుడిని ఎంపిక చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో కుల ఆధారిత రాజకీయాల్లో కీలకం అవుతుంది. సత్యనారాయణ ఎంపిక పార్టీ కోసం దశాబ్దాలుగా కష్టపడిన కార్యకర్తలకు బీజేపీ గుర్తింపు ఇస్తుందని సూచిస్తుంది. ఇది స్థానిక కార్యకర్తల మనోధైర్యాన్ని పెంచుతుంది.

చంద్రబాబు అయిష్టంగా సమర్థిస్తున్నారా?

చంద్రబాబు నాయుడు బీజేపీ కోర్కెలను అయిష్టంగా సమర్థిస్తున్నారనే అభిప్రాయం టీడీపీ వర్గాల్లో బలంగా ఉంది. ఈ నిర్ణయం రాజకీయ పరస్పర లాభం కోసం ఒక వ్యూహాత్మక ఒప్పందంగా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు 2018లో ఎన్‌డిఏ నుంచి వైదొలిగారు. కానీ 2024లో మళ్లీ చేరారు. ఇది రాష్ట్రంలో వైఎస్ఆర్‌సీపీని ఓడించడానికి, కేంద్రంతో సంబంధాలను బలోపేతం చేయడానికి అవసరమైన చర్యగా భావించారు. అయితే గతంలో చంద్రబాబు బీజేపీ అభ్యర్థుల నామినేషన్‌లపై అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. 2014లో బీజేపీ అభ్యర్థులు "వార్డ్ మెంబర్‌గా కూడా గెలవలేనివారు" అని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ, ప్రస్తుత కూటమి ఒప్పందం కింద చంద్రబాబు నాయుడు బీజేపీ కోర్కెలను సమర్థించడం రాజకీయ అవసరంగా కనిపిస్తుంది. అయిష్టంగా కాదు.

Tags:    

Similar News